ఇంకా పోరాడుతున్నాం!

ABN , First Publish Date - 2020-03-08T05:58:35+05:30 IST

మహిళలు విజయం సాధిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న ‘టైమ్స్‌’ మ్యాగజైన్‌ 50 ఏళ్ల కిందటే వేసుకుంది. ‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ సెక్స్‌’ కాన్సెప్ట్‌తో 1970లో ప్రత్యేక సంచిక వెలువరించింది. మహిళా ఉద్యమ...

ఇంకా పోరాడుతున్నాం!

మహిళలు విజయం సాధిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న ‘టైమ్స్‌’ మ్యాగజైన్‌ 50 ఏళ్ల కిందటే వేసుకుంది. ‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ సెక్స్‌’ కాన్సెప్ట్‌తో 1970లో  ప్రత్యేక సంచిక వెలువరించింది.  మహిళా ఉద్యమ నేత గ్లోరియా స్టైమ్‌ అందులో ఒక వ్యాసం రాశారు. తాజాగా ‘వందమంది శక్తిమంతమైన మహిళలు’ జాబితా విడుదల చేస్తూ, గ్లోరియా అభిప్రాయాలను ‘టైమ్స్‌’ కోరింది. ఈ 50 ఏళ్ళలో చోటు చేసుకున్న మార్పులపై ఆమె ఆలోచనలు..


‘‘అర్ధ శతాబ్దం కిందట, (1970లో ‘టైమ్స్‌’ మ్యాగజైన్‌లో) ‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ సెక్స్‌’ అనే ముఖచిత్ర కథనంలో భాగంగా ‘మహిళలు గెలిస్తే ఎలా ఉంటుంది?’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాను. అప్పటికీ, ఇప్పటికీ మహిళల పరిస్థితుల్లో కచ్చితంగా కొంత పురోగతి ఉంది. మహిళా సమస్యలను ఒకప్పటిలా ఇప్పుడు అప్రస్తుతంగా చూడడం లేదు. ప్రతిదానికీ అవే మూలాధారం అనే అవగాహన వచ్చింది. ఉదాహరణకు, ఒక దేశం హింసాత్మకమైనది కావచ్చు లేదా మరో దేశానికి వ్యతిరేకంగా సైనిక హింసను ప్రయోగిస్తూ ఉండవచ్చు! కానీ ఆ దేశం ఎలాంటిదో చెప్పాలంటే చూడాల్సింది పేదరికాన్నో, సహజ వనరుల సమృద్ధినో, అక్కడ ప్రజాస్వామ్యం అమలవుతున్న తీరునో కాదు; మహిళల మీద జరుగుతున్న హింసను! పునరుత్పత్తిని నియత్రించకుండా దీర్ఘకాలం పాటు జాతి విభజనను కొనసాగించడం సాధ్యం కాదు. అలాగే మహిళల శరీరాల విషయానికి వస్తే జాతి వివక్ష, లింగ వివక్ష రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. వాటిని కలిపి మాత్రమే నిర్మూలించగలం. 


స్త్రీ, పురుష భేదాలు, జాతి భేదాలు లేని సమానత్వంలో తమకు ఎనలేని విశ్వాసం ఉందని ప్రజాభిప్రాయ సేకరణల్లో చాలామంది చెబుతూ ఉంంటారు. కానీ పాతకాలం నాటి ఆధిపత్యాల కారణంగా తమకు చెందాల్సిన హక్కులకు దూరమయ్యామని అమెరికన్‌ మైనారిటీలు ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నారు. ఒక విజయం తరువాత మహా ప్రమాదం ముంచుకొచ్చే కాలం ఒకటి వస్తుంది. మనం ఇప్పుడు అలాంటి కాలంలోనే ఉన్నాం. యాభయ్యేళ్ళ కిందట నేను రాసిన వ్యాసంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో జోస్యాలు చెప్పాను, కానీ ఆ తరువాత కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాను. ఒక రచనను అందించడానికి ముందే పారితోషికాన్ని మాట్లాడుకోవడంతో సహా! ఎందుకంటే పురుష రచయితల కన్నా నాకు తక్కువ చెల్లిస్తున్నారని నా ఏజెంట్‌ ద్వారా ఆ తరువాత నాకు తెలిసింది. మరో యాభయ్యేళ్ళ తరువాత ఈ మాటలు ఎవరైనా చదివే నాటికి నేను ఉండను, కానీ మీరు చదువుతారన్న విశ్వాసం నాకుంది’’


50 ఏళ్ళ క్రితం...

‘‘ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో సగం మంది మహిళలు ఉండాలి. అప్పుడప్పుడు మహిళలు దేశాధ్యక్షులుగా ఎన్నికవుతూ ఉండాలి. అప్పుడే ఆ దేశంలో పురుషాధిక్యత వల్ల నెలకొన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అధికారం దొరికితే మేము కూడా దూకుడుగా ఉండడానికి ఉత్సాహం చూపిస్తామేమో! మహిళలు చాలా సందర్భాల్లో పురుషుల కన్నా తక్కువ పోరాడుతారనీ, కానీ అవసరం వస్తే పురుషుల కన్నా ప్రచండంగా ఉంటారనీ, ఎందుకంటే యుద్ధ క్రీడ నియమాలను మహిళలు బోధించరనీ, అవసరమైనప్పుడు మాత్రమే యుద్ధం చేస్తారనీ మార్గరెట్‌ మీడ్‌ (అమెరికన్‌ సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త) అభిప్రాయపడ్డారు. కానీ రాబోయే యాభై సంవత్సరాల్లో రాజకీయాల్లో మహిళల విలువ బాగా పెరుగుతుంది. ఎందుకంటే పురుషుల ఆలోచనా ధోరణిని మహిళలు మారుస్తారు.’’ 

(‘మహిళలు గెలిస్తే ఎలా ఉంటుంది?’ అనే శీర్షికతో 1970లో గ్లోరియా స్టెమ్‌ రాసిన వ్యాసం నుంచి)

Updated Date - 2020-03-08T05:58:35+05:30 IST