Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాహంలో విస్తుగొలిపే ట్విస్ట్! కాబోయే కోడలు కన్న కూతురే అని తెలియడంతో..

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.  పెళ్లి కూతురు వరుసకు పెళ్లి కొడుక్కి చెల్లి అవడమే ఇందుకు కారణం! తాము అన్నాచెళ్లెళ్లమన్న విషయం అప్పటివరకూ ఆ వధూవరులకు తెలియదు. ఇంత జరిగాక కూడా చివరికి వారి పెళ్లి జరిగిపోయింది. టీవీ సిరియళ్లను మించిపోయే ట్విస్టులున్న ఈ వైరల్ వివాహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 

చైనాలో జియాంగ్జూ ప్రావిన్సులో సుజో ప్రాంతంలో మార్చి 31న ఓ వివాహం జరిగింది. వివాహ వేడుకకు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. వివాహం జరుగుతున్న సమయంలో వరుడి తల్లి కాబోయే కోడలి చేయిపై ఓ పుట్టుమచ్చను గమనించింది. అంతే, ఆమె గుండె పట్టు తప్పింది. ఓ వైపు..సంతోషం, మరో వైపు విచారం..! అసలు తను చూస్తున్నది నిజమేనా..? చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన కూతరినే తన కొడుకు వివాహం చేసుకోబోతున్నాడా.. అసలు ఏం జరుగుతోంది..? వరుడి తల్లి మనసులో ఏన్నో ప్రశ్నలు. మరోవైపు.. ఉంగరాలు మార్చుకునే సమయం దగ్గరపడుతోంది. దీంతో..వరుడి తల్లి కాస్త ధైర్యం చేసి వధువు తల్లిదండ్రులను ఓ కీలక ప్రశ్న వేసింది..?

‘ఈమె మీ సొంతకూతురా లేక దత్తపుత్రికా..?’ అంటూ వరుడి తల్లి తమను ప్రశ్నించగానే వధువు తల్లిదండ్రులకు తమ కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. వారు ఎంతో కాలంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న రహస్యం ఇది. కూతురికి కూడా ఈ విషయం చెప్పలేదు. మరోవైపు.. తమ జీవితాలకు సంబంధించి తమకే తెలియని రహస్యాలు బయటపడుతుండడంతో పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి నోట మాట రావట్లేదు. ఎట్టకేలకు..వధువు తల్లి అసలు విషయాన్ని చెప్పేసింది. ఆమె తమ కడుపున పుట్టిన కూతరు కాదని, వీధిలో దొరికితే ఇంటికి తెచ్చుకుని తమ కూతురిలా పెంచుకుంటున్నామని చెప్పడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ విషయం విన్న వెంటనే పెళ్లి కూతురు తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది. చిన్నప్పుడే దూరమైన తల్లి మళ్లీ తనకు కనిపించినందుకు ఆమెలో సంతోషం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోవైపు.. పెళ్లి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఆమె మనసులో సంశయాన్ని వరుడి తల్లి ఇట్టే పసిగట్టింది. ఈ పెళ్లికి తనకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. తప్పిపోయిన కూతురి కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో తాము ఓ మగపిల్లాడిని పెంచుకున్నామని చెప్పింది. వధూవరులు తోడబుట్టిన వారు కాకపోవడంతో ఈ పెళ్లికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అసలు విషయాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యేలా చేసింది. అంతే..లెక్కలేనన్ని ట్విస్టులున్న ఈ ఉదంతానికి ఒక్కసారిగా శుభం కార్డు పడింది. దీంతో..వధూవరులిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వందేళ్లు సంతోషంగా ఉండాలంటూ పెళ్లికి వచ్చినవారందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement