ఆశావాదంతో ముగిసిన భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు

ABN , First Publish Date - 2021-08-01T20:06:53+05:30 IST

లడఖ్‌లో భారత్-చైనా సైనిక కమాండర్ల 12వ విడత చర్చలు

ఆశావాదంతో ముగిసిన భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు

న్యూఢిల్లీ : లడఖ్‌లో భారత్-చైనా సైనిక కమాండర్ల 12వ విడత చర్చలు ఆశావాదంతో ముగిశాయి. శనివారం ఈ చర్చలు సుమారు 9 గంటలపాటు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి, చైనావైపు ఉన్న మోల్డోలో జరిగిన ఈ చర్చల్లో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చెందిన కార్ప్స్ కమాండర్ ర్యాంక్ అధికారులు పాల్గొన్నారు. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి దళాల ఉపసంహరణకు ముందడుగు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేదానిపై విధివిధానాలను రూపొందించవచ్చునని సమాచారం. భారత్-చైనా సంయుక్త ప్రకటన సోమవారం వెలువడుతుందని భావిస్తున్నారు. 


ఉద్రిక్తతలు తగ్గాలంటే వివాదాస్పద సరిహద్దుల్లోని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఉపసంహరించాల్సిందేనని భారత సైన్యం స్పష్టం చేసింది. అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి దళాల ఉపసంహరణ పూర్తయితే, తూర్పు లడఖ్‌లో ఎల్ఏసీ వెంబడి దళాల ఉపసంహరణ గురించి చర్చిస్తారు. ఆ తర్వాత  ఈ ప్రాంతాల్లో గస్తీకి సంబంధించిన మార్గదర్శకాలను సరికొత్తగా రూపొందిస్తారు. 


తూర్పు లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్సిక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జూలై 14న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి స్పష్టం చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా వాంగ్‌ యీతో జైశంకర్ మాట్లాడారు.  ఈ నేపథ్యంలోనే పన్నెండో విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి.


Updated Date - 2021-08-01T20:06:53+05:30 IST