Abn logo
Nov 30 2020 @ 19:35PM

ఏకే 47... వరుడికి మహిళ ‘గిఫ్ట్’

ఇస్లామాబాద్ : పెళ్లిళ్ళ సందర్భాల్లో ఎటువంటి కానుకలనిస్తారో మనకు తెలిసిన విషయమే. వీటిలో... ఖరీదైనవి, సాధారణమైనవి, వింతగొలిపేవి... ఇలా రకరకాలుగా ఉంటాయన్నది కూడా తెలిసిన విషయమే. కొందరైతే... చిలిపిగా కండోమ్‌లు కూడా కానుకగా ఇస్తుంటారని వింటూంటాం. అయితే... పాకిస్తాన్ లో జరిగిన ఓ పెళ్ళిలో మాత్రం మరీ విచిత్రమైన ‘కానుక’ చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 


ఆ పెళ్లిలో ఓ మహిళ... వరుడికి ఏకంగా ఏకే 47 రైఫిల్‌ నే ‘కానుక’గా ఇచ్చి అందరినీ  ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకీస్థాన్‌లో జరిగిన ఈ ఘటనను భారతీయ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘ఇండియాలో పువ్వులిస్తాం... పాకిస్థానీలు గన్‌లు ఇస్తారు’ అంటూ ఈ సందర్భంగా తెగ కామెంట్లు చేస్తున్నారు.


కాగా... దీనిపై కొందరు పాకిస్థానీయులు కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘అది మా సాంప్రదాయం కాదు’. అని చెబుతున్నారు. ఏదేమైనా ‘పెళ్లికి ఏకే 47’ వంటి ఆయుధాన్ని కానుకగా ఇవ్వడం ఆశ్చర్యమే కదా. అయితే, వధువుకు మాత్రం ఆ గిఫ్టును స్వీకరించడం ఏమాత్రం ఇష్టం లేనట్లు కనిపించింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే... అసలా మహిళ ఏకే 47 ను ఎలా తెచ్చిందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. 

Advertisement
Advertisement