ఆ హీరో చెబితే జాబ్ తిరిగిస్తారని వచ్చిన యువతి చివరికిలా....

ABN , First Publish Date - 2021-10-05T21:18:13+05:30 IST

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ వల్ల పోయిన ఉద్యోగం తిరిగి అతడి వల్లే వస్తుందని భావించిన మహిళ ఆత్మహత్యకు

ఆ హీరో చెబితే జాబ్ తిరిగిస్తారని వచ్చిన యువతి చివరికిలా....

చెన్నై: కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ వల్ల పోయిన ఉద్యోగం తిరిగి అతడి వల్లే వస్తుందని భావించిన మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన చెన్నైలోని తేనంపేటలో జరిగింది. అజిత్ కుమార్, అతడి భార్య షాలిని గతేడాది తేనంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫర్జానా వారితో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది.


ఎంప్లాయిమెంట్ నిబంధనలకు ఇది విరుద్ధమంటూ ఫర్జానాను విధుల తొలగించింది. ఆసుపత్రి యాజమాన్యం అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడంతో రోడ్డున పడిన ఫర్జానా పోయిన తన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించడంలో సాయం చేయాలంటూ షాలినిని వేడుకుంది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అజిత్‌తో సెల్ఫీ దిగడమే తన ఉద్యోగం పోవడానికి కారణమని, కాబట్టి అజిత్ ఓ మాట చెబితే పోయిన తన ఉద్యోగం తిరిగి వస్తుందని ఫర్జానా భావించింది.


మరో మహిళతో కలిసి సోమవారం మధ్యాహ్నం అజిత్ నివాసానికి చేరుకుంది. అజిత్ ఇంటి వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. లోపలికి అనుమతించబోమని, వెనక్కి తిరిగి వెళ్లాలని ఆమెను కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలేస్తూ, తన ఉద్యోగం పోవడానికి అజితే కారణమని ఆరోపించింది.


ఆ వెంటనే తనను తాను అంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. క్షణాల్లోనే స్పందించిన పోలీసులు వెంటనే ఆమెపై నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది. మహిళలు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపారు. మహిళపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని  పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-05T21:18:13+05:30 IST