HYD : Delivary కోసం వెళితే కోమాలోకి పంపారు.. రూ.21.8 లక్షలు కట్టినా వేధింపులు!

ABN , First Publish Date - 2021-10-30T14:32:09+05:30 IST

పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళితే సరైన వైద్యం అందక పుట్టిన బిడ్డ చనిపోవడంతోపాటు..

HYD : Delivary కోసం వెళితే కోమాలోకి పంపారు.. రూ.21.8 లక్షలు కట్టినా వేధింపులు!

  • ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట బాధితుల ధర్నా 
  • మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌ నాయకులు 
  • ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. శాంతింపజేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్‌ : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళితే సరైన వైద్యం అందక పుట్టిన బిడ్డ చనిపోవడంతోపాటు గర్బిణి కోమాలోకి వెళ్లిన సంఘటన ముషీరాబాద్‌లో జరిగింది. బాధితురాలి భర్త, కుటుంబసభ్యులు, బంధువులు, టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆస్పత్రిలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించి వైద్యసిబ్బందితో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్‌కు చెందిన దుబ్బాక శిల్ప(28), ప్రభాకర్‌ దంపతులు. శిల్పకు పురిటినొప్పులు రావడంతో చికిత్స నిమిత్తం ఈనెల 16న ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చారు.. వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. అనారోగ్యంతో ఉన్న శిశువు మరణించిందని, శిల్ప సైతం తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతోందని, ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.


మెరుగైన వైద్యం అందిస్తాం.. 

గర్బిణి శిల్ప అనారోగ్యంతోనే ఆస్పత్రిలో చేరిందని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీకాంతయ్య తెలిపారు. ఆమెకు రక్తహీనతతోపాటు బలహీనంగా ఉందని తెలిపారు. ఉమ్మనీరు సహితం తక్కువగా ఉందన్నారు. అందువల్లనే ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు మరో ఆస్పత్రికి తరలించామన్నారు. శిల్ప కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆమె కోలుకునే వరకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్‌ హామీ ఇచ్చారు.


వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డను కోల్పోయాం..

శిల్ప కోమాలో ఉందని చికిత్స నిమిత్తం ఇప్పటి వరకు రూ.21.80 లక్షలు చెల్లించామని ఆమె భర్త ప్రభాకర్‌, తండ్రి రాజేశ్వర్‌రావుగౌడ్‌, తల్లి శోభ తెలిపారు. వైద్యం, మందులకు మరిన్ని డబ్బులు కట్టాలని సిబ్బంది వేధిస్తున్నారని వారు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పుట్టిన బిడ్డను కోల్పోయామని, శిల్ప తీవ్ర అనారోగ్యానికి గురైందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి  మద్దతుగా బంధు మిత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ ముషీరాబాద్‌ నాయకులు నర్సింగ్‌ప్రసాద్‌, శ్రీనివాస్‌, నానీ, బాబు, అజయ్‌ముదిరాజ్‌, భిక్షపతియాదవ్‌, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌, ఎస్‌ఐలు ఆందోళనకారులకు సర్దిచెప్పి కొంతమంది బంధువులను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చర్చలు జరిపారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2021-10-30T14:32:09+05:30 IST