ఇప్పటికీ చెబుతున్నా.. అమెరికా నిర్ణయం సరైందే: Joe Biden

ABN , First Publish Date - 2021-09-02T00:03:48+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు.

ఇప్పటికీ చెబుతున్నా.. అమెరికా నిర్ణయం సరైందే: Joe Biden

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించడమనేది అగ్రరాజ్యానికి ఉత్తమమైన, సరైన నిర్ణయం అని బైడెన్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగించడానికి తమకు ఏ కారణం కనిపించలేదని ఈ సందర్భంగా అధ్యక్షుడు తెలియజేశారు. మంగళవారం అధికార భవనం వైట్‌హౌస్ నుంచి బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 


"ఇప్పటికీ చెబుతున్నా నేను తీసుకున్న నిర్ణయం సరైందే. చాలా తెలివైన నిర్ణయం కూడా. ఇది అమెరికాకు ఉత్తమమైన నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్ల యుద్ధానికి యూఎస్ ముగింపు పలికింది. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా లక్షా 20వేల మందిని అఫ్ఘాన్ నుంచి తరలించాం. ఇది అగ్రరాజ్యానికి మాత్రమే సాధ్యం. అది మేము చేసి చూపించాం. బలగాల తరలింపు ఓ అద్భుత విజయం. ఈ మిషన్ విజయానికి కారణం అమెరికన్ ఆర్మీ విభాగం. వారి నైపుణ్యాలు, వీరత్వానికి ఈ విజయానికి నిదర్శనం." అని అన్నారు. 


లక్షా 20 వేల మందిని అఫ్ఘాన్‌ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం అమెరికన్లను అఫ్ఘాన్ నుంచి తరలించామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. కాగా, అఫ్ఘాన్ నుంచి విదేశాలకు వెళ్లేవారిని తాలిబన్లు అడ్డుకోకుండా అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌కు బైడెన్ సూచించారు. 

Updated Date - 2021-09-02T00:03:48+05:30 IST