ఆకాశమే హద్దు.. అవకాశం వదలద్దు

ABN , First Publish Date - 2020-03-08T10:17:21+05:30 IST

నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ జట్టు ఓవైపు.. మూడుసార్లు సెమీస్‌తో సరిపెట్టుకుని తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత జట్టు మరోవైపు.. ఆదివారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో...

ఆకాశమే హద్దు.. అవకాశం వదలద్దు

  • ఆత్మవిశ్వాసంతో భారత్‌
  • ఫైనల్లో ఆసీస్‌తో అమీతుమీ
  • మహిళల టీ20 ప్రపంచకప్‌


2017 వన్డే వరల్డ్‌కప్‌.. ఏ మాత్రం అంచనాల్లేకున్నా అద్భుత ఆటతీరుతో భారత మహిళల జట్టు ఏకంగా ఫైనల్‌కు చేరింది. కానీ కీలక పోరులో తడబడింది..

2018 టీ20 ప్రపంచకప్‌.. ఒక్క ఓటమి లేకుండా సెమీస్‌ దాకా చేరినా మళ్లీ అదే నిరాశ.. 

2020 టీ20 ప్రపంచకప్‌.. ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి తుదిపోరుకు చేరింది. ఐసీసీ టోర్నీల్లో ఈ తడబాటుకు స్వస్తి పలికేందుకు మరో మమమమహత్తర అవకాశం.. ఇక ఒకే మ్యాచ్‌.. ఎన్నో అవమానాలను తట్టుకుంటూ భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనం ఈ ప్రస్థానం. ఇక మిగిలిందల్లా.. ఒత్తిడిని దరి చేరనీయకుండా ఈ అసలైన మ్యాచ్‌లో ఆసీస్‌పై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడమే.. అటు చాంపియన్‌గా నిలిస్తే దేశంలో మహిళల క్రికెట్‌ తలరాతే మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగే ఈ మ్యాచ్‌లో మన అమ్మాయిలు సగర్వంగా త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాలని కోరుకుందాం..


మెల్‌బోర్న్‌: నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ జట్టు ఓవైపు.. మూడుసార్లు సెమీస్‌తో సరిపెట్టుకుని తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత జట్టు మరోవైపు.. ఆదివారం  మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ దృశ్యమిది. ఐదో టైటిల్‌తో ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యానికి తిరుగులేదని ఆతిథ్య జట్టు నిరూపించుకోవాలనుకుంటోంది. సొంతగడ్డపై భారీ ప్రేక్షకుల మధ్య ఈ కీలక మ్యాచ్‌ ఆడడం వారికి కలిసివచ్చే అంశం. అయితేనేం.. సమష్టి పోరాటమే తోడుగా పటిష్ఠ జట్లపై గెలుస్తూ ఇక్కడిదాకా వచ్చిన భారత మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సై అంటే సై అనేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎనిమిది రోజులుగా ఆటకు దూరంగా ఉన్న భారత ప్లేయర్స్‌ బ్యాటింగ్‌లో లోపాలు సరిచేసుకుని చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. అంతేకాకుండా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను దెబ్బతీయడం భారత శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టయింది.


షఫాలీ అండగా ఉన్నా...

భారత జట్టు ఫైనల్‌ దాకా చేరిందంటే ఓపెనర్‌ షఫాలీ వర్మ బ్యాటింగ్‌ చేసిన విధానమే కారణం. ఆరం భంలోనే బౌలర్లపై విరుచుకుపడుతూ 16 ఏళ్ల వయస్సులో ఆమె చూపిస్తున్న తెగువ ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆమే భారత జట్టు ప్రధాన ఆయుధం. టోర్నీ జరుగుతున్న సమయంలోనే ఈ ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌ స్థానానికి చేరిన ఈ చిచ్చరపిడుగు తుది పోరులోనూ మెరుపు ఆరంభాన్ని అందించాలని జట్టు కోరుకుంటోంది. ఒకవేళ ఆమె బ్యాట్‌ ఝుళిపించకపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న కూడా అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ఎందుకంటే స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ ఈ టోర్నీలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. షఫాలీ మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తుపాను ఇన్నింగ్స్‌తో 161 పరుగులు సాధించింది. ఆమె స్ట్రయిక్‌ రేట్‌ చూస్తే ఆసీస్‌ బౌలర్లకు వణుకుపుడుతోంది. అయితే టైటిల్‌ గెలవాలంటే షఫాలీ మాత్రమే ఆడితే సరిపోదు. ఫైనల్లో మంధాన, కౌర్‌ బ్యాట్లు గర్జించాల్సిందే. 2018 మెగా టోర్నీ తరహాలో ఈ జోడీ కనుక చెలరేగితే భారత అవకాశాలు రెట్టింపవుతాయి.  


పూనమ్‌ కీలకం

ఇక బౌలింగ్‌ విభాగం సూపర్‌ ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అంశం. జట్టు ఒక్కసారి కూడా 150కి పైగా పరుగులు సాధించకున్నా అజేయంగా నిలిచిందంటే అది బౌలర్ల పుణ్యమే. లెగ్గీ పూనమ్‌ యాదవ్‌ ఇప్పటికే 9 వికెట్లతో టోర్నీ టాపర్‌ గా ఉంది. ఆరంభ మ్యాచ్‌లో బ్యాట్స్‌వుమన్‌ విఫలమై తక్కువ స్కోరే చేసినా పూనమ్‌ 4 వికెట్లతో ఆసీస్‌కు షాక్‌ ఇవ్వగలిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో పూనమ్‌ బంతులను ఎదుర్కొనేందుకు ఆసీస్‌ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. లెఫ్టామ్‌ స్పిన్న ర్లు రాధా యాదవ్‌, రాజేశ్వరి, పేసర్‌ శిఖాపాండే కూడా ప్రభావం చూపిస్తున్నారు. 


ప్రతీకారం కోసం

ఏడుసార్లు ప్రపంచకప్‌ జరిగితే ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన ఆసీస్‌ ఇప్పుడు ప్రతీ కారంతో రగులుతోంది. ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ను స్వల్ప స్కోరుకే కట్టడిచేసినా స్పిన్‌ ఉచ్చులో పడి చిత్తయింది. ఆ తర్వాత మరో పరాజయం లేకుండా ఫైన ల్‌కు చేరింది. ఇప్పుడు భారత్‌పై బదులు తీర్చుకునే సమయం వచ్చిందని ఆసీస్‌ భావిస్తోంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ జట్టుకు దూరమైనా ఆసీస్‌ ఫైనల్‌ చేరగలిగింది. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారిణులతో కూడిన జట్టు ఇది. అందుకే మరోసారి భారత్‌కు అవకాశం ఇవ్వ కూడదన్న పట్టుదలతో ఉంది. మెగ్‌ లానింగ్‌, అలీసా హీలీ, బెత్‌ మూనీ, గార్డ్‌నర్‌లతో బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉండగా, బౌలర్లు జొనాసెన్‌, షట్‌, కేరీ సత్తా చూపిస్తున్నారు. 


ఒక్కో షాట్‌.. 50 సార్లు ప్రాక్టీస్‌ 

టీమిండియా ఓపెనర్‌ షఫాలీ వర్మ ఈ టోర్నీలో మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతోంది. జట్టుతో సంబంధం లేకుండా పేసర్‌, స్పిన్నర్‌ భేదం లేకుండా క్రీజులోనుంచి ముందుకొచ్చి బౌలర్ల తలమీదుగా అలవోకగా సిక్సర్లు బాదుతోంది. ఆ షాట్లను సునాయాసంగా కొట్టడానికి షఫాలీ ఎంతో శ్రమించిందని ఆమె కోచ్‌ అశ్వినీకుమార్‌ చెప్పాడు. రోహ్‌తక్‌లోని శ్రీరామ్‌ నారాయణ్‌ క్రికెట్‌ అకాడమీలో అశ్వినీకుమార్‌ ఆఽధ్వర్యంలో షఫాలీ రాటుదేలింది. ‘ప్రతీ షాట్‌ కొట్టేలా ఆమెను తీర్చిదిద్దాం. ప్రాక్టీ్‌సలో.. ఒక్కో షాట్‌ను రోజూ 50 సార్లు కొట్టేది. అందుకే వరల్డ్‌క్‌పలో ఆమె సునాయాసంగా భారీ షాట్లు సంధిస్తోంది’ అని కుమార్‌ వివరించాడు.


స్పిన్నర్లతో ఆసీస్‌ ఫుల్‌ ప్రాక్టీస్‌

ఆరంభ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల ధాటికి చవిచూసిన దారుణ పరాభవాన్ని ఆసీస్‌ ఇంకా మరిచిపోలేదు. అందుకే ఈ టైటిల్‌ పోరులో వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్పిన్నర్ల బౌలింగ్‌లో జోరుగా ప్రాక్టీస్‌ చేసింది. కేవలం పూనమ్‌ యాదవ్‌పైనే తాము దృష్టి పెట్టలేదని, భారత జట్టులో ఎడమచేతి స్పిన్నర్లు రాధా యాదవ్‌, రాజేశ్వరి కూడా ఇబ్బందిపెట్టేవారేనని కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ చెబుతోంది. ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావీయబోమని స్పష్టం చేసింది.


జట్లు (అంచనా)

భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌. 

ఆసీస్‌: బెత్‌ మూనీ, అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), ఆష్లీ గార్డ్‌నర్‌, రాచెల్‌ హేన్స్‌, జెస్‌ జొనాసెన్‌, నికోలా కేరీ, డెలిస్సా కిమ్మిన్స్‌, జార్జియా వేర్‌హామ్‌/ మోలీ స్ట్రానో, సోఫీ మోలినెక్స్‌, మెగాన్‌ షట్‌. 


పిచ్‌, వాతావరణం

మెల్‌బోర్న్‌లో ఆదివారం వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది. వర్షం కురిసే అవకాశం లేదు. అయితే రెండు వారాల నుంచి ఎంసీజీలో ఒక్క మ్యాచ్‌ కూడా జరగలేదు. ఈ వికెట్‌ బంతికి బ్యాట్‌కు సమానంగా అనుకూలించనుంది. ఆరంభంలో మాత్రం బౌలర్లు ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత మాత్రం బ్యాటర్స్‌కు పండగే..


వర్షం వస్తే..

సెమీస్‌ తరహాలో కాకుండా ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేకపోతే ఇరుజట్లనూ సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు. 


టై అయితే...

ఫైనల్‌ మ్యాచ్‌లో స్కోర్లు సమమైతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే.. మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. ఇలా ఫలితం తేలే వరకు సూపర్‌ ఓవర్లను కొనసాగిస్తారు. ఒక సూపర్‌ ఓవర్‌లో బ్యాట్స్‌వుమన్‌ అవుటైతే.. ఆమె మరో సూపర్‌ ఓవర్‌లో ఆడడానికి వీలులేదు. అలాగే ఒక బౌలర్‌ వరుసగా రెండు సూపర్‌ ఓవర్లు వేయడానికీ అనుమతించరు. ఒక వేళ స్కోర్లు టై అయిన తర్వాత వర్షం కురిసి సూపర్‌ ఓవర్‌ నిర్వహించలేకపోతే ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 


ప్రధాని మోదీ శుభాకాంక్షలు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌కంటే విశేషమైనది మరొకటి లేదు. రెండు జట్ల మహిళలకు బెస్ట్‌ విషెస్‌.


1..... ఓపెనర్‌ షఫాలీ వర్మ మరో 67 పరుగులు చేస్తే భారత్‌ నుంచి టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా గంభీర్‌ (227, 2007 టోర్నీలో)ను అధిగమిస్తుంది.


21.... ఐసీసీ మెగా టోర్నీల్లో ఆసీస్‌ మహిళల జట్టు 23 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో 21 సార్లు గెలవగా.. భారత్‌ మాత్రం 10 నాకౌట్‌లలో మూడింట్లోనే నెగ్గింది.


ప్రైజ్‌మనీ..  

2018తో పోల్చుకుంటే ప్రైజ్‌మనీ మొత్తం ఐదు రెట్లు పెరిగింది. విజేత జట్టుకు రూ. 7.40 కోట్లు, రన్నరప్‌ టీమ్‌కు రూ. 3.70 కోట్లు లభిస్తాయి.


టీ-20 ప్రపంచకప్‌లలో ఎవరెలా?

ఏడాది                     భారత్‌           ఆస్ర్టేలియా

2009                 సెమీఫైనలిస్ట్‌         సెమీఫైనలిస్ట్‌

2010                 సెమీఫైనలిస్ట్‌             విజేత

2012                  గ్రూప్‌ దశ             విజేత

2014                  గ్రూప్‌ దశ             విజేత

2016                  గ్రూప్‌ దశ            రన్నరప్‌

2018                 సెమీఫైనల్‌             విజేత


మ్యాచ్:

  • మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ 1,2, దూరదర్శన్‌లలో..
  • ముగింపోత్సవం (కేటీ పెర్రీ షో) మధ్యాహ్నం 12 గంటలకు..
  • మళ్లీ మ్యాచ్‌ అనంతరం

Updated Date - 2020-03-08T10:17:21+05:30 IST