అధికార పార్టీ అండతోనే..!

ABN , First Publish Date - 2021-10-26T05:29:55+05:30 IST

వైసీపీ నేతలు రెండున్నర ఏళ్లుగా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలిలో కలిపేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఆరోపించారు.

అధికార పార్టీ అండతోనే..!
మాట్లాడుతున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

  1. పేదలను నమ్మించి వర్ధన్‌ వసూళ్లు
  2. సొసైటీ పెద్దలంతా ఎమ్మెల్యే అనుచరులే 
  3. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, సోమిశెట్టి, గౌరు 


కర్నూలు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు రెండున్నర ఏళ్లుగా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలిలో కలిపేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఆరోపించారు. సోమవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఇన్‌చార్జి బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో పాటు కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరులో వర్ధన్‌ మల్టిస్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ముసుగులో ఎమ్మెల్యే శిల్పా అనుచరులు పేదల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయారన్నారు. ఈ సొసైటీతో తనకు సంబంధం లేదని, ఆ సొసైటీ ప్రతినిధులు కూడా ఎవరో తెలియదని ప్రస్తుతం ఎమ్మెల్యే బుకాయించడం దారుణమన్నారు. సొసైటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చక్రపాణిరెడ్డి.. జిల్లాలో శిల్పా పేరుతో బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రజలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నారని, వారి కోరిక మేరకు తన అనుచరులే వర్ధన్‌ మల్టిస్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ద్వారా పేదలను ఆదుకునేందుకు నిర్ణయించడం అభినందనీ యమని చెప్పిన విషయం గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి పత్రికలు, చానళ్లకు వినిపించారు. ప్రజాప్రతినిధిగా తన అనుచరులు చేసిన మోసాలను అరికట్టేందుకు శిల్పా చక్రపాణి రెడ్డి ముందుకు రావాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బాధితులు చెల్లించిన డబ్బులను వెనక్కి ఇప్పించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సొసైటీలో వైసీపీకి చెందిన నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గ్రంధివేముల బాలన్న కుమార్తె హేమలత కర్నూలు జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌గా నియమించారన్నారు. ఈ సొసైటీ నిర్వాహకులు ఆన్‌లైన్‌ ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారని, వీరిని నమ్మి ప్రజలు రూ.60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారని, ఆ రుజువులన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. తాము ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తామని ప్రగల్బాలు చెప్పుకుంటున్న శిల్పా చక్రపాణిరెడ్డి తన నియోజకవర్గంలోనే తన అనుచరులు సాగించిన దందాను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. శిల్పా చక్రపాణిరెడ్డి మంత్రి రేసులో ఉన్నారని, ఈ బాగోతంపై తనకు సంబంధం లేకుండా ప్రయత్నాలు చేసుకోవడం దారుణమని అన్నారు. అనంతరం వీరు బాధితుల తరుపున విజ్ఞాపన పత్రాన్ని ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో కోడుమూరు పార్టీ ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, హనుమంతరావు చౌదరి, కొరకంచి రవికుమార్‌, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి, సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:29:55+05:30 IST