మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

ABN , First Publish Date - 2021-06-18T05:19:16+05:30 IST

మహిళలు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని వ్యాపారంలో ఆర్థిక ప్రగతి సాధించాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
విస్తరాకులను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌


మెదక్‌రూరల్‌, జూన్‌ 17: మహిళలు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని వ్యాపారంలో ఆర్థిక ప్రగతి సాధించాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌ మేరీ మహిళా స్వయంసహాయక సంఘం తయారు చేసిన విస్తరాకులను కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. మేరీ సహాయక సంఘం మహిళలు రూ.లక్షా30వేల గ్రామైఖ్య సంఘం నుంచి కమ్యూనిటీ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ తీసుకుని విస్తరాకులు తయారు చేయడం మంచి పరిణామమన్నారు. అడవిలో నుంచి మోదుగాకులను సేకరించి అందుకు ముడి పదార్థాలు మార్కెట్‌ నుంచి తీసుకొని స్వచ్ఛమైన ఆకుతో విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. వీరిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వాట్స్‌పగ్రూపుల్లో తమ వస్తువులను ఉంచి ఆర్డర్లపై పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు అందిస్తామని మహిళలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, ఏపీడీ భీమయ్య, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ప్రకాష్‌, రామాయంపేట మండల అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రాములుతో పాటు గ్రూపు మహిళలు పాల్గొన్నారు. 


గ్రామాలు మెరిసేలా పని చేయండి

 పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరోడ్లు మండల, గ్రామ రహదారుల వెంట ఎక్కడ గ్యాప్‌ లేకుండా విరివిగా పలు వరుసల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం  చేసుకోవాలని సూచించారు. మెదక్‌ జిల్లా నుంచి వెళ్లే మూడు జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ఆయాశాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా డీఎ్‌ఫవోకు సూచించారు. ప్రతి మండలంలో ప్రముఖులు మొక్కలు నాటే విధంగా కనీసం ఐదు ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఇటీవల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో జరిగిన సమావేశంలో అధికారులు పనిచేస్తున్నారు కానీ ఇంకా క్షేత్రస్థాయిలో అక్కడక్కడ పారిశుధ్యం లోపించిందని పచ్చదనం కొరవడిందని ఆ గ్యాప్‌ను పూర్తిచేయాలని సూచించారు. త్వరలోతాను, రాష్ట్రస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఆశించినస్థాయిలో అభివృద్ధి లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే మూడు మాసాలు చాలా క్లిష్టమైనవని, ఆ మూడు మాసాలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి వందశాతం పనులు చేపట్టాలని సూచించారు. అనుమతి లేని కట్టడాలను, అక్రమ కట్టడాలను, అక్రమ లేఅవుట్లను  గుర్తించి నోటీసులు ఇచ్చి తొలగించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో  శైలేష్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌ కుమార్‌, డీఎ్‌పవో జ్ఞానేశ్వర్‌, తూప్రాన్‌  ఆర్డీవో శ్యాం ప్రకాష్‌, మండల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:19:16+05:30 IST