Abn logo
May 13 2021 @ 12:19PM

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో మహిళల అభిరుచులు మారాయ్..

  • మెరుపు కాదు మురిపింపే?!
  • వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో మారిన మహిళల అభిరుచులు
  • మాస్కుధారణ కూడా కారణమేనంటున్న బ్యూటీషియన్లు

హైదరాబాద్ సిటీ : అతివల అందాల దగ్గరకు వచ్చేసరికి ఎర్రని పెదాలకు ప్రత్యేక స్థానం ఉంది. అసలు మేకప్‌లో లిప్‌స్టిక్‌ది ప్రత్యేక శైలి. ఎంత గొప్పగా ఫౌండేషన్‌ వేశాం, ఐ లాషెస్‌, మస్కరా తీర్చిదిద్దామనేదానికన్నా ముఖారవిందం, మేని ఛాయను అనుసరించి చేసే పెదాల పూత సరికొత్త అందాలనూ అందిస్తుందన్నది బ్యూటీషియన్ల మాట. అసలు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో లిప్‌స్టిక్‌కు ఉన్నంత స్థిరత్వం మరే బ్యూటీ ప్రొడక్ట్‌లోనూ ఉండదు. అయితే అదంతా గతమే! మాస్కుధారణ తప్పనిసరి అయిన కాలంలో మెరుస్తూ కవ్వించే పెదాలకు స్ధానమెక్కడ? ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడం, భావోద్వేగాలను పెంచుకోవడంలో అత్యంత కీలకపాత్ర పోషించే లిప్‌స్టిక్‌ను ఇప్పుడు వాడుతున్నారా..? అని అంటే, గతమం కాదనే అంటున్నాయి లిప్‌స్టిక్‌ల అమ్మకాలు. అంతేనా... గ్లోసీ లిప్‌స్టిక్స్‌కు బదులు మ్యాటీ లిప్‌స్టిక్స్‌నే వాడుతున్నారని కూడా చెబుతున్నారు బ్యూటీషియన్లు. అదే సమయంలో నూతన సాధారణత వేళ లిప్‌స్టిక్స్‌ అందాల కన్నా కళ్ల అందాలకే ప్రాధాన్యతనిస్తున్నారని ఇటీవలి కాలంలో పలువురు తారలు, సీరియల్‌ నటులు కూడా కళ్లందాలపై శ్రద్ధ చూపించడమూ కనిపిస్తుందని వెల్లడిస్తున్నారు.


పెదవులు మూసుకున్నాయి... 

ప్రపంచమంతా ఆర్థిక మాంధ్యంలో కూరుకుపోయిందని గగ్గోలు పెట్టిన కాలంలోనే లిప్‌స్టిక్‌ అమ్మకాల పరంగా మాత్రం ఎలాంటి మార్పు కనిపించని బ్యూటీ ప్రపంచంలో సైతం కరోనా కాస్త మార్పును తీసుకొచ్చిందనే చెప్పాలి. అలాగని గణనీయంగా వీటి అమ్మకాలు పడిపోయాయనడమూ సాహసమే! నిజానికి లిప్‌స్టిక్‌ను వాడుతున్నారు కానీ గతమంత ఘనంగా, గ్లోసీ లిప్‌స్టిక్స్‌ పూయడం లేదన్నారు బ్యూటీషియన్‌ యాస్మిన్‌. ఆమెనే మాట్లాడుతూ ఇప్పుడు దాదాపుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిలు మాత్రమే కాదు పలు ఎంఎన్‌సీ కంపెనీలలో పనిచేసే ఎంతోమంది వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలనే వినియోగించుకుంటున్నారు. ఆఫీ్‌సకు వచ్చేటప్పుడు అయితే కాస్త అందంగా కనబడాలని కోరుకుంటారు. కానీ ఇంట్లో అంత అవసరమేముందని భావిస్తుండటం, గ్లోసీ, ఆయిలీ లిప్‌స్టిక్స్‌ రాసుకుంటే అవి మాస్కులకు అంటుకోవడం వంటి సమస్యలు కూడా వీటి పట్ల కాస్త క్రేజ్‌ తగ్గటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అలాగని లిప్‌స్టిక్‌ వాడకుండా ఏమీ లేరు. 


జూమ్‌ మీటింగ్స్‌ కాలంలో వాటికీ క్రేజ్‌ ఉంది. అయితే ఇప్పుడు పెదాలకు బదులు కళ్లపై ఏకాగ్రత పెరిగింది’ అని అన్నారు. అసలు సంప్రదాయ మాటీ లిప్‌స్టిక్‌ ఇప్పుడు మరలా అమ్మాయిల హ్యాండ్‌బ్యాగ్‌లలో చేరిపోయిందని బ్యూటీ నిపుణులు చెబుతూ మాస్క్‌లకు అనుకూలమైన లిప్‌స్టిక్స్‌ వస్తే మాత్రం వాటికి ఆదరణ తప్పక ఉంటుందంటున్నారు. కొవిడ్‌ ముందుకాలంలో ట్రెండ్‌గా సూపర్‌ గ్లోసీ లిప్స్‌ వెలుగొందినా, ఇప్పుడు మాత్రం ఈ ట్రెండ్‌ అని చెప్పే పరిస్థితులు మాస్క్‌ల కారణంగా లేనే లేవన్నారు ఓ యునిసెక్స్‌ సలోన్‌లో మేకప్‌ ఆర్టిస్ట్ కరీనా. ఆమెనే వివరిస్తూ లిప్‌ కలర్‌ ఏది వేసుకోవాలనేది వ్యక్తిగత ప్రాధాన్యతకనుగుణంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం బెర్రీ, న్యూడ్స్‌ ట్రెండ్‌ కావొచ్చనుకుంటున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్‌ వచ్చింది. 2021 ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కబడతాయనే భావన... అని చెప్పుకొచ్చారు.

కనులు మెరుస్తున్నాయి...

మాస్కుల కాలంలో సగంపైగా ముఖం మాస్కుతోనే కప్పబడిపోయిన వేళ, తమ బ్యూటీ స్పృహ ఎలా తెలుస్తుందనే వారిప్పుడు కనుల అందాలకు మెరుగులద్దడానికి శ్రమిస్తున్నారు. ఈ కారణం చేతనే ఇటీవలి కాలంలో  కనుల విభాగంలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని పలు సంస్థలు అంటున్నాయి. కాజల్‌, ఐ పెన్సిల్స్‌, ఐ షాడో పాలెట్స్‌వంటి వాటికి డిమాండ్‌ బాగుందని ఓ లేడీస్‌ ఎంపోరియం యజమాని గుప్తా తెలిపారు. ఐ మేకప్‌ పట్ల ఇటీవలి కాలంలో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు బ్యూటీషియన్‌ యాస్మిన్‌. ఆమెనే మాట్లాడుతూ బోల్డ్‌, గ్రాఫిక్‌ ఐ లైనర్‌ ట్రెండ్‌ ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. ఇక అధికంగా ప్రయాణాలు చేసే మహిళలు పర్పుల్‌ ఐ మేక్‌పను కోరుకుంటున్నారు. ఇక జూమ్‌ మీటింగ్స్‌లో ఉండేవారైతే న్యూట్రల్‌ క్రీమ్‌ కలర్‌ ఐ మేకప్‌ వాడుతున్నారన్నారు. - హైదరాబాద్‌ సిటీ

Advertisement