Abn logo
Jul 13 2021 @ 11:32AM

అడవి బిడ్డలకు నేను ఉన్న.. వైద్యురాలి భరోసా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రహదారి సౌకర్యాలు ఉన్నా.. ప్రభుత్వం క్వార్టర్స్ అందించినా.. మారుమూల ఏజెన్సీలో వైద్య సేవలు అందించేందుకు చాలా మంది వైద్యులు ముఖం చాటేస్తుంటారు. కానీ ఆపత్కాలంలో అడవి బిడ్డలకు నేనున్నానంటూ ఓ మహిళా డాక్టర్ భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా.. ఓ మహిళా డాక్టర్ వైద్య సేవలకు వెనుకాడకుండా అటవీ గ్రామాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్నారు. చర్లమండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న మౌనిక ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అటవీ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షం కురుస్తున్నా అటవి గ్రామానికి వెళ్లారు. మార్గమధ్యలో వాగులు, గుట్టలు దాటి ఆ గ్రామానికి చేరుకుని వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.