చైనా ఎత్తులకు భారత్ పై ఎత్తు... కురేభార్ ఎయిర్‌స్ట్రిప్

ABN , First Publish Date - 2021-11-16T21:51:24+05:30 IST

చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత విమానాశ్రయాలను

చైనా ఎత్తులకు భారత్ పై ఎత్తు... కురేభార్ ఎయిర్‌స్ట్రిప్

న్యూఢిల్లీ : చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత విమానాశ్రయాలను ఆధునికీకరించడంతోపాటు కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తోంది. దురాక్రమణ బుద్దిగల చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఉత్తర ప్రదేశ్‌లో కురేభార్ ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించింది. ఇది భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానాలు, రవాణా విమానాల రాకపోకలకు చాలా ఉపయోగపడుతుంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఇటువంటి ఎయిర్‌స్ట్రిప్‌ను ఇదే లక్ష్యంతో నిర్మించారు. 


భారత్-చైనా మధ్య ఎల్ఏసీ 3,488 కిలోమీటర్ల పొడవున ఉంది. చైనా వైపు మౌలిక సదుపాయాలను ఆ దేశం వేగంగా అభివృద్ధి చేస్తోంది. పాత విమానాశ్రయాలను ఆధునికీకరించడంతోపాటు కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తోంది. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే సవాళ్ళను దీటుగా తిప్పికొట్టడం కోసం ఉత్తర ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కురేభార్ ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో యుద్ధ, రవాణా కార్యకలాపాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేవిధంగా ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించారు. 


ఉత్తర ప్రదేశ్ హైవేలపై ఈ విధంగా ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించడం వెనుక భారత వాయు సేన ప్రణాళిక ఉందని నిపుణులు చెప్తున్నారు. మిరేజ్-2000హెచ్ వంటి యుద్ధ విమానాలు, సీ-130 జే హెర్క్యులెస్ వంటి రవాణా విమానాలు దిగడానికి, బయల్దేరడానికి అనువుగా వీటిని నిర్మించారు. 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో పాకిస్థాన్ వాయు సేన విమానాలు మన దేశ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో మన దేశం చాలా విమానాలను కోల్పోయింది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, హైవేలపై ఉన్న ఎయిర్‌స్ట్రిప్స్‌ను ఉపయోగించుకోవాలని వాయు సేన నిర్ణయించింది. తాత్కాలిక లైట్లను వాడుతూ, మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్స్, రీఫ్యూయల్, టేకాఫ్ వంటివాటి కోసం అన్ని వేళలా ఉపయోగించుకోవాలనేది ఐఏఎఫ్ ఉద్దేశం. అయితే ఐఏఎఫ్ ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పడం లేదు.


Updated Date - 2021-11-16T21:51:24+05:30 IST