Abn logo
Sep 25 2021 @ 01:38AM

డేట్రా ఎంట్రీ ఆపరేటర్లుగా ఆర్టీసీ మహిళా కండక్టర్లు!

ఆర్టీసీ నుంచి ఆర్‌అండ్‌బీకి మహిళా కండక్టర్లు!

డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా డెప్యుటేషన్‌! 

ఇరు శాఖల అధికారుల వింత పోకడ


డెప్యుటేషన్‌ పేరిట శాశ్వత ఉద్యోగులతో రెండు ప్రభుత్వ శాఖలు ఆడుకుంటున్న ఆట. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఏర్పడింది. సాధారణంగా ఇందుకు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని వినియోగిస్తారు. కానీ ఆ శాఖకు ఆర్టీసీలో పనిచేసే వారే కావాలట. అందుకు ఆర్టీసీ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అయితే పంపింది డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాదు.. తమ శాఖలో పనిచేసే కండక్టర్లను. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రభుత్వ శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం చాలా కాలంగా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తీసుకుంటున్నారు. అందుకు భిన్నంగా రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మహిళా కండక్టర్లను ఎంపిక చేయటమే విడ్డూరంగా ఉంది. వీరికి కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అసలు లేదు. వీరంతా ఆపరేషన్స్‌ విభాగంలో ఫీల్డ్‌ వర్క్‌ చేస్తుంటారు. ఇలాంటి వారు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎలా సేవలు అందించగలరన్నది ప్రశ్న. ఈ మహిళా కండక్టర్లంతా రెగ్యులర్‌ ఉద్యోగులు. ఆర్టీసీని ఇప్పటికే సిబ్బంది కొరత వేధిస్తోంది. రెగ్యులర్‌ నియామకాలు లేవు. ఉన్న సిబ్బందిలో కొందరిని డెప్యుటేషన్‌ మీద పంపిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఆంతర్యమేమిటో తెలియకుండా ఉంది. 


ఎంపికైన ఉద్యోగులు వీరే.. 

కృష్ణా రీజియన్‌ పరిధిలో విజయవాడ డిపోకు చెందిన ఎ.రవీనా, జె.రాజ్యలక్ష్మి, సుజాత, ఎండీ ఫర్జానా, గవర్నర్‌పేట-2 డిపోకు చెందిన కె.పి.కుమారి, విద్యాధర పురం డిపోకు చెందిన ఎం.ఆర్‌.ఖాన్‌లను ఆర్‌అండ్‌బీ శాఖకు డెప్యుటేషన్‌ మీద పంపించేందుకు ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన డేటాను కూడా ఆర్‌అండ్‌బీ కమిషనర్‌కు పంపించారు. 


ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?

ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయంలో పని చేసేందుకు రెగ్యులర్‌ మహిళా కండక్టర్లను ఎంపిక చేయటం ఒక చిత్రమైతే, ఈ ఎంపిక కూడా లోపభూయిష్టంగా ఉండటం మరో చిత్రం. రెగ్యులర్‌ సిబ్బందే కావాల్సి వస్తే... జూనియర్‌ అసిస్టెంట్లను తీసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా వారు సమర్ధవంతంగా పని చేయగలుగుతారు. కార్యాలయాల్లో పని చేసే జూనియర్‌ అసిస్టెంట్ల కంటే ఫీల్డ్‌లో ఉండే కండక్టర్లు మెరుగ్గా ఎలా పని చేస్తారనేది కూడా ఆలోచించలేదు. వీరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్నది చర్చనీయాంశంగా మారుతోంది. డెప్యుటేషన్‌ మీద ఎవరినైనా పంపించాల్సి వచ్చినా, సీనియారిటీ ప్యానల్‌ను అనుసరించే పంపాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ సీనియారిటీ ప్యానెల్‌ను అనుసరించి ఎంపిక చేశారన్నది ప్రశ్నార్థకం. 


రెగ్యులర్‌ మీద ఎందుకు ఆసక్తి? 

 ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో  చాలా మందిని తొలగించారు. ఉన్న సిబ్బంది లోంచే కొందరిని ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి పంపితే సరిపోతుంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఆర్టీసీకి ఖర్చూ కలిసొచ్చేవి.