‘పాలమూరు-రంగారెడ్డి’తో.. పరిగి ప్రాంతం సస్యశ్యామలం

ABN , First Publish Date - 2021-06-12T05:23:59+05:30 IST

‘పాలమూరు-రంగారెడ్డి’తో.. పరిగి ప్రాంతం సస్యశ్యామలం

‘పాలమూరు-రంగారెడ్డి’తో.. పరిగి ప్రాంతం సస్యశ్యామలం
చౌడాపూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

కులకచర్ల: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను సీఎం కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన చేపడతారని, ఈ పథకంతో పరిగి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కులకచర్లలో రూ.50 లక్షలతో నిర్మించే సొసైటీ రైతు విశ్రాంతి భవనానికి తిర్మలాపూర్‌ గ్రామపరిధిలో నాబార్డు నిధులు రూ.1.55 కోట్లతో నిర్మించే గోదాంలకు, రూ.80లక్షలతో నిర్మించే రైస్‌ మిల్లుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన మండలం చౌడాపూర్‌లో తహసీల్దార్‌, విద్యా వనరుల భవనం, వ్యవసాయ కార్యాలయం, రైతువేదిక భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌కు నూతన మండల ఏర్పాటు గెజిట్‌ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే సీఎం కేసీఆర్‌ కొత్త మండలాల ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మండల కేంద్రం ఏర్పాటుతో తీరిందన్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రం ఏర్పాటుకు పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో హెచ్‌ఎం, టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యోగాల్లో వికారాబాద్‌ జిల్లా యువత నష్టపోకూడదని చార్మినార్‌ జోన్‌లోకి మార్చామని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. త్వరలోనే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డీఎస్సీనిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, వికారాబాద్‌ ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, సొసైటీ వైస్‌చైర్మన్‌ నాగరాజు, సర్పంచ్‌లు కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్‌, ఉపసర్పంచ్‌ శివకుమార్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు. 

  • బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

ఆమనగల్లు : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్ఫథంతో ఆదుకుంటుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మృతిచెందిన ఆమనగల్లు మండలం ముర్తోజుపల్లి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త సూదిని వినోదకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1న మృతిచెందిన వినోద కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, ఆశ కార్యకర్తలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరగా ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం హైదారాబాద్‌లో మంత్రి సబిత తన చాంబర్‌లో మృతిరాలి భర్త సూదిని కొండల్‌రెడ్డికి, కూతుళ్లకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, తలకొండపల్లి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, చెన్నారం సర్పంచ్‌ స్వప్న భాస్కర్‌రెడ్డి, నాయకులు రమేశ్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T05:23:59+05:30 IST