ఎత్తిన పిడికిలి.. దించకుండా

ABN , First Publish Date - 2021-11-20T08:24:37+05:30 IST

గజగజ వణికించే చలిలో గడ్డకట్టుకుపోయారు! ముంచెత్తిన వానల్లో ముడుచుకుని శిబిరాల్లో తలదాచుకున్నారు

ఎత్తిన పిడికిలి.. దించకుండా

న్యూఢిల్లీ, నవంబరు 19: గజగజ వణికించే చలిలో గడ్డకట్టుకుపోయారు! ముంచెత్తిన వానల్లో ముడుచుకుని శిబిరాల్లో తలదాచుకున్నారు! ఎర్రటి ఎండల్లో నడిరోడ్లపై నిరసనలు తెలిపారు! పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. కష్టాలెన్ని ఉన్నా.. ఒకటే ధ్యేయం. కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకునే దాకా నిరసన కొనసాగించడమే లక్ష్యంగా.. దేశ రాజధాని చుట్టూ దాదాపు ఏడాదిపాటు మొక్కవోని సంకల్పంతో నిరసన తెలిపిన రైతులు వారు! ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం చేసిన ప్రకటన వారు సాధించిన విజయమేననడంలో సందేహమే లేదు.


ప్రభుత్వాలు చట్ట సభల్లో తమకున్న మెజారిటీతో ఇష్టారీతిన ఎన్ని  చట్టాలైనా చేయొచ్చు గాక... కానీ, ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆందోళనలు ఉధృతమై నిరసనలు ఉవ్వెత్తున ఎగిస్తే వెనక్కు తగ్గక తప్పదని రైతులు నిరూపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 333 రోజుల పాటు వేలాది మంది రైతులు చేసిన ఆందోళనల్లో 669 మంది రైతుల బలయ్యారు. ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధినపడ్డాయి. నిరుడు సెప్టెంబరు 17న సాగు బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టాలు అమలైతే సాగు వ్యవస్థ, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళుతుందని.. పంటల ఉత్పత్తులకు ధర లభించక తమ బతుకులు బుగ్గిపాలవుతాయనే ఆందోళనతో రైతులోకం పోరుకు నడుం కట్టి సిద్ధమైంది. ప్రత్యేకించి.. ఉత్తరభారతం భగ్గుమంది. బిల్లులు ఆమోదం పొందిన రెండు నెలలకు ఉద్యమం ఉధృతమైంది. ఢిల్లీ శివారువైపు రైతులోకం కదంతొక్కింది. పాదయాత్రగా కొందరైతే, వందల ట్రాక్టర్లలో రైతు జాతరగా ఇంకొందరు హోరెత్తించారు. రోడ్లపై డేరాలు వెలిశాయి.


నెలల పాటు తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు దూరమై.. దొరికిందేదో తింటూ.. పొగమంచు, చలితో కూడిన ప్రతికూల వాతావరణం మధ్య గడిపినా ఎక్కడా పట్టు సడలించలేదు. ఎత్తిన పిడికిలి దించలేదు. టిక్రీ, సింఘూ, గజియాపూర్‌ సరిహద్దులు సహా పలు ప్రాంతాలను రైతులు దిగ్బంధించారు. టిక్రీ, సింఘూ సరిహద్దుల్లోనే  40 వేల మంది రైతులు ఏడాదిగా ఆందోళనలు నిర్వహించారు. భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ)కు చెందిన కహన్‌ సింగ్‌ అనే రైతు.. రోడ్డు మీద కారు ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉద్యమంలో ఆయనే తొలి అమరుడు. మొత్తంగా 669 మంది ప్రాణాలు కోల్పోయారు.


ముందుండి నడిపించారు..

వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు స్వచ్ఛందంగా కదిలిన రైతులోకానికి రైతు సంఘాలు, ఆ సంఘాల్లోని కీలక నేతలు పలువురు ఆందోళనల్లో ముందుడి నడిచి స్ఫూర్తిగా నిలిచారు. వారిలో ముఖ్యులు.. రాకేశ్‌ తికాయత్‌, దర్శన్‌ పాల్‌, జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, గుర్నామ్‌ సింగ్‌చాదుని తదితరులు. వీరిలో రాకేశ్‌ తికాయత్‌ (52) ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌’ జాతీయ అధికార ప్రతినిధి. ఢిల్లీలో ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసిన తికాయత్‌.. రైతు ఉద్యమానికి ఒకరకంగా ముఖంలాగా కనిపించారు. బీజేపీ పాలిత యూపీలో రైతులను చైతన్యపరిచి.. వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు.

  

దర్శన్‌పాల్‌ (70).. ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ సంఘం సభ్యుడు. ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. సాగుచట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చల్లో ఈయన కూడా కీలకపాత్ర పోషించారు. అంతేకాదు.. రైతు సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తేవడంలో ఈయన పాత్రే కీలకం. అక్కడే ఉద్యమం సగం విజయవంతమైంది. రైతుల ఉద్యమం పంజాబ్‌కే పరిమితం కాకుండా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలకు కూడా విస్తరించేలా చేశారు. 


జోగీందర్‌ సింగ్‌ (76)... మాజీ సైనికుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహణ్‌) అధ్యక్షుడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈయన రైలురోకోలు, ధర్నాలతో.. బీజేపీ నేతల ఘెరావ్‌లతో.. ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో కీలకపాత్ర పోషించారు. మిగతా రైతు సంఘాలన్నీ సింఘూ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతుంటే.. తిక్రీ బోర్డర్‌ దగ్గర ఉద్యమం మొత్తాన్నీ ఈయనొక్కడే ఒంటిచేత్తో నిర్వహించారు.

Updated Date - 2021-11-20T08:24:37+05:30 IST