మతం మారాలని వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్య...

ABN , First Publish Date - 2022-01-20T22:33:20+05:30 IST

తమిళనాడులోని తంజావూరుకు చెందిన ఓ పన్నెండో

మతం మారాలని వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్య...

చెన్నై : తమిళనాడులోని తంజావూరుకు చెందిన ఓ పన్నెండో తరగతి విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించారు. తాను ఉంటున్న హాస్టల్ వార్డెన్ తనను క్రైస్తవ మతంలోకి మారాలని దారుణంగా వేధించారని ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో ఆమె వైద్యులకు, పోలీసులకు చెప్పారు. 


పదిహేడేళ్ళ వయసుగల ఈ విద్యార్థిని తంజావూరులోని సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ పన్నెండో తరగతి చదువుకుంటున్నారు. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ సకయమరి (62) తనను మతం మారాలని నిరంతరం ఒత్తిడి చేసేవారని ఈ వీడియోలో బాధితురాలు చెప్పారు. తనను నిరంతరం దూషిస్తూ, తన చేత హాస్టల్‌లోని గదులన్నిటినీ తుడిపించేవారని చెప్పారు. 


వార్డెన్ ఒత్తిళ్ళను భరించలేక ఆ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి మురుగానందంకు జనవరి 10న తెలియజేశారు. జనవరి 9న వాంతులు వచ్చాయని, ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు. ఆయన అరియలూర్‌లో ఉంటున్నారు. ఆయన అక్కడి నుంచి వచ్చి ఆమెను తంజావూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె స్పృహలోకి వచ్చారు. ఆమెను డాక్టర్లు ప్రశ్నించినపుడు తన కష్టాలను వివరించారు. హాస్టల్ వార్డెన్ తనను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారని, తాను ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పారు. 


డాక్టర్లు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమెను హాస్టల్ వార్డెన్ తీవ్రంగా వేధించినట్లు, క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు కేసు నమోదు చేశారు. వార్డెన్ సకయమరిని అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని జనవరి 19 రాత్రి తుదిశ్వాస విడిచారు. 


Updated Date - 2022-01-20T22:33:20+05:30 IST