ఓటీటీ భవిష్యత్‌ ఏమిటి?

ABN , First Publish Date - 2021-02-07T06:32:57+05:30 IST

థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ... భవిష్యత్‌ ఏమిటి? దేనిది? థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ... ఈ పోటీ కొత్త రూపు తీసుకుంటోంది! కరోనా కాలంలో ఓటీటీ కొంత ఎదిగింది! థియేటర్లు తెరచుకోవడంతో దాని భవిష్యత్‌ ఏమిటి? ఓటీటీకి కంటెంట్‌ వనరులు ఏవి? వంటి ప్రశ్నలొస్తున్నాయి...

ఓటీటీ  భవిష్యత్‌ ఏమిటి?

థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ... భవిష్యత్‌ ఏమిటి? దేనిది? థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ... ఈ పోటీ కొత్త రూపు తీసుకుంటోంది! కరోనా కాలంలో ఓటీటీ కొంత ఎదిగింది! థియేటర్లు తెరచుకోవడంతో దాని భవిష్యత్‌ ఏమిటి? ఓటీటీకి కంటెంట్‌ వనరులు ఏవి? వంటి ప్రశ్నలొస్తున్నాయి!


థియేటర్లలో వందశాతం ప్రేక్షకులను అనుమతించే విషయంలో ఇకపై ఎటువంటి ఆంక్షలు లేవు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చాయి.  సంక్రాంతికి విడుదలైన చిత్రాలు దాదాపుగా అన్నీ  మంచి వసూళ్లు రాబట్టాయని ఆయా నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత విడుదలైన మీడియమ్‌ బడ్జెట్‌ చిత్రాల దర్శక-నిర్మాతలు, హీరోలదీ అదే మాట! అదీ యాభై శాతం ఆక్యుపెన్సీతో! ఈ పరిస్థితుల్లో ఓటీటీ భవిష్యత్‌ ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతోంది.


థియేటర్లు మూతపడిన సమయంలో ప్రజలకు ఓటీటీ వేదికలే వినోదాన్ని అందించాయి. కొన్ని కొత్త చిత్రాలను విడుదల చేశాయి. కొంతమంది ప్రజలూ వాటికి అలవాటు పడ్డారు. మళ్లీ థియేటర్లు తెరచుకున్న నేపథ్యంలో ఓటీటీలకు గత ఏడాది లభించినట్టు ఆదరణ లభిస్తుందా? భారీ చిత్రాలకు థియేటర్‌, ఓటీటీ విడుదల మధ్య కనీసం ఆరు వారాల గడువు ఉండాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్‌ చేస్తోంది. కరోనాకి ముందు, గతంలోనూ ఇటువంటి డిమాండ్స్‌ డిస్ట్రిబ్యూటర్లు-ఎగ్జిబిటర్ల నుంచి వినిపించాయి. సంక్రాంతి చిత్రం ‘క్రాక్‌’ విడుదలైన నాలుగు వారాల లోపే ఓటీటీలో విడుదలైన తరుణంలో ఈ డిమాండ్‌ మరోసారి తెరపైకి రావడం గమనార్హం.


తెలుగులో ఓటీటీకి ఓటు వేసే వారెందరు?

తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌కి ‘ఆహా’ ఓటీటీలో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆహా’కు మరో అగ్ర నిర్మాత ‘దిల్‌’ రాజు కంటెంట్‌ సలహాదారుగా ఉన్నారు. గతంలో కొన్ని చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా పని చేసిన ప్రసాద్‌ నిమ్మకాయల ‘జీ 5’ ఓటీటీకి కంటెంట్‌ ్క్ష క్రియేటివ్‌ ఎక్విజిషన్‌ హెడ్‌గా ఉన్నారు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలతో కొందరు నిర్మాతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగని, ఓటీటీలో తమ చిత్రాలను విడుదల చేయడానికి ఓటు వేసే వారెందరు? అంటే... సందేహమే. కరోనా కాలంలో ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ ‘రెడ్‌’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయలేదు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రాన్ని తొలుత ‘జీ’కి అమ్మేశారు. తర్వాత థియేటర్లు తెరచుకున్నాయి. అప్పుడు సాయి తేజ్‌, భోగవల్లి బాపినీడు జీ నెట్‌వర్క్‌ ప్రతినిథులను రిక్వెస్ట్‌ చేయడంతో సినిమా థియేటర్లలోకొచ్చింది. ‘హీరోల ఇమేజ్‌ పెరిగి, వాళ్లు పది కాలాలు ప్రజల గుండెల్లో ఉండాలంటే... ప్రేక్షకులు పెద్ద తెర మీదే సినిమా చూడాలి. యాక్టర్లను, హీరోలను స్టార్లు చేసేది వెండితెరే, బుల్లితెర కాదు’ అంటున్నారు ‘స్రవంతి’ రవికిశోర్‌. తమిళ హీరో ధనుష్‌ నటించిన ‘జగమే తంత్రం’ (తమిళంలో ‘జగమే తందిరం’)ను ఓటీటీ విడుదలకు ఇచ్చేశారు. అయితే, థియేటర్ల ఓనర్లు-ఎగ్జిబిటర్లు-డిస్ట్రిబ్యూటర్లు-సినీ ప్రేమికుల వలే తానూ థియేటర్లలో సినిమా విడుదల కావాలని ఆశిస్తున్నట్టు ధనుష్‌ ట్వీట్‌ చేశారు. తాను నటిస్తున్న మరో చిత్రం ‘కర్ణన్‌’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే... నిర్మాతలు, హీరోలు తమ చిత్రాలను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయడానికి సుముఖంగా ఉన్నారని!


ఓటీటీకి ఓటేశారు మరి, ఓటీటీకి కంటెంట్‌ ఎలా?

థియేటర్లలో విడుదలకు దర్శక-నిర్మాతలు, స్టార్లు మొగ్గు చూపితే... ఓటీటీకి కంటెంట్‌ ఎలా? దీనికీ కరోనా మార్గం చూపింది! కంటెంట్‌, కొత్తదనం ఉన్న సినిమాలను సరైన బడ్జెట్‌లో తీస్తే... ఓటీటీలో ఆదరణ దక్కుతుందని ‘కలర్‌ ఫొటో’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ నిరూపించాయి. నిజానికి, థియేటర్లలో విడుదల చేయాలని వీటిని రూపొందించారు. అయితే, పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో విడుదల చేశారు. పాయల్‌ రాజ్‌పుత్‌ ‘అనగనగా ఓ అతిథి’, ప్రియదర్శి ‘మెయిల్‌’ చిత్రాలను, ప్రకాశ్‌రాజ్‌-శ్రీకాంత్‌ నటించిన ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’ వెబ్‌ సిరీస్‌ను ఓటీటీ కోసమే రూపొందించారు. వెండితెరపై చెప్పలేని కొన్ని కథలను ఓటీటీ తెరపై చెప్పే ఆస్కారం ఉందని దర్శక, రచయితలు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం నందినీరెడ్డి, నాగ అశ్విన్‌, తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌రెడ్డి ‘పిట్టకథలు’ యాంథాలజీ తీశారు. చలం రాసిన ‘మైదానం’ సైతం ఓటీటీకి వస్తోంది. ‘నాదీ నీదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాల దర్శకుడు వేణూ ఊడుగుల సారథ్యంలో రూపొందుతోంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అగ్ర దర్శకులు సైతం తాము చెప్పలేని కథలను శిష్యులకు ఇచ్చి ఓటీటీ కోసం గంట నిడివి గల చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటీటీ కోసం కొందరు ప్రత్యేకంగా చిత్రాలు రూపొందించే పనిలో ఉండగా, ఇంకొందరు ఓటీటీ నుంచి మంచి ఆఫర్‌ వస్తే వదులుకోవడం లేదు. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్న సూపర్‌హిట్‌ ‘దృశ్యం’ సీక్వెల్‌ ‘దృశ్యం 2’ అమెజాన్‌లో విడుదల కానుంది. నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ను ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, థియేటర్లు తెరుచుకోవడం, వసూళ్లు వస్తుండటంతో వెనకడుగు వేసినట్టు మరో ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు అధికారికంగా ప్రకటించే వరకూ ఏదీ నమ్మలేం! థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ పోటీ గురించి అల్లు అరవింద్‌ ‘‘థియేటర్లు తెరచుకోవడం వల్ల ఓటీటీకి వచ్చిన ముప్పేమీ లేదని, భవిష్యత్తులో దేని పంథా దానిదే’’ అని గతంలోనే చెప్పారు. చూస్తుంటే థియేటర్లు, ఓటీటీ సమాంతరంగా నడుస్తాయని అనిపిస్తోంది. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలకు ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి... విడుదలకు ముందు సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ అమ్మని పక్షంలో! అందువల్ల, దేని మార్కెట్‌ దానిదే! 

Updated Date - 2021-02-07T06:32:57+05:30 IST