తాలిబన్లకు ముచ్చెమటలు పట్టించిన మహిళా గవర్నర్.. చివరి నిమిషం వరకూ పోరాటం.. కానీ చివరకు..

ABN , First Publish Date - 2021-08-18T18:23:45+05:30 IST

తాలిబన్ల దూకుడు చూసి దేశంలోని కీలకనేతలంతా ప్రాణాల కోసం పారిపోతున్న వేళ ఆమె మాత్రం తన ప్రజల కోసం అక్కడే నిలిచిపోయింది. చుట్టూ తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్నా తన పోరాటం ఆపలేదు.

తాలిబన్లకు ముచ్చెమటలు పట్టించిన మహిళా గవర్నర్.. చివరి నిమిషం వరకూ పోరాటం.. కానీ చివరకు..

కాబూల్: తాలిబన్ల దూకుడు చూసి దేశంలోని కీలకనేతలంతా ప్రాణాల కోసం పారిపోతున్న వేళ ఆమె మాత్రం తన ప్రజల కోసం అక్కడే నిలిచిపోయింది. చుట్టూ తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్నా తన పోరాటం ఆపలేదు. కానీ చివరకు శత్రువు ముందు ఆమె నగరం కూలిపోయింది. ఆమె శత్రువుల చేతికి చిక్కింది. ఇదేదో జానపద కథలా ఉన్నా నిజమే. ఇది అఫ్ఘాన్‌ తొలి మహిళా మేయర్ సలీమా మజారీ కథ. ప్రస్తుతం ఆమె తాలిబన్ల చెరలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె ప్రస్తుతం స్థితిగతులపై ఎటువంటి సమాచారమూ అందలేదు. చాహర్ కింట్ జిల్లాకు మేయర్‌గా ఉన్న ఆమె.. తాలిబన్లు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తున్నా వెనకడుగు వేయలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ఆక్రమించడానికి బాగా కష్టపడిన జిల్లాల్లో చాహర్ కింట్ కూడా ఒకటంటేనే.. ఆమె ఏ స్థాయిలో పోరాట పటిమ చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఆమెను ఓడించి ఆ పట్టణాన్ని వశం చేసుకోవడం ఎంత కష్టమో తాలిబన్లకు తెలిసొచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తాలిబన్ హస్తగతం అవుతున్నాయి కానీ.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు.  మొత్తం బల్ఖ్ ప్రావిన్స్ తాలిబన్ వశమయ్యే వరకూ ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారట. కానీ చివరకు తాలిబన్లు పైచేయి సాధించారు.


అఫ్ఘానిస్తాన్‌లో ఎన్నికైన ముగ్గురు మహిళా మేయర్లలో సలీమా ఒకరు. అధికారం చేపట్టిన తర్వాత ఆమె చాలా గొప్ప పనులు చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది బల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన 100 మంది కరుడుగట్టిన తాలిబన్లతో మాట్లాడిన ఆమె.. వాళ్లందరూ ప్రభుత్వానికి లొంగిపోయేలా ఆమె ఒప్పించారట. అమెరికా సైన్యం వెనుతిరిగిన తర్వాత తాలిబన్లు దూకుడు ప్రదర్శించారు. ఆ సమయంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తన ప్రజల సంక్షేమం కోసం ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-08-18T18:23:45+05:30 IST