పేగుబంధాన్ని చూసుకోకుండానే..

ABN , First Publish Date - 2022-05-03T06:15:30+05:30 IST

భార్య ప్రసవించగానే తమ పేగు బంధాన్ని చూసి సంతోషించాలని అత్తారింటికి పయనమయ్యాడు. విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదానికి గురై ఐదు రోజులుగా కోమాలో ఉన్నాడు.

పేగుబంధాన్ని చూసుకోకుండానే..
శ్రీనివాస్‌(ఫైల్‌)

భార్య ప్రసవం తెలిసి బయలుదేరిన భర్త

రోడ్డు ప్రమాదానికి గురై ఐదు రోజులుగా కోమాలో

చికిత్స పొందుతూ ఆదివారం మృతి

 భువనగిరి రూరల్‌, మే 2 : భార్య ప్రసవించగానే తమ పేగు బంధాన్ని చూసి సంతోషించాలని అత్తారింటికి పయనమయ్యాడు. విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదానికి గురై ఐదు రోజులుగా కోమాలో ఉన్నాడు. భార్య ప్రసవించి పండంటి కూతురికి జన్మనిచ్చింది. కూతురుని చూసుకోకుండానే కోమాలో ఉన్న అతడు కన్నుమూశాడు. అతడిది యాదాద్రిభువనగిరి జిల్లా కాగా ప్రమాదసంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.  స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామానికి చెందిన మంగళంపల్లి శ్రీనివా్‌స(28)కు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆద్యతో 2020 డిసెంబరులో వివాహమైంది. అయితే ఆద్య గర్భం దాల్చడంతో సిరిసిల్లలోని పుట్టింటికి ప్రసవం కోసం వెళ్లింది. అయితే నిండు గర్భిణి అయిన తన భార్య ప్రసవం ఉండడంతో ఏప్రిల్‌ 27న భర్త శ్రీనివాస్‌ బైకుపై సిరిసిల్లకు వెళ్తుండగా మార్గమధ్యలోని సిద్ధిపేట జిల్లా దుద్దెడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. బంధువులు అతడిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 29న భార్య ఆద్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. కోమాలో ఉన్న శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సిద్ధిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సోమవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా భార్య ఆద్య కూతురిని ఒడిలో పడుకోబెట్టుకుని మీ నాన్న నిద్రిస్తున్నాడంటూ రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. సోమవారం సాయంత్రం శ్రీనివాస్‌ అంత్యక్రియలు జరిగాయి.  

ఔదార్యం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి 

రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన మంగళంపల్లి శ్రీనివాస్‌ కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌ ద్వారా సంతాపం తెలిపి ఎన్‌ఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌ ద్వారా రూ.50వేల ఆర్థికసాయాన్ని అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటానని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read more