సిక్కోలు మారుతోంది

ABN , First Publish Date - 2022-01-27T05:46:49+05:30 IST

ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తీసుకురావడంతో.. సిక్కోలు స్వరూపం మారనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా.. ఇకపై 8 నియోజకవర్గాలతోనే సిక్కోలు జిల్లా కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న మన్యం(పార్వతీపురం) జిల్లాలో పాలకొండ, విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గాలు విలీనం కానున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. విభజన ప్రక్రియ న్యాయసమ్మతంగా లేదని, జిల్లా కేంద్రం, అధికారులు దూరంగా ఉండేలా జిల్లాను మూడు ముక్కలు చేశారని జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిక్కోలు మారుతోంది

- కొత్త జిల్లాల ఏర్పాటుతో 8 నియోజకవర్గాలు మాత్రమే

 - పార్వతీపురంలో కలిసిన పాలకొండ

 - విజయనగరంలో రాజాం విలీనం

- ‘శ్రీకాకుళం’లోనే కొనసాగనున్న ఎచ్చెర్ల

 (ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తీసుకురావడంతో.. సిక్కోలు స్వరూపం మారనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా.. ఇకపై 8 నియోజకవర్గాలతోనే సిక్కోలు జిల్లా కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న మన్యం(పార్వతీపురం) జిల్లాలో పాలకొండ, విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గాలు విలీనం కానున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.  విభజన ప్రక్రియ న్యాయసమ్మతంగా లేదని, జిల్లా కేంద్రం, అధికారులు దూరంగా ఉండేలా జిల్లాను మూడు ముక్కలు చేశారని జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని ప్రభుత్వం భావించింది. అదే జరిగితే పారిశ్రామికంగా జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల నియోజకవర్గం ఉండదని నేతలు అధికార, ప్రతిపక్ష నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎచ్చెర్లను విజయనగరంలో కలిపితే ఉద్యమం తప్పదని తన గళాన్ని గతంలో వినిపించారు. ఈ విషయంపై సీఎంకు అప్పట్లో ఆయన లేఖ కూడా రాశారు. సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండడంతో ప్రభుత్వం ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళంలోనే కొనసాగించే దిశగా విభజన చేయనుంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు కొనసాగనున్నాయి. రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విలీనం చేస్తున్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో చేరాల్సిన పాలకొండ  నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు కానున్న పార్వతీపురం జిల్లాలో కలపాలని నిర్ణయించారు. 


అశాస్త్రీయంగా విభజించొద్దు

కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమే, కానీ ప్రజల అవసరాలకు తగినట్టుగా విభజన చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్ష, కార్యదర్శులు నల్లి ధర్మారావు, సనపల నర్సింహులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాను విభజించడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. పార్లమెంట్‌ స్థానాలను జిల్లాగా చేస్తామని గతంలో ప్రకటించినప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. 2020 జూన్‌ 26న మేధావుల వర్గం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లాను మూడు ముక్కలు చేయవద్దని తీర్మానించామని తెలిపారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాగా విభజించాలని డిమాండ్‌ చేశారు. రాజాం నియోజకవర్గంలోని వంగర మండలాన్ని విజయనగరంలో, పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలం పార్వతీపురం జిల్లాలో ఉంటే సదుపాయంగా ఉంటాయా? అని ప్రశ్నించారు.

ఫోటో: 26ఎస్‌కేఎల్‌.1. శ్రీకాకుళం జిల్లా మ్యాప్‌


అభ్యంతరాలు స్వీకరిస్తాం.. : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

గుజరాతీపేట, జనవరి 26 ః కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు ఫిబ్రవరి 26 తుదిగడువుగా నిర్ణయించామన్నారు. ‘శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులంతా కోరుకున్నట్టు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. గతంలో జిల్లాల పునర్విభజన విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసిపోతుందనే ఆందోళన జిల్లా వాసుల్లో అధికమైంది. ఇదే అంశంపై మొదట్నుంచీ తగిన అవగాహన, ప్రజల ఆకాంక్షలపై నిబద్ధతతో తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కలిసి నివేదించాం. ఫలితంగా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని కృష్ణదాస్‌ తెలిపారు. ‘పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఉగాది(ఏప్రిల్‌-2) నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది’ డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-27T05:46:49+05:30 IST