ఒక ట్వీట్‌తో ఆమె ప్రయత్నం నెరవేరింది!

ABN , First Publish Date - 2020-04-08T05:38:29+05:30 IST

ఆమె ఐఐటీ గ్రాడ్యుయేట్‌... బ్యాంకింగ్‌ రంగంలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని, వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంది. ‘సరళ్‌ డిజైన్స్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారుచేసింది.

ఒక ట్వీట్‌తో ఆమె ప్రయత్నం నెరవేరింది!

ఆమె ఐఐటీ గ్రాడ్యుయేట్‌... బ్యాంకింగ్‌ రంగంలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని, వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంది. ‘సరళ్‌ డిజైన్స్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారుచేసింది. ‘కొవిడ్‌-19’ విస్తరిస్తున్న ఈ సమయంలో న్యాప్‌కిన్స్‌ ఉత్పత్తి చేసే మిషన్‌ను ‘త్రీ ప్లై మాస్క్‌’ల తయారీకి అనుగుణంగా మార్చేసింది. అయితే ఈలోపు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. ఆమె సమస్యల ట్వీట్‌ ఎట్టకేలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాకు చేరింది. ఇంకేం... కథ సుఖాంతమైంది. ‘హీరోస్‌ కంటిన్యూస్‌ టు రైజ్‌...’ అంటూ ఆయన చేసిన ఒక ట్వీట్‌తో ముంబయికి చెందిన సుహానీ మోహన్‌ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇంతకీ ఎవరీ సుహానీ?


సుహానీ మోహన్‌ (29) ఐఐటీ గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే ఒక అంతర్జాతీయ బ్యాంకులో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా ఎదగాలని అనుకుంటున్న సమయంలో ఆమె ఐఐటీ మిత్రుడు కార్తీక్‌ మెహతా చేసిన సూచన మేరకు ఉద్యోగం మానేసి, శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారీ రంగంలోకి ప్రవేశించారు. ఆలోచనను ఆచరణలోకి పెట్టేముందు చాలా పరిశోధనలు చేశారు. ‘సరళ్‌ డిజైన్స్‌’ అనే సంస్థను ఏర్పాటు చేసి ఇద్దరూ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా శానిటరీ ప్యాడ్స్‌ తయారు చేసే డీ సెంట్రలైజ్డ్‌ ఆటోమేటిక్‌ మెషీన్‌ను రూపొందించారు. ఈ మిషన్లను 30కి పైగా వ్యాపారులకు, ఎన్జీవో సంస్థలకు అమ్మడంతో చిన్న చిన్న పట్టణాల్లో సైతం శానిటరీ ప్యాడ్స్‌ తయారీ సులువైంది. ఆ విధంగా ఈ యంత్రాలపై రెండు లక్షలమంది మహిళలకు పైగా ఉపాధి లభించింది. ఐదేళ్లలో వారు సుమారు 70లక్షల ప్యాడ్స్‌ను తయారుచేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు వీరి కృషిని గుర్తించి ప్రశంసించాయి. 


ఏ సీక్వెల్‌ టు ది ‘ప్యాడ్‌మ్యాన్‌’...

కరోనా మనదేశంలో అడుగుపెట్టగానే సుహానీ అప్రమత్తమయ్యారు. ప్రస్తుత సమయంలో మాస్క్‌లు చాలా అవసరమని గుర్తించారు. ప్యాడ్స్‌ తయారుచేసే మిషన్లనే ‘3 ప్లై మాస్క్‌’ల తయారీకి అనుగుణంగా మార్చేలా పథకరచన చేశారు. ‘‘మార్చి 15వ తేదీకే మా డిజైన్లు పూర్తయ్యాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తికి అనుకోని అవాంతరం ఏర్పడింది. నాకు తెలసిన ఎంతోమందిని ట్విట్టర్‌లో సంప్రదిస్తూనే ఉన్నా సాయం చేయమని. వారిలో ఐఐటీలో నా జూనియర్‌ అయిన శృతీ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర వద్ద ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దాంతో నా విన్నపం ఆయనకు చేరింది’’ అన్నారు సుహాని. 


విషయం తెలిసిన వెంటనే ఆనంద్‌ మహీంద్ర ‘ఏ సీక్వెల్‌ టు ది మూవీ ప్యాడ్‌మ్యాన్‌’ అంటూ సుహానీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఆమెకు సాయం చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని అభయం ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా సుహానీ ప్రయత్నానికి చేయూత లభించినట్లయ్యింది. ‘‘ఆనంద్‌ ట్వీట్‌ చేసిన నాలుగు గంటల్లో సీన్‌ మారిపోయింది. ఆయన ‘మహీంద్రా ఆటోమోటివ్‌’ హెడ్‌ను మాకు కనెక్ట్‌ చేశారు. వారి సిబ్బంది మాకు అన్నివిధాల సాయపడ్డారు. మాస్క్‌ల ఉత్పత్తి మొదలెట్టాం. ప్రతీ రోజూ పదివేల మాస్కుల తయారీకి రంగం సిద్ధమైంది. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) విభాగం ద్వారా ఈ మాస్కులను ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీసులు, ఇతర సిబ్బందికి అందిస్తున్నాం. ఈ ‘3 ప్లై మాస్క్‌’లను ప్రజలకు కూడా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఒక ట్వీట్‌ మా ప్రయత్నానికి ఊపిరి పోసింది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు సుహాని.

Updated Date - 2020-04-08T05:38:29+05:30 IST