నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-02T08:10:48+05:30 IST

ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులకుమార్చి 2, 3 తేదీల్లో విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.

నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ

వీలైనన్ని డివిజన్లలో ఏకగ్రీవాల కోసం వైసీపీ ఎత్తులు

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు బెదిరింపులు, ఒత్తిళ్లు


చిత్తూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలను గతేడాది మార్చిలో ఆగినచోట నుంచి జరిపేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2, 3 తేదీల్లో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మార్చి 10వ తేదీన పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 1684 నామినేషన్లు దాఖలవగా.. వాటిలో 1584నామినేషన్లను ఆమోదించారు. పుంగనూరులో 31కి గానూ 22 వార్డుల్లో, పలమనేరులో 26కు గానూ పదింటిలో, తిరుపతిలో 50కి గానూ ఆరింటిలో, మదనపల్లెలో 35కు గానూ రెండిట్లో, చిత్తూరులో 50కి గానూ ఒకచోట వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరి, పుత్తూరు ప్రాంతాల్లోనే ఏకగ్రీవాలు లేవు. ఇక మిగిలిన 207 డివిజన్లలో మాత్రమే పోటీ నెలకొంది. ఇక్కడ 1548 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో అభ్యర్థులు నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నాక పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యలో మార్పులుంటాయి.


ఫ ఏకగ్రీవాల కోసం ఎత్తులు

 పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీల్లోనూ వీలైనన్ని ఎక్కువ డివిజన్లను ఏకగీవ్రం చేసుకోవాలని వైసీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ సహా ఇతర ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభ పెడుతున్నారు. నామినేషన్లను విత్‌ డ్రా చేసుకునే ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫ చిత్తూరు కార్పొరేషన్‌లో మరీ దారుణంగా పోలీసు అధికారుల ద్వారా ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరిస్తున్నారు. దీంతో చాలామంది విత్‌ డ్రా గడువు అయిపోయేవరకు అదృశ్యమైపోయారు. మాజీ మేయర్‌ హేమలత భర్త, టీడీపీ నగర అధ్యక్షుడు కఠారి ప్రవీణ్‌ మీద ఆదివారం రాత్రి హుటాహుటిన పోలీసులు అక్రమ కేసును నమోదు చేశారని టీడీపీ చిత్తూరు నేతలు వాపోతున్నారు. ఫ మదనపల్లెలో 35 వార్డులకుగానూ ఇప్పటికే రెండు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మరో 5 చోట్ల టీడీపీ పోటీ ఇవ్వడం లేదు. ప్రత్యర్థి అభ్యర్థులను డబ్బులతో ప్రలోభ పెట్టి ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఫ పుంగనూరు మున్సిపాలిటీలో గతేడాది విపక్ష అభ్యర్థులను నామినేషన్లే వేయకుండా వైసీపీ నేతలు దాడులు చేసి మరీ అడ్డుకున్నారు. నామినేషన్‌ కాగితాలను సైతం చించేశారు. దీంతో అప్పట్లోనే 31కి 22 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన చోట్ల కూడా పోటీలో ఉన్నవారిని ఈ రెండు రోజుల్లో విత్‌ డ్రా చేయించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయిఫ పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లోని మెజార్టీ వార్డుల్లో వైసీపీకి రెబల్స్‌ బెడద అధికంగా ఉంది. ఈ రెండు చోట్ల పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ద్వారా రెబల్స్‌తో మంతనాలు జరిపిస్తున్నారు. ఫ తిరుపతిలో ఏకగ్రీవాలు చేసుకోవడంలో భాగంగా ప్రత్యర్థి అభ్యర్థుల వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు. పాత కేసులున్న వారిని వాటిని చూపించి బెదిరిస్తున్నారు.

Updated Date - 2021-03-02T08:10:48+05:30 IST