టైటిల్‌ బెంగ తీరేనా ?

ABN , First Publish Date - 2021-04-04T09:40:45+05:30 IST

ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, డివిల్లీర్స్‌, యువ చిచ్చరపిడుగు దేవ్‌దత్‌ పడిక్కల్‌, పొట్టి క్రికెట్‌లో ఉత్తమ స్పిన్నర్లు చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో తిరుగులేకుండా ఉన్నా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఐపీఎల్‌ టైటిల్‌ అందని ద్రాక్షగానే మిగిలింది...

టైటిల్‌ బెంగ తీరేనా ?

ఉత్తమ ప్రదర్శన 

రన్నరప్‌

2011, 2016  


ప్లేఆఫ్స్‌

2010, 2015, 2020 

ఐపీఎల్‌ 5 రోజుల్లో



ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, డివిల్లీర్స్‌, యువ చిచ్చరపిడుగు దేవ్‌దత్‌ పడిక్కల్‌, పొట్టి క్రికెట్‌లో ఉత్తమ స్పిన్నర్లు చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో తిరుగులేకుండా ఉన్నా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఐపీఎల్‌ టైటిల్‌ అందని ద్రాక్షగానే మిగిలింది. గత సీజన్‌లో ట్రోఫీపై ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ మేరకు ఆరంభంలో అదరగొట్టినా టోర్నీ చివరి దశకు వచ్చే సరికి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి ‘ఎలిమినేట్‌’ అయ్యింది. ఇక ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ’ అన్న చందంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ను బలోపేతం చేసుకున్న ఆర్‌సీబీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.



(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

నిరుడు ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్‌ వదిలించుకోగా అతడిని ఏకంగా రూ. 14.25 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిందంటే ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోవాలని బెంగళూరు ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతుంది. అలాగే పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని పటిష్టం చేసుకొనేందుకు న్యూజిలాండ్‌కు చెందిన కైల్‌ జేమిసన్‌ను రూ. 15 కోట్లు వెచ్చించి తీసుకుంది. ఈ మొత్తానికి తగిన ఫలితం ఆర్‌సీబీకి లభిస్తుందా అన్నది చూడాలి.



బలం

పేపర్‌పై ఈ జట్టు బ్యాటింగ్‌ అత్యంత బలీయంగా కనిపిస్తున్నది. ఓపెనర్‌గా మెగా లీగ్‌లో దుమ్ము రేపిన కోహ్లీ తాను మళ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నట్టు ఇప్పటికే స్పష్టంజేశాడు. నిరుడు ఐపీఎల్‌ అరంగేట్రంలోనే చెలరేగిన యువ ఆటగాడు పడిక్కల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 194.54 స్ట్రయిక్‌ రేట్‌తో 27 ఏళ్ల వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ అదరగొట్టాడు. కివీ్‌సకు చెందిన ఫిన్‌ అలెన్‌ టాపార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌ దూకుడైన బ్యాటింగ్‌తో మిడిలార్డర్‌ను బలోపేతం చేయనున్నారు. ఇక సచిన్‌ బేబీ, డానియెల్‌ క్రిస్ట్టియాన్‌, సుందర్‌తో బెంగళూరు బ్యాటింగ్‌ మరింత లోతుగా ఉంది. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ సుందర్‌, ఆసీస్‌ ద్వయం మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపాతో.. స్పిన్‌ విభాగం తిరుగులేకుండా ఉంది. ఈసారి టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లు స్పిన్‌కు అనుకూలించే చెన్నై, అహ్మదాబాద్‌ గ్రౌండ్‌లలో ఆడనుండడం ఆర్‌సీబీకి కలిసి రానుంది. 



బలహీనత

అంతగా అనుభవంలేని నవ్‌దీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌తో బెంగళూరు పేస్‌ బౌలింగ్‌ తేలిపోతోంది. జేమిసన్‌ను భారీ మొత్తంతో కొనుగోలు చేసినా అతడు ఇప్పటివరకు టీ20ల్లో అంతగా ప్రభావం చూపలేదు. పైగా జేమిసన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం కూడా లేదు. దాంతో మీడియం పేసర్‌ హర్షల్‌ పటేల్‌, ఆసీస్‌ త్రయం క్రిస్టియన్‌, డానిల్‌ శామ్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. 


స్వదేశీ ఆటగాళ్లు 

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), పడిక్కల్‌, పవన్‌ దేశ్‌పాండే, సుందర్‌, చాహల్‌, సిరాజ్‌, సైనీ, హర్షల్‌ పటేల్‌, సచిన్‌ బేబీ, రజత్‌ పటీదార్‌, మహ్మద్‌ అజరుద్దీన్‌, ప్రభుదేశాయ్‌, కేఎస్‌ భరత్‌, షాబాజ్‌ అహ్మద్‌.


విదేశీ ఆటగాళ్లు

డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌, జేమిసన్‌, జోష్‌ ఫిలిప్‌ (కీపర్‌), డేనియల్‌ శామ్స్‌, జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌, డాన్‌ క్రిస్టియాన్‌.



బెంగళూరు ఎవరితో ఎప్పుడు ?



Updated Date - 2021-04-04T09:40:45+05:30 IST