నియంతృత్వంతో జాతి నాశనమే

ABN , First Publish Date - 2020-02-17T09:28:36+05:30 IST

శ్రీమద్రామాయణంలోని అరణ్యకాండలో రావణ-మారీచుల సంభాషణలో వచ్చే శ్లోకమిది. సీతాపహరణం చెయ్యాలన్న దుష్ట సంకల్పంతో రావణుడు మారీచుని సాయాన్ని కోరుకుంటాడు. అప్పుడు మారీచుడు

నియంతృత్వంతో జాతి నాశనమే

రాజ్యం పాలయితుం శక్యం నతీక్ష్ణేన నిశాచర!

నచాపి ప్రతికూలేన నా వినీతేన రాక్షస!

శ్రీమద్రామాయణంలోని అరణ్యకాండలో రావణ-మారీచుల సంభాషణలో వచ్చే శ్లోకమిది.  సీతాపహరణం చెయ్యాలన్న దుష్ట సంకల్పంతో రావణుడు మారీచుని సాయాన్ని కోరుకుంటాడు. అప్పుడు మారీచుడు ఆ చర్యలోని అసంగతత్వాన్ని ఎత్తిచూపుతూనే శ్రీరాముని పరాక్రమాన్ని గురించి కూడా స్పష్టం చేస్తూ ‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’’ అని రాముని ధర్మనిష్ఠను శ్లాఘించడమేగాక.. పాలకునికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలను గురించి, అతని ప్రవర్తనను గురించి విపులంగా, నిస్సంశయంగా, నిర్భయంగా రావణుడికి చెబుతాడు. ‘ఓ రాక్షసరాజా! పాలకుడైనవాడు క్రూరమైన దండనలతో ఒక నియంతగా రాజ్యపాలన చెయ్యడం అసాధ్యం.


ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉండేవాడు, ఇంద్రియనిగ్రహం లేనివాడు రాజ్యాన్ని పాలింపజాలడు’ అని స్పష్టంగా చెప్పాడు. అటువంటి పాలకుల వల్ల ప్రజలు తోడేలు వల్ల మేకలు అపాయాలపాలైనట్లుగా నష్టపోతారు. ధర్మవిరుద్ధంగా పాలించే ప్రభువు పాలనలోని ప్రజలు రక్షణ కరువై అనేక కష్టనష్టాలకు గురి అవుతారు. దుర్భుద్దిగలవాడైన, ఇంద్రియ నిగ్రహం, సత్యనిష్ఠ లేని రాజుల పాలనలో ప్రజలు నశించడం తప్పదు. పాలకులు పెడదారి పట్టినప్పుడు, లోకవిరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో, నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తున్నప్పుడు.. అతని మంత్రులు, న్యాయకోవిదులు అతని శ్రేయోభిలాషులు, ప్రజల పట్ల సానుభూతి కలిగిన మాన్యులు ఏ విధంగానైనా ఆ ప్రభువుకు చెప్పి ఆ దారి నుండి తప్పించాలి. దానివల్ల వారు అతణ్ని, అతనితో పాటు అతని ఏలుబడిలోని ప్రజలను రక్షించిన వారవుతారు.  మారీచుడు చేసింది ఆ ప్రయత్నమే. రాక్షస జాతివాడైనా మారీచుడు రాముని పరాక్రమంపై అచంచల విశ్వాసం ఉన్నవాడేగాక తమ రాజైన రావణుని అకృత్యములు తెలిసిన వాడు కూడా. అందుకే..  రాక్షస జాతిని కాపాడుకోవాలన్న తీవ్ర కాంక్షతో రావణునికి పలు విధాలుగా హితబోధ చేశాడు. రాబోయే ఫలితాన్ని కూడా దర్శింపజేశాడు.


రాజమూలోహి ధర్మశ్చ జయశ్చ జయతాం వర!

తస్మాత్‌ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాః

‘‘ఓ రావణా! ప్రజల ధర్మాచరణం కానీ, వారి శ్రేయస్సు కానీ, పాలకుని ప్రవర్తనను అనుసరించి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనైనా ప్రభువులు ధర్మమార్గం తప్పరాదు’’ అని హితబోధ చేశాడు. అయినా ఆ మాటలు రావణుని చెవికెక్కకపోవడంతో అతడి జాతి మొత్తం నిర్మూలనమైపోయింది. నియంతృత్వ ధోరణి ఎంత ప్రమాదానికి కారణమవుతుందో రామకథ మనకు దృశ్యమానం చేసింది.


గన్నమరాజు గిరిజామనోహర బాబు

Updated Date - 2020-02-17T09:28:36+05:30 IST