మురుగు వంకతో.. ముప్పుతిప్పలు

ABN , First Publish Date - 2021-05-14T05:28:46+05:30 IST

కడప నగరం 17వ డివిజన్‌ పరిధిలోని చిన్నముసల్‌రెడ్డిపల్లె (సీఎంఆర్‌పల్లె), అంగడివీధి, బాబాగర్‌ ప్రాంతాల మధ్య ఉండే మురుగు వంక సమీపంలో నివసించే వారిని ముప్పుతిప్పలు పెడుతోంది.

మురుగు వంకతో.. ముప్పుతిప్పలు
ముళ్లపొదలతో నిండి ఉన్న మురుగు వంక

వంక వెంబడి దట్టమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు

విషకీటకాలు, దోమలు స్వైర విహారం

బెంబెలేత్తుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు, నాయకులు


       మూడు గ్రామాల మధ్య ఉన్న మురుగు వంక సమీప వందలాది నివాసు లను ముప్పుతిప్పలు పెడుతోంది. వంక వెంబడి కి.మీ వరకు దట్టమైన ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి మురుగు నీరు ప్రవహించకుండా అడ్డుపడు తున్నాయి. దీంతో ఎక్కడి మురుగు అక్కడే ఐదడుగులు మేర నిలిచింది. తద్వారా దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలై నగరంలోని ఆసుపత్రులకు పరుగులు పెడుతు న్నారు. వివరాల్లోకి వెళితే... 


కడప(రూరల్‌), మే 13: కడప నగరం 17వ డివిజన్‌ పరిధిలోని చిన్నముసల్‌రెడ్డిపల్లె (సీఎంఆర్‌పల్లె), అంగడివీధి, బాబాగర్‌ ప్రాంతాల మధ్య ఉండే మురుగు వంక సమీపంలో నివసించే వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. సీఎంఆర్‌పల్లె మొదలుకొని బాబానగర్‌ వరకు వంక వెంబడి కి.మీ. వరకు దట్టమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి ఉంది. ఇక్కడికి చేరిన మురుగునీరు ప్రవహించకుండా అవి అడ్డుగా ఉన్నాయి. తద్వారా మురుగునీటిలో విషసర్పాలు, క్రిమికీటకాలు, దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నాయి. వంకకు ఇరువైపులా ఉన్న నివాస గృహాల్లోకి చోరబడుతున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు ఇక్కడి పరిస్థితులు తోడై సీజనల్‌ వ్యాధులను విస్తరింపజేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి మురుగు కాలువలో దోమలు వృద్ధి చెంది పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నివాసులను నిరంతరాయంగా వెంబడిస్తున్నాయి. వారి రక్తాన్ని జలగల్లా తాగేస్తున్నాయి. 

     ఇదిలా ఉండగా, కాలువ పక్కనే ఉర్దూ హైస్కూల్‌ ఉంది. ప్రస్తుతం పాఠశాలలు కరోనా తీవ్రత దృష్ట్యా సెలవులు ప్రకటించారు కానీ, మామూ లుగా అయితే పాఠశాలలోని పిల్లలు మురుగు కాల్వలోని పరిస్థితులకు తట్టుకోలేక పలు రోగాలబారిన పడేవారు. ఇలా అన్ని విధాలుగా ఈ మురుగు కాలువలో మూడు గ్రామాల పరిధిలోని వందలాది ప్రజలను తీవ్ర అనారోగ్యపాలు చేస్తున్నా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలపై పత్రికల్లో కథనాలు వెలువడినా స్పందించేవారు లేరం టున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ అయినా తమ గోడును ఆలకించి మూడు గ్రామాల పరిధిలో ప్రవహించే మురుగు కాలువలో ముళ్లపొదలను, పిచ్చిమొక్కలను తొలగించి మురుగునీటిని లోతట్టుకు ప్రవహించేలా కాలువకు ఇరువైపులా రక్షణ గోడను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేకపోతే తాము నిత్యం తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ప్రాధేయపడుతున్నారు. 

Updated Date - 2021-05-14T05:28:46+05:30 IST