ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత

ABN , First Publish Date - 2020-03-08T06:41:20+05:30 IST

మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమించినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుకబడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణులు, మహిళలు స్వయంగా...

ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత

మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమించినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుకబడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణులు, మహిళలు స్వయంగా విధించుకునే పరిమితులు కారణమని చెప్పవచ్చు. పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో పోల్చితే తక్కువ వేతనాలు అందుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలపై అవగాహన లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, వివాహపరమైన అవరోధాలు మహిళలు ఆర్థికంగా పురోగమించకుండా అడ్డు తగులుతున్నాయి. చట్టాల్లో కూడా వారి పట్ల వివక్ష అధికంగా ఉంది. ఈ అవరోధాలన్నీ దాటుకుంటూ వారు ఆర్థిక సాధికారత సాధించడం ఎలాగంటే.. 


ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం

భారత మహిళలు ఆర్థిక బాధ్యతలు చేపట్టేందుకు విముఖంగా ఉంటారు. దీనివల్ల వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పురుషులదే పైచేయిగా మారుతుంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను భర్తకు అప్పగిస్తుంటారు. దీంతో ఆర్థికపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు నిండే సమయానికి పురుషుల సగటు జీవిత కాలం 77.2 సంవత్సరాలుంటే మహిళలకు 78.6 సంవత్సరాలుంది. అంటే పురుషులతో పోల్చితే మహిళలే సగటున ఎక్కువ కాలం జీవిస్తున్నారన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అవివాహితలు, విడాకులు తీసుకున్నవారు, భర్త లేని వారు,  ఒంటరి మహిళల సంఖ్య 7.4 కోట్లుంది. ఇలాంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరం. 


పొదుపు పెరగాలి

పురుషులతో పోల్చితే మహిళలు అందుకునే వేతనాలు తక్కువగా ఉండడం పరిపాటి. సమాన హోదాలో పని చేస్తున్నప్పటికీ వారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. దీనికి తోడు మహిళలు ఆర్థిక వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించలేరనే అపోహ కూడా సమాజంలో ఉంది. మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటున్న తరుణంలో సొంతంగానే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోగల నైపుణ్యాలు సాధించడం, దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టడం అవశ్యం. వేతనాలు తక్కువ ఉన్నందు వల్ల పురుషుల కన్నా అధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. మహిళలు ఉద్యోగం చేసే కాలపరిమితి పురుషులతో పోల్చితే తక్కువ. మాతృత్వపు సెలవులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైతే వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడం వంటివి తప్పనిసరి.


భద్రత ప్రధానం

కుటుంబ సంక్షేమంతో పాటు తమ సొంత భద్రతకు మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయడంతో పాటు తమ రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు విభిన్న పొదుపు సాధనాలను ఎంచుకోవడంతో పాటు వయసుల వారీగా కేటాయింపులు చేసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న మహిళలు తమ కోసం పొదుపు చేసుకునే మొత్తంలో 70 శాతం ఈక్విటీకి, 30 శాతం డెట్‌కు కేటాయించుకోవచ్చు. వీటిలో ఈక్విటీ ఫండ్లతో పాటు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి రక్షిత సాధనాలపైనా దృష్టి పెట్టాలి. పొదుపు ఒక్కటే కాదు.. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆదుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ ఖర్చులను తట్టుకోగల అత్యవసర నిధి సమకూర్చుకోవాలి. అంతేకాకుండా వార్షిక వేతనానికి 7 నుంచి 10 రెట్లు అధికంగా బీమా రక్షణ పొందాలి. జీవిత బీమాతోపాటు ఆరోగ్య రక్షణ ప్లాన్లు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లపై దృష్టి పెట్టాలి. ఒకేసారి ఇంత భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి తటపటాయించే ఆస్కారం ఉంది.  


అత్తమామల కోసం పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించాలి. వయసు పెరిగే కొద్ది అనారోగ్యాల రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఆ రిస్క్‌ను తట్టుకోవాలంటే అత్తమామలకు బీమా ఉండి తీరాలి. అలాగే పిల్లల కోసం పెట్టుబడి పెట్టే తరుణంలో 18 ఏళ్లు నిండే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే నాటికి ఉన్నత విద్యాభ్యాసం, వివాహం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌)ను అనుసరించాలి.



వయసును బట్టి పొదుపు: వయోవృద్ధుల కోసం నిర్దేశించుకున్న పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీలో, 30 శాతం డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసి 50 శాతం నగదును చేతిలో ఉంచుకోవాలి. పిల్లల కోసం కేటాయించే పెట్టుబడిలో 90 శాతం ఈక్విటీ, 5 శాతం డెట్‌, 5 శాతం నగదు ఉంటే చాలు.




ఈ పట్టికను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగం ప్రారంభించిన సమయంలో వేతన వ్యత్యాసం, కెరీర్‌ బ్రేక్‌లు అన్నీ లెక్క వేసుకుంటే 60 ఏళ్లు నిండే సమయానికి మహిళలు పొదుపు చేసే సొమ్ము, అప్పటికీ సమకూరే కార్పస్‌ రెండూ పురుషులతో పోల్చితే తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కార్పస్‌ ఆదుకునే కాలపరిమితి కూడా పురుషులతో పోల్చితే తక్కువే. అదే సమయంలో సగటు జీవన కాలపరిమితి పురుషులకన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేతనం, పొదుపులో కూడా పురుషులకన్నా మహిళలది పైచేయిగా ఉండాలి. ఇది సాధ్యం కావాలంటే మహిళలు ఉద్యోగాల్లో చేరే సమయంలోనే మెరుగైన వేతనం కోసం బేరసారాలు సాగించడంతోపాటు పురుషుల కన్నా ఎక్కువ పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. పై ఉదాహరణనే పరిశీలనలోకి తీసుకుంటే పురుషులు తమ వేతనంలో 10 శాతం పొదుపు చేస్తే మహిళలు 17 శాతం పొదుపు చేయాలి. అప్పుడే రిటైర్మెంట్‌ సమయానికి పురుషులతో సమానంగా కార్పస్‌ సమకూర్చుకోగలుగుతారు.  

Updated Date - 2020-03-08T06:41:20+05:30 IST