Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్లో బోర్డు లేకున్నా.. పచ్చ జెండా

ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె వాహనాలకు లేని ట్యాక్సీ బోర్డులు

82 కార్యాలయాల్లో 20 చోట్ల మాత్రమే ఎల్లో బోర్డు వాహనాలు

మిగతా చోట్ల సొంత వాహనాలనే రెంటు పేర నడుపుతున్న అధికారులు

నెలకు రూ.33,000 స్వాహా

గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

మామూళ్ల మత్తులో ఉన్నతాధికారులు


జోగుళాంబ గద్వాల జిల్లాలో కొందరు అధికారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. తమ వాహనాలను బినామీ పేర్లతో అద్దె వాహనాలుగా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు వివిధ పనులు నిమిత్తం ప్రభుత్వం వాహనాలను సమకూర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ట్యాక్సీ ప్లేట్‌ ఉన్న వాహనాలను అద్దెకు తీసుకొని, వాహనదారులకు నెలకు రూ.33,000 చెల్లిస్తారు. కానీ గద్వాల జిల్లాలో కొందరు అధికారులు సొంత వాహనాలను అద్దె వాహనాలుగా నడుపుతూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు.

- గద్వాల క్రైం


అద్దె వాహనాల విషయంలో గద్వాల జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎల్లో బోర్డు ఉన్న ట్యాక్సీ వాహనాలను అద్దెకు తీసుకోవాల్సి ఉండగా, సొంత వాహనాలను నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, ఎస్పీలకు ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసింది. వారిని మినహాయించి మిగతా 62 శాఖల జిల్లా అధికారులకు, 12 మంది తహసీల్దార్లు, 12 మంది ఎంపీడీఓలకు అద్దె వాహనాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది.  ఆ వాహనాలకు తప్పనిసరిగా ఎల్లో బోర్డు(ట్యాక్సీ బోర్డు) ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 82 ప్రభుత్వ కార్యాలయాలకు గాను 20 కార్యాలయాలకు మాత్రమే ఎల్లో బోర్డు ఉన్న వాహనాలు ఉన్నట్లు సమాచారం. మిగిలిన వాటికి ఎల్లో బోర్డు లేని వాహనాలు ఉన్నాయి. అధికారులు ఉన్నతాధికారుల అండదండలతో సొంత వాహనాలను అద్దెకు నడుపుతూ, నెలకు రూ.33,000 తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కొన్ని శాఖలకు ప్రతీ నెలా డబ్బులు ఇవ్వగా, మరికొన్ని శాఖలకు మాత్రం బడ్జెట్‌ ప్రకారం బిల్లులు వస్తున్నట్లు జిల్లా సబ్‌ ట్రెజరీ అధికారులు చెబుతున్నారు.


ఎల్లో బోర్డు ఉంటేనే బిల్లులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయాలకు నడిపే అద్దె వాహనాలకు ఎల్లో బోర్డు ఉండాలి. ఇంకా డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన ఫిట్‌నెస్‌ తదితర వాటిని పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలి. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకో వడం లేదని, మామూళ్లు తీసుకుని, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమా చారం.


కలెక్టర్‌కు విన్నవించాం

అధికారులు అద్దె వాహనాలుగా ఎల్లో బోర్డు ఉన్న వాహనాలను తీసుకోవాలని గతంలో ఉన్న కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైనీకి వినతి పత్రం ఇచ్చాం. ఎల్లో బోర్డు ఉన్న అద్దె వాహనాలకు ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వానికి టాక్సీ కూడా చెల్లిస్తున్నాం. అధికారులు ఎల్లో బోర్డు ఉన్న వాహనాలనే తీసుకుని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.

- శ్రీనివాసులు, అద్దె వాహనాల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, గద్వాల జిల్లా డాక్యుమెంట్లు 


సరిగా ఉంటేనే బిల్లులు చేస్తున్నాం

ఎల్లో బోర్డు తదితర అంశాలు మా పరిధిలో ఉండవు. మా కార్యాలయం నుంచి బిల్లులు రావాలంటే వాహన డాక్యుమెంట్స్‌, వాటి వ్యాలిడిటీ, రెన్యూవల్‌ తదితర అంశాలు సరిగా ఉంటే బిల్లులు చేస్తాం. ఇంచుమించు ప్రతీ మూడు నెలలకోసారి బిల్లులు వస్తాయి.

- అయూబ్‌ ఫైసల్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సబ్‌ట్రెజరీ కార్యాలయం 
Advertisement
Advertisement