తీరొక్క పూలతో..

ABN , First Publish Date - 2022-09-25T05:43:54+05:30 IST

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. రెండు జాములాయే చందమామ.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అనే పాటలు నేటి నుంచి మారు మోగనున్నాయి.

తీరొక్క పూలతో..
బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

- నేటి నుంచి బతుకమ్మ సంబరాలు

- పూలతో ప్రకృతిని కొలువనున్న మహిళలు

- వచ్చే నెల 3న సద్దుల బతుకమ్మతో ముగింపు

 (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. రెండు జాములాయే చందమామ.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అనే పాటలు నేటి నుంచి మారు మోగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్పింది. మిగతా రోజుల్లో దేవుళ్లను పూలతో పూజిస్తే, తెలంగాణలో మాత్రం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రకృతిలో లభించే తీరొక్క పూలను బతుకమ్మగా పేచ్చి పూజిస్తుంటారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలతో మొదలయ్యే బతుకమ్మ తొమ్మిదవ రోజు వచ్చే నెల 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. 

- ఒక రోజు అధికారికంగా..

 పండుగ నేపథ్యంలో అధికారికంగా కూడా ఒక రోజు జిల్లా కేంద్రంలో బతుకమ్మ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రకృతిలో లభించే తంగేడు, గుమ్మడి, గునుక పువ్వు, కట్ట, చేమంతి, బంతి, రుద్రాక్ష, గోరింట, కలువ, కమలం ఇలా తదితర పూలతో బతుకమ్మలను మహిళలు పేర్చి మధ్యలో గౌరమ్మను పెట్టి దేవాలయాలు, చావిడిల వద్ద లయబద్ధంగా చప్పట్లు కొడుతూ వాటిచుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతుంటారు. ఉయ్యాల, చందమామ, కోల్‌, రాచగుమ్మడి వంటి పదాలను ఉపయోగిస్తూ పాడేపాటలు పరవశింపజేస్తాయి. జానపద రీతిలో సాగే ఈ పాటలు అప్పటికప్పుడే కైకట్టి పాడుతుంటారు. ఒకరు పాడుతుంటే మిగతావాళ్లు వంత పాడుతుంటారు. బతుకమ్మ పాటల్లో శ్రమైక జీవన సౌందర్యం, అచ్చ తెలుగు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. శ్రామికులు, రైతులు, రైతు కూలీలు తాము నిత్యం చేసే పనిలో బాధలు, బతుకు గాథలతో పాటు పురాణ, ఇతిహాస కథలు, తెలంగాణ వీరుల కథలు బతుకమ్మ పాటల్లో వినబడుతాయి.

- తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక..

 ప్రపంచలోనే బతుకమ్మ పండుగ అత్యంత గొప్ప పండుగగా పేరొందింది. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా నిలిచింది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఉద్యమ పాటగా నిలిచింది. ఈ పండుగ సందర్భంగా బియ్యం, పెసళ్లు, మినుములు, మక్కలు, తదితర ధాన్యాలతో చేసిన సత్తు పిండిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. బతుకమ్మకు ముందు పిల్లలు బొడ్డెమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేస్తుంటారు. చివరి రోజు జరిపే సద్దుల బతుకమ్మను మహిళలు, పురుషులు పోటీ పడుతూ గునుక పూలకు రంగులను అద్ది, తీరోక్క పూలతో గోపురం నమూనాలో బతుమ్మలను పేరుస్తూ ఉంటారు. ఊరు ఊరంతా, వాడ వాడంతా డప్పుల చప్పుళ్లతో చెరువు గట్ల వద్దకు, మైదాన ప్రాంతాలకు, దేవాలయాల వద్దకు ఊరేగింపుగా చేరుకుని తమ పిల్లా పాపలను సల్లంగా చూడు, సిరి సంపదలు, సుఖ సంతోషాలను కలిగేలా దీవించవమ్మా గౌరమ్మ.. అంటూ మొక్కుకుంటారు. ఈ పండుగకు ఆడపడుచులను మెట్టినింటి నుంచి పుట్టినింటికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు కొనుగోలు చేసి పండగను సంబురంగా జరుపుకుంటారు. జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, రామగిరి, కమాన్‌పూర్‌, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో అత్యంత వైభవంగా పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండగ ప్రాశస్త్యం గురించి అనేక పురాణ కథలు చెబుతుంటారు. ఈ బతుకమ్మ పండుగను అనేక శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. నాలుగైదు రోజుల నుంచే గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ పండుగ హడావుడి మొదలయ్యింది.

Updated Date - 2022-09-25T05:43:54+05:30 IST