అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ABN , First Publish Date - 2020-06-05T09:38:52+05:30 IST

నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో ఒక..

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

శరీరంపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు

జుట్టు కత్తిరింపు

ఫిట్స్‌తో చనిపోయిందంటూ అంత్యక్రియలకు ఓ మహిళ ఏర్పాట్లు

అనుమానం రావడంతో పోలీసులకు స్థానికుల సమాచారం

మృతదేహం పోస్టుమార్టానికి తరలింపు

ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఫిట్స్‌తో మృతిచెందిందంటూ యువతి వుంటున్న ఇంటిలోని మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లుచేసింది. మృతదేహాన్ని తీసుకువస్తున్నట్టు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాపరికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె చెప్పింది విన్న కాటికాపరికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై గాయాలు, సిగరెట్‌తో వాతలుపెట్టిన ఆనవాళ్లు వుండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పోస్టుమార్టానికి తరలించారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


అక్కయ్యపాలెం చెక్కుడురాయి బిల్డింగ్‌ సమీపంలో నివాసం వుంటున్న గుట్టల వసంత(29)కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన దివ్య (22) ఆరు నెలల కిందట ద్వారకా బస్‌స్టేషన్‌ వద్ద పరిచయమైంది. వసంత భర్త దుబాయ్‌లో వుంటుండడంతో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లింది. అప్పటి నుంచి దివ్య అక్కడే ఉంటోంది. బుధవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ... గురువారం తెల్లవారేసరికి దివ్య ఫిట్స్‌తో మృతిచెందిందంటూ వసంత తన బంధువులకు సమాచారం అందించింది. వారంతా వచ్చి ఇంటిముందు టెంట్‌ వేసి, దివ్య మృతదేహాన్ని పూలతో కప్పేశారు. స్థానికులకు కూడా అదే విషయం చెప్పింది.


కొంతమందికి అనుమానం కలిగినా తమకెందుకులే అనే భావనతో వదిలేయగా.. కొంతమంది మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వసంత, ఆమె బంధువులు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాటికాపరికి సమాచారం అందించారు. మృతురాలి వివరాలన్నీ తీసుకున్న కాటికాపరికి 22 ఏళ్ల మహిళ ఫిట్స్‌తో మృతిచెందడమేమిటని అనుమానం తలెత్తడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే స్థానికులు కూడా సమాచారం అందించడంతో ఫోర్త్‌ టౌన్‌ ఎస్‌ఐ పి.సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి చెక్కుడురాయి భవనం వద్దకు చేరుకున్నారు.


యువతి ముఖం, వీపు ఇతర శరీర భాగాలపై సిగరెట్‌తో వాతలు పెట్టిన ఆనవాళ్లు వుండడంతోపాటు మృతురాలి జుట్టు కత్తిరించి ఉంది. దీంతో ఎస్‌ఐ తన ఉన్నతాధికారుల ఆదేశం మేరకు క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ కేసులో వసంతతోపాటు ఆమె సోదరి మంజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యభిచారానికి సంబంధించిన లింకులు వున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని, పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - 2020-06-05T09:38:52+05:30 IST