శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం

ABN , First Publish Date - 2020-03-11T08:02:40+05:30 IST

వయసులో చిన్నవాడైనా.. యముని సన్నిధికి వెళ్లి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు, మంచి నడవడికి ప్రతిరూపం. నచికేతుడి వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుడి తండ్రి

శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం

వయసులో చిన్నవాడైనా.. యముని సన్నిధికి వెళ్లి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు, మంచి నడవడికి ప్రతిరూపం. నచికేతుడి వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు ఒక యాగం చేసి, చివర్లో దానాలు చేస్తుండగా.. చిన్నారి నచికేతుడు వెళ్లి ‘నాన్నా మరి నన్నెవరికి దానం చేస్తావు’ అని పదేపదే అడుగుతాడు. కొడుకు మాటలతో విసిగిన వాజశ్రవుడు ‘నిన్ను యముడికి దానం చేశాను పో’ అంటాడు. తర్వాత.. ఆ మాట అన్నందుకు బాధపడతాడు. తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచికేతుడు యముని వద్దకు వెళ్తాడు. కానీ అక్కడ యమదర్శనం కలగదు. దీంతో అన్నపానీయాలు ముట్టకుండా మూడురోజులపాటు గడుపుతాడు. మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకుని.. మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచికేతునికి మూడు వరాలనిస్తాను కోరుకోమంటాడు. తిరిగి వెళ్లినప్పుడు తండ్రి తనను ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే.. యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు. స్వర్గప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే.. ‘అగ్నిచయనం’ గురించి చెప్పి, ఆ యాగం ఇకపై ‘నాచికేతాగ్ని చయనం’గా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు. మూడో వరం కోరుకోమన్నప్పుడు.. ‘మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు? ఆత్మస్వరూపం ఎట్టిది? ఈ విషయమై నా సంశయం పోగొట్టండి’ అని కోరడంతో యముడు ఆశ్చర్యపోతాడు. నచికేతుని శ్రద్ధాయోగ్యతలను పరీక్షించేందుకు.. ‘‘నచికేతా! మరణం తర్వాత ఆత్మ ఉండునా? అనే విషయమే అతి సూక్ష్మమైనది, తెలుసుకోవడానికి కఠినమైనది. కాబట్టి,అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను’’ అంటాడు. అందుకు నచికేతుడు.. ‘కఠినమైన విషయాన్ని మీవలె బోధ చేసేవారు దొరకరు. ఆత్మను తెలుసుకోవడం కన్నా నాకింకొక వరమేమీ అక్కర్లేదు’ అంటాడు. నచికేతుణ్ని ప్రలోభ పెట్టడానికి యముడు.. ‘నీకు సుఖాలనందజేసే పుత్రులను, పౌత్రులను ఇవ్వాలని కోరుకో. నీ సుఖజీవనానికి అవసరమైన ఆలమందలను, ఏనుగులను, గుర్రాలను, వాటిని పోషించడానికి కావాల్సినంత బంగారాన్ని ఇస్తాను. విశాలమైన భూభాగాన్ని ఇస్తాను. ఆ సంపదలను, సుఖాలను నీవెంత కాలం అనుభవింపదలిస్తే అంత కాలం ఆయువునిస్తాను. నిన్ను రాజును చేస్తాను!’ అని చెబుతాడు. అందుకు నచికేతుడు.. ‘యమధర్మరాజా.. లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవేకదా! ఇంద్రియాలను కుంగదీసే సుఖాలను నేను నమ్మను. ఎక్కువ ధనం, భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు. ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా? నీ దర్శనం దొరికింది. కనుక ఈ ధన, కనక, వస్తువాహనాలపై నాకు భ్రమ లేదు. ఆత్మతత్వం తెలుసుకోవడం తప్ప మరొక వరం నాకొద్దు’ అంటూ తన దృఢసంకల్పాన్ని తెలియజేస్తాడు. యముడు అతడి శ్రద్ధకు, పట్టుదలకు మెచ్చి.. జీవాత్మ, పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి, మోక్షానికి కావలసిన సాధనలు తెలియజేస్తాడు. ఏ జ్ఞానమైనా తపన, ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియజెప్పే అద్భుత వృత్తాంతమిది.

- జక్కని వేంకటరాజం, 9440021734

Updated Date - 2020-03-11T08:02:40+05:30 IST