Kadapa : 108 అంబులెన్స్‌లోనే కవలల జననం..

ABN , First Publish Date - 2021-12-23T15:11:56+05:30 IST

ఓ గర్భిణీ పురిటినొప్పులు పడుతోందని వచ్చిన సమాచారంతో..

Kadapa : 108 అంబులెన్స్‌లోనే కవలల జననం..

కడప జిల్లా/ప్రొద్దుటూరు : ఓ గర్భిణీ పురిటినొప్పులు పడుతోందని వచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్‌ వాహనం వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించేందుకు ఆమెను తీసుకొస్తుండగా అంబులెన్స్‌లోనే ఆమె కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎర్రగుంట్ల సుందరయ్యకాలనీకి చెందిన మహేశ్వరికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు బుధవారం ఉదయం 8.30 గంటలకు సమాచారం వచ్చింది. దీంతో ఎఫ్‌ఎంటీ రెడ్డెప్పరెడ్డి, అంబులెన్స్‌ పైలట్‌ సూర్యమునిరెడ్డిలు గర్భిణీని, కుటుంబ సభ్యురాలిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకొస్తుండగా పోట్లదుర్తి బ్రిడ్జి వద్దకు రాగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి.


ఈ క్రమంలో అంబులెన్స్‌లోనే ఆమె ఇద్దరు ఆడశిశువులు (కవలలు) ప్రసవించింది. 9.16 గంటలకు ఒక బిడ్డ పుట్టగా, మరో నాలుగు నిమిషాలకు మరో బిడ్డ జన్మించిందని, రెండో బిడ్డ పరిస్థితి కొద్దిగా అందోళనకరంగా ఉండటంతో వెంటనే ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించామని ఎఫ్‌ఎంటీ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. సకాలంలో వెళ్లడం వల్ల తల్లీబిడ్డలను కాపాడగలిగామని, ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా అంబులెన్స్‌ సిబ్బందిని పలువురు అభినందించారు.

Updated Date - 2021-12-23T15:11:56+05:30 IST