నాన్నకు ప్రేమతో....

ABN , First Publish Date - 2021-06-20T06:36:29+05:30 IST

‘‘ నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే ఓ భద్రత.. చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పే నాన్న.. చూపుడు వేలుతో ప్రపంచాన్ని పరిచయం చేసే మార్గదర్శి నాన్న.. తన రూపాన్ని, వారసత్వాన్ని అస్థిత్వాన్ని పంచే నాన్న.. ప్రతి బిడ్డకు మలిదైవయే.

నాన్నకు ప్రేమతో....

నేడు ఫాదర్స్‌ డే 


 ‘‘ నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే ఓ భద్రత.. చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పే నాన్న.. చూపుడు వేలుతో ప్రపంచాన్ని పరిచయం చేసే మార్గదర్శి నాన్న.. తన రూపాన్ని, వారసత్వాన్ని అస్థిత్వాన్ని పంచే నాన్న.. ప్రతి బిడ్డకు మలిదైవయే. అయితే సమాజంలో అమ్మకు ఇచ్చిన ప్రాధాన్యత నాన్నకు లేదన్నది నిష్టూరత్వం. సృష్టిలో తల్లి.. బిడ్డకు జన్మనిస్తే.. నాన్న జీవితాన్నిస్తాడు. పెంపకంలో కఠినత్వమున్నా.. ఉన్నతమైన భవిష్యత్‌ను ఇచ్చే నాన్నను ‘ఫాదర్స్‌డే’ సందర్భంగానైనా మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉంది.’’

- భూదాన్‌పోచంపల్లి, పెద్దఅడిశర్లపల్లి, ఆత్మకూరు(ఎస్‌), మిర్యాలగూడ, నడిగూడెం 


నాన్నకు అమ్మగా..

మిర్యాలగూడ : చివరి మజిలీలో కన్నతండ్రికి అమ్మ అయ్యింది. కరోనాతో అనారోగ్యం పాలైతే అన్నీతానై సేవచేసింది. మహమ్మారి కరోనా వదిలిపెట్టదని తెలిసినా, తండ్రి వెన్నంటి ఉండి వైద్య సేవలు అందించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రిని దక్కించుకోలేకపోయింది. తానుకూడా కరోనా బారిన పడి ఇంటికే పరిమితమైంది. పసితనంలోనే అమ్మ దూరం కాగా కంటికి రెప్పలా కాచిన తండ్రికి ఆమె తల్లిలా మారి కన్నపేగు రుణం తీర్చుకుంది. మిర్యాలగూడ చర్చి రోడ్‌లో నివాసముండే రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు పెరుగు ప్రసాద్‌ నెల రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన కుమార్తె తనూజ తండ్రిని బతికించుకోవడం కోసం ఎంతో కష్టాలు పడింది. అయినా ఫలితం లేదు, గతనెల 7వ తేదీన ప్రసాద్‌ మృతి చెందడడంతో ఎంత ప్రయత్నించినా తండ్రిని కాపాడుకోలేక పోయాయనని గుండెలవిసేలా రోదించిన తీరును కలచివేసింది.  


నాన్న ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి : రవీంద్రకుమార్‌, దేవరకొండ ఎమ్మెల్యే

మా నాన్న రమావత్‌ కన్సీలాల్‌ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. మొదటి నుంచి నాన్నగారికి రాజకీయాలపై ఆసక్తి ఉండేది. నన్ను ఉన్నత చదువులు చదివించినప్పటికీ మంచి రాజకీయ నాయకుడిగా చూడాలన్నది ఆయన తపన. అందుకే నేను మొదటిసారి సర్పంచ్‌గా గెలిచిన దగ్గరి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు మా నాన్న నా వెన్నంటే ఉండేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. నేను మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాలన్న ఆయన ఆశయం నెరవేర్చానన్న సంతృప్తినాలో ఉంది.  

 

అమ్మ.. నాన్న.. అన్నీ తానే

నడిగూడెం: తల్లి  వదలి వెళ్లినా తండ్రి అన్నీ తానై 12 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. నడిగూడేనికి చెందిన 12 ఏళ్ల కుంభజడ సాత్విక్‌ తలసేమియాతో బాధ పడుతున్నాడు. నెలకు రెండు యూనిట్ల రక్తం ఎక్కిస్తేగానీ జీవించలే ని ధైన్యస్థితి అతనిది. తండ్రి నరేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుం బా న్ని పోషిస్తున్నాడు. తల్లీదండ్రుల మధ్య విబేధాలు వచ్చి సాత్విక్‌ తల్లి నాలుగేళ్ల క్రితం వీరిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి నరేష్‌ ఒక్కరే సాత్విక్‌తోపాటు, కుమార్తె స్పందన ఆలనా పాలనా చూస్తూ అమ్మ ప్రేమను, నాన్న బాధ్యతను నెరవేరుస్తున్నారు.


తండ్రి ప్రేమ వెలకట్టలేనిది : వెంకటనారాయణగౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌, సూర్యాపేట 

తండ్రి ప్రేమ నిస్వార్థమైంది. పిల్లల భవిష్యత్‌కు ఎంతో దోహదపడుతుంది. ఆ ప్రేమకు వెలకట్టలేము. తమ నూరేళ్ల జీవితం పిల్లలకోసం పరితపించే ఆప్రేమ ఎక్కడా కనిపించదు. ఉపవాసం ఉండైనా తమ పిల్లల కడుపు నింపి వారి భవిష్యత్‌కోసం బాటలు వేసేవారే నాన్న. మా నాన్న తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు. మొత్తం మా ఆరుగురికి అక్షర జ్ఞానం నేర్పించి ప్రభుత్వ కొలువులు వచ్చేలా కృషి చేశారు.   


Updated Date - 2021-06-20T06:36:29+05:30 IST