వారం క్రితం పెళ్లి.. చూసేందుకు వచ్చిన తమ్ముడు.. బోరున విలపిస్తూ ఆ అక్క చెప్పిన మాటలు విని..

ABN , First Publish Date - 2021-07-16T18:20:37+05:30 IST

అక్కయ్యను వెతుక్కుంటూ ఆమె ఉన్న గదిలోకి ఆ తమ్ముడు వెళ్లాడు. గదిలో మంచంపై కూర్చున్నాడు. ఏమయిందక్కా.. ఎందుకు నన్ను బావ వాళ్లు లోపలికి రానీయడం లేదు.. నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా..?

వారం క్రితం పెళ్లి.. చూసేందుకు వచ్చిన తమ్ముడు.. బోరున విలపిస్తూ ఆ అక్క చెప్పిన మాటలు విని..

పెళ్లయిన వారం రోజుల తర్వాత అత్తారింట్లో ఉన్న అక్కను చూసేందుకు ఆమె తమ్ముడు వెళ్లాడు. అక్కయ్య వాళ్లింటికి వెళ్తున్నా అమ్మా.. అని ఇంట్లో చెప్పి మరీ వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్తే ఇంట్లోకి బావ కుటుంబం రానీయలేదు. అదేంటీ.. మా అక్కయ్యను చూడాలని వస్తే చూడనీయరేంటి..? అని నిలదీసి నానా రభస చేస్తే ఎట్టకేలకు ఓ గంటలో వెళ్లిపోవాలని కండీషన్ పెట్టి ఓకే చెప్పారు. అక్కయ్యను వెతుక్కుంటూ ఆమె ఉన్న గదిలోకి ఆ తమ్ముడు వెళ్లాడు. గదిలో మంచంపై కూర్చున్నాడు. ఏమయిందక్కా.. ఎందుకు నన్ను బావ వాళ్లు లోపలికి రానీయడం లేదు.. నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా..? నువ్వెందుకు అలా దీనంగా ఉన్నావు..? అని ఆ తమ్ముడు ప్రశ్నాస్త్రాలు సంధించాడు. అంతే అప్పటిదాకా ఆమె గుండెల్లో అదిమిపెట్టుకున్న బాధ బయటకు తన్నుకొచ్చింది. తన కష్టాన్ని చెప్పుకునేందుకు నా అనుకున్న వాళ్లు పక్కన ఉన్నారన్న ధైర్యం ఆమెలో కలిగింది. అత్తారింట్లోనూ, తన భర్త చేతుల్లోనూ తాను పడుతున్న బాధలను చెప్పుకోసాగింది. కట్నంగా ఇచ్చిన బైక్‌ను వద్దని కారు కావాలని బావ పట్టుబడుతున్నారనీ, దాన్ని ఇవ్వకపోవడంతో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆ తమ్ముడు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. త్వరలోనే సమస్యను పరిష్కరిద్దామని ఇంట్లో మాట్లాడుకున్నారు. కానీ ఈ లోపే ఘోరం జరిగిపోయింది. పెళ్లయిన 21వ రోజే ఆ నవవధువు ప్రాణాలు కోల్పోయింది. బీహార్లో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


బీహార్ రాష్ట్రంలోని హర్పూర్ పరిధిలో ఉండే కృష్ణా సోనీ కుమారుడు ఉత్తమ్‌కు గోపాల్ గంజ్ పరిధిలోని బేబీ కుమారి అనే యువతికి ఏడాది క్రితమే పెళ్లి నిశ్చయమయింది. ఆ సమయంలో మూడు లక్షల కట్నం, బైక్‌ను ఇస్తామని పెళ్లికూతురి కుటుంబం అంగీకరించింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి ఈ ఏడాది జూన్ నెలాఖరులో జరిగింది. పెళ్లి రోజే ముందుగా అనుకున్న కట్నంతోపాటు బైక్‌ను కూడా వరుడికి కానుకగా ఇచ్చారు. అయితే పెళ్లి కొడుకు మాత్రం తనకు బైక్ వద్దనీ, కారు కావాలని కోరాడు. తమకు అంత స్థోమత లేదని, బైక్‌తో సరిపెట్టుకోవాలని వధువు కుటుంబ సభ్యులు కోరారు. అయినప్పటికీ ఆ వరుడు వినలేదు. బైక్‌ను అక్కడే వదిలేసి భార్యతో సహా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే కొద్ది రోజులయితే అంతా సర్దుకుంటుందిలే అని వధువు కుటుంబ సభ్యులు భావించారు. కానీ వాళ్ల ఆలోచన తప్పని ఆ తర్వాతే తెలిసింది. 


ఓ వారం రోజులు గడిచిన తర్వాత బేబీ కుమారిని చూసేందుకు ఆమె తమ్ముడు రాఘవ్ వెళ్లాడు. అయితే రాఘవ్‌ను వాళ్లు ఇంట్లోకి రానివ్వలేదు. తన అక్కతో మాట్లాడేందుకు ఎందుకు ఒప్పుకోరంటూ రాఘవ్ గొడవపడటంతో ఓ గంటలో వెళ్లిపోవాలన్న షరతుతో లోపలికి వెళ్లనిచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మాటల మధ్యలో కుమారి అసలు విషయాన్ని ఏడుస్తూ చెప్పింది. తనను హింసిస్తున్నారనీ, భర్త కూడా నానా మాటలు అంటున్నారని వాపోయింది. తాను ఇక్కడ ఉండలేనంటూ ఏడ్చింది. దీంతో అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పి సమస్యను పరిష్కరిస్తానని రాఘవ్ భరోసాను ఇచ్చాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే త్వరలోనే పంచాయితీ పెట్టడం వంటివి చేసి సమస్యను పరిష్కరిద్దామని వాళ్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోపే ఘోరం జరిగిపోయింది. మీ అక్కకు ఒంట్లో బాగాలేదు అని రాఘవకు బుధవారం రాత్రి బావ ఫోన్ చేసి చెప్పాడు. గురువారం ఉదయం రాఘవ వెళ్లి చూసేసరికి ఇంట్లో ఎవరూ లేరు. గదిలో కుమారి శవంగా కనిపించింది. ఈ హఠాత్పరిణామానికి కంగుతున్న రాఘవ.. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆమె అత్తమామలు, భర్త పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-16T18:20:37+05:30 IST