మహిళలను గౌరవించాలి

ABN , First Publish Date - 2022-03-07T04:47:57+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా బంధు కేసీఆర్‌ సంబరాలను స్థానిక స్టేడియంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.

మహిళలను గౌరవించాలి
స్పీకర్‌కు రాఖీ కడుతున్న మహిళలు

- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా బంధు కేసీఆర్‌ సంబరాలను స్థానిక స్టేడియంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం మహిళా బంధు సంబరాల్లో భాగంగా పారిశుధ్య కార్మికులు, హాస్పిటల్‌ నర్సులు, మహిళా కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మహిళా క్రీడాకారులను సన్మానించారు. తమ అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నందుకు ఈ సందర్భంగా మహిళలు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. ఎంత గొప్ప వారైనా, పెద్ద హోదాలో ఉన్నా మహిళలను గౌరవించాలన్నారు. సమాజంలోని మహిళలను మన తల్లి, సోదరిగా భావించి గౌరవించాలన్నారు. ఎక్కడైతే ఆడవారు కంట నీరు రాకుండా సంతోషంగా ఉంటారో అక్కడ శుభం చేకూరుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ మహిళల అభివృద్ధి, సంక్షేమ కోసం దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్లు ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, కౌన్సిలర్లు, వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, నాయకులు, తదితరులున్నారు. 

మహిళా దినోత్సవ సంబరాలను విజయవంతం చేయండి

బీర్కూర్‌ : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మహిళా దినోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో వేంకటేశ్వరస్వామి వారిని స్పీకర్‌ దర్శించుకున్నారు. స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో కల్యాణ మండపంలో బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ, సంరక్షణ అభివృద్ధి కార్యక్రమాలను మహిళలందరికీ వివరించాలన్నారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-07T04:47:57+05:30 IST