తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులతో

ABN , First Publish Date - 2020-08-14T08:41:11+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులతో జాతీయ జెండాను ఎగుర వేసేటట్లు చర్యలు తీసుకోవాలని

తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులతో

 పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ


కలికిరి/కల్లూరు, ఆగస్టు 13: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో  తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులతో జాతీయ జెండాను ఎగుర వేసేటట్లు చర్యలు తీసుకోవాలని పాఠశాలల విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా విద్యా శాఖ అధికారిగానీ లేక రీజినల్‌ జాయింట్‌ డైరెక్టరుగానీ జెండాను ఆవిష్కరించాలని ఆయన సూచించారు. సాధారణంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఆయా పంచాయతీ సర్పంచులు స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ఎగురవేయడం ఆనవాయితీ.


అయితే ప్రస్తుతం సర్పంచు పదవులు ఖాళీగా వున్నందున పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడికి ఈ అవకాశం కల్పించారు. కాగా ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పరిమితమైన ఆహ్వానితుల సమక్షంలో నిర్వహించాలని రాష్ట్ర జీఏడీ (ప్రోటోకాల్‌) విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలోనూ, ప్రభుత్వం సూచించిన రాష్ట్ర మంత్రి జెండా ఎగురవేయనున్నారు. కొవిడ్‌ పోరాట యోధులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులను ఆహ్వానించాలని సూచించారు. ఆహూతులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.


అదే విధంగా కరోనాతో పోరాడి ఆరోగ్యంగా బయటపడిన వారిని కూడా ఆహ్వానించాలన్నారు. డివిజన్‌ స్థాయిలో కూడా ఇదే విధంగా మంత్రి లేదా ఆర్డీవోలతో జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ఇక పంచాయతీల్లోనూ, సెమీ పట్టణాల్లోనూ రాష్ట్ర మంత్రి గానీ, ఆర్డీవోలుగానీ జెండా ఆవిష్కరించాలని కోరారు. 

Updated Date - 2020-08-14T08:41:11+05:30 IST