టన్ను ఉల్లిపాయలతో రివెంజ్.. బ్రేకప్ కథల్లో కొత్త చరిత్ర

ABN , First Publish Date - 2020-05-22T23:45:28+05:30 IST

ఈ రోజుల్లో ప్రేమలు.. బ్రేకప్పులు.. సర్వసాధారణం. అయితే బ్రేకప్ కథలలో విచిత్రమైన ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి.

టన్ను ఉల్లిపాయలతో రివెంజ్.. బ్రేకప్ కథల్లో కొత్త చరిత్ర

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ప్రేమలు.. బ్రేకప్పులు.. సర్వసాధారణం. అయితే బ్రేకప్ కథలలో విచిత్రమైన ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అలాంటి రకమే ఈ బ్రేకప్ స్టోరీ. చైనాకు చెందిన ఓ జంట ఈ మధ్యే విడిపోయింది. తనను మోసం చేసిన సదరు ప్రేమికుడికి ఆ ప్రియురాలు టన్ను ఉల్లిపాయలు పంపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... జావో అనే యువతి ఒక యువకుడిని ప్రేమించింది. అయితే ఈ జంట ఈమధ్యే విడిపోయింది. తన ప్రియుడు వేరే మహిళతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఆమె అతనికి బ్రేకప్ చెప్పేసింది. తనను మోసం చేసిన ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో ఓ ప్లాన్ వేసింది. వెయ్యి కిలోల ఉల్లిపాయలు ఆర్డర్ చేసి అతనికి కొరియర్ చేసింది. అంతేకాదు ఓ ఫొటో గ్రాఫర్‌ను కూడా పంపింది. అయితే ఆ ఉల్లిపాయలను తీసుకు వెళ్లాల్సిందిగా సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే అతను ఎంతకీ రాలేదు. ఇక వాళ్లే తీసుకెళ్లి ఈ నెల 16న డోర్ ముందు ఉల్లిపాయల సంచులను కుప్పగా పోశారు. ఇంటిముందు సంచుల్లో ఉన్న ఉల్లిపాయలను చూసి షాక్ తిన్న అతడు హావభావాలను ఆ ఫొటో గ్రాఫర్ షూట్ చేయగా.. ఆ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  


ఈ విషయం ఆనోట.. ఈనోట.. మీడియాకు చేరింది. దీనిపై జావోను ప్రశ్నించగా.. తన బాధ అతనికి తెలియాలనే అలా చేశానని చెప్పుకొచ్చింది. తాను మూడు రోజుల పాటు ఏడ్చానని.. ఇప్పుడు తనవంతని పేర్కొంది. ఇదే విషయాన్ని ఉల్లిపాయల సంచులకు ట్యాగ్ చేసి పంపింది. దీనిపై ప్రియుడిని అడగగా... ‘‘ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదని బాధపడుతోంది.. బ్రేకప్ చెబితే మగాళ్లు ఏడవాలని ఏమైనా ఉందా’’ అని ఎదురు ప్రశ్నించాడు.  వీరిద్దరి బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2020-05-22T23:45:28+05:30 IST