తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావలెను... దిమ్మతిరిగేలా మహిళా అభ్యర్థి రిప్లయ్!

ABN , First Publish Date - 2021-08-02T12:34:13+05:30 IST

ఒక కంపెనీ మహిళా అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి...

తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావలెను... దిమ్మతిరిగేలా మహిళా అభ్యర్థి రిప్లయ్!

కెన్బెర్రా: ఒక కంపెనీ మహిళా అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి విచిత్రమైన కారణం చూపింది. దీనికి ఆమె ఇచ్చిన రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ పేరు చార్లెట్. ఆమె తోటమాలి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది. ఆ తరువాత ఆమెకు కంపెనీ నుంచి విచిత్రమైన సమాధానం వచ్చింది. ముందుగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసినందుకు కంపెనీ ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ... మీరు బాడీ బిల్డర్ కానందున, ఈ పనికి సమర్థులు కారని మేము అనుకుంటున్నామని, ఇది శారీరక శ్రమతో కూడుకున్న పని అని, అయినా మీరు ఈ ఉద్యోగం చేసేందుకు ఇష్టపడితే ఫలానా నంబరును సంప్రదించాలని సూచించింది.


దీనికి సమాధానంగా ఆ మహిళ... ముందుగా కంపెనీకి ధన్యవాదాలు తెలియజేస్తూ... తనకు వ్యవసాయ పనులలో అనుభవం ఉందని, 40 డిగ్రీల మండుటెండలో కూడా పని చేశానని, తాను ఆస్ట్రేలియాలో ఈ పనులలో అనుభవం సంపాదించానని పేర్కొంది. తాను ఈ ఈ మెయిల్ పంపేముందు కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్నానని, ఈ ఉద్యోగం తనకు మంచి అవకాశం లాంటిదని భావించానని తెలిపారు. అయితే ఇప్పుడు మీ సమాధానం చూస్తుంటే... ఇది తన శ్రమకు తగిన ఉద్యోగం కాదని అనిపిస్తున్నదని, మీలాంటి చులకన భావం కలిగిన వ్యక్తుల దగ్గర పనిచేయడం తగినదికాదని అనిపిస్తున్నదని పేర్కొంది. మీరు కోరుకున్నంత శక్తి తన దగ్గర లేదని, అందుకే తనకు ఇటువంటి ఉద్యోగం చేయడం ఇష్టం లేదని తెలిపింది. సదరు కంపెనీకి, చార్లెట్‌కు మధ్య జరిగిన సంభాషణను ఆమె సోదరుడు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకూ 9 లక్షల లైక్‌లు వచ్చాయి. వేల మంది ఈ ట్వీట్ చూసి కామెంట్లు చేశారు. ఆమె సదరు కంపెనీకి ఇచ్చిన జవాబును అందరూ మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2021-08-02T12:34:13+05:30 IST