Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళా కానిస్టేబుల్‌ గొంతుకోసిన భర్త

డోన్‌, నవంబరు 30: జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడుముళ్లు వేసిన భర్తనే.. ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్య గొంతును కోసి హత్య చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్‌ మండలం వెంకటనాయునిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్‌ బాల లక్ష్మీదేవి (30) మంగళవారం దారుణహత్యకు గురైంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. డోన్‌ పట్టణంలోని మాజీ వార్డు సభ్యుడు చౌడప్ప కుమార్తె బాలలక్ష్మిదేవిని ఏడాది క్రితం వెల్దుర్తి మండలంలోని గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన బింగి సుధాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. భార్య బాలలక్ష్మిదేవి వెంకటనాయునిపల్లి సచివాలయంలో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తోంది భర్త కూడా బింగి సుధాకర్‌ నంద్యాలలోని వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే.. వివాహమైనప్పటి నుంచి భర్త అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. దీంతో భర్త వేధింపులను బాలలక్ష్మిదేవి తన తండ్రి చౌడప్ప దృష్టికి తీసుకెళ్లింది. వివాహమైన మూడు నెలలకే భర్త నుంచి విడాకులు కోరుతూ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. మంగళవారం వెంకటనాయునిపల్లె సచివాలయంలో 3 గంటల సమయంలో గర్భిణిలకు కోడిగుడ్లు పంపిణీ చేసి ఆ ఫొటోను బాలలక్ష్మిదేవి వారికి సంబంధించిన గ్రూపులో అప్‌లోడ్‌ చేసింది. ఆ తర్వాత విధులు ముగించుకుని గ్రామం నుంచి సహచర ఉద్యోగి బైక్‌పై వస్తోంది. మార్గమధ్యంలో కాపుకాచిన భర్త బింగి సుధాకర్‌ బైక్‌ను ఆపి ఆమెను కిందకి లాగేశాడు. కత్తితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హతురాలి తండ్రి చౌడప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోన్‌ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement