చక్‌ దే ఇండియా

ABN , First Publish Date - 2021-08-03T09:46:02+05:30 IST

నిజంగా ఇది కనీవినీ ఎరుగని విజయమే. వరుసగా మూడు ఓటములు.. అయినా అదృష్టం కొద్దీ క్వార్టర్స్‌కు చేరారనే అభిప్రాయం నెలకొన్న వేళ.. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ..

చక్‌ దే ఇండియా

  • భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన..
  • ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కు 
  • మూడుసార్లు విజేత ఆస్ట్రేలియాకు షాక్‌
  • నేడు బెల్జియంతో పురుషుల జట్టు సెమీస్‌ సమరం

బలమైన ప్రత్యర్థుల ముందు నిలుస్తారా? కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలుస్తారా? అన్న అనుమానాలు, అవమానాల నుంచి భారత మహిళ ల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసింది. గ్రూప్‌ దశలో వరుసగా మూడు ఓటములు ఎదురైనా.. పుంజుకుని ముందడుగేసిన అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం క్వార్టర్‌ ఫైనల్లో.. మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను 1-0తో మట్టికరిపించి తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించారు. నిజంగా ఇది కనీవినీ ఎరుగని విజయమే. వరుసగా మూడు ఓటములు.. అయినా అదృష్టం కొద్దీ క్వార్టర్స్‌కు చేరారనే అభిప్రాయం నెలకొన్న వేళ.. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. కలిసికట్టుగా కదం తొక్కుతూ.. ఇదిగో ఇదీ మా సత్తా అంటూ భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్‌ విజేతగా ఉండి ఈ గేమ్స్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ తొలిసారిగా అమ్మాయిలు సెమీ్‌సలో అడుగుపెట్టారు. ఇక ఆసీస్‌ వరుస దాడులకు అడ్డుగోడవుతూ.. ఏకంగా 9 షాట్లను తట్టుకుని.. భారత్‌ ఆధిక్యాన్ని కాపాడిన గోల్‌కీపర్‌ సవితా పూనియా చూపిన తెగువ అత్యద్భుతం.. ఈ గెలుపు ఎలా చూసినా మహిళల హాకీకి చిరస్మరణీయం కానుంది.  


మన జట్టు బుధవారం అర్జెంటీనాతో పోటీ పడనుంది. మరోవైపు సోమవారం మిగతా అన్ని క్రీడల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. డిస్కస్‌ త్రోలో కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఆరో స్థానానికి పరిమితమైంది. ఎన్నో అంచనాలున్న షూటర్లు విఫలమవడంతో భారత్‌ పోరు పూర్తిగా ముగిసింది. 49 ఏళ్ల తర్వాత సెమీస్‌ చేరిన పురుషుల హాకీ బృందం..  మంగళవారం బెల్జియంను ఎదుర్కోనుంది.


టోక్యో: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమీ్‌సకు చేరిన మర్నాడే.. మహిళల హాకీ జట్టు కూడా మురిపించింది. ఎవరి అంచనాల్లో లేని రాణీ రాంపాల్‌ బృందం అపూర్వంగా రాణిస్తూ.. ఒలింపిక్‌ చరిత్రలో తొలిసారిగా సెమీఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ 2 ఆస్ట్రేలియాను 1-0తో కంగుతినిపించింది. 22వ నిమిషంలో లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను డ్రాగ్‌ ఫ్లికర్‌ గుర్జీత్‌ కౌర్‌ గోల్‌గా మలిచి ఆసీ్‌సకు షాకిచ్చింది. అయితే 7 పెనాల్టీ కార్నర్లను, 2 ఫీల్డ్‌ గోల్స్‌ ప్రయత్నాలను భారత కీపర్‌ సవిత అడ్డుకున్న తీరు మాత్రం అబ్బురపరిచింది. ఈ మ్యాచ్‌లో ఆమె లేకపోయుంటే భారత్‌ భారీతేడాతో చిత్తయ్యేదేమో. బుధవారం జరిగే సెమీ్‌సలో అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది. ఒకవేళ సెమీ్‌సలో ఓడినా భారత జట్టుకు కాంస్య పతక పోరులో ఆడే అవకాశముంటుంది. 


ఎదురొడ్డి నిలిచారు

పూల్‌ ‘బి’లో ఆసీస్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా క్వార్టర్స్‌ చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఒలింపిక్‌ స్వర్ణం వారి ఖాతాలో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్‌పై వారికి విజయం సులువేనని అంతా భావించారు. కానీ మ్యాచ్‌ ఆద్యంతం ప్రత్యర్థి జట్టే ఒత్తిడిలో పడింది. ఆరంభంలోనే గోల్‌ కోసం ఇన్‌సైడ్‌ సర్కిల్‌ నుంచి మలోన్‌ ఆడిన స్లాప్‌ షాట్‌ను కీపర్‌ సవిత అడ్డుకుంది. ఆ తర్వాత భారత మహిళలు ఒక్కసారిగా దూకుడు పెంచి ఆసీస్‌ దుర్భేద్యమైన రక్షణ శ్రేణిని ఛేదిస్తూ వెళ్లారు. ఇది ఆసీ్‌సకు ఊహించని పరిణామం. తొమ్మిదో నిమిషంలో వందన అందించిన పాస్‌ను రాణి గోల్‌కోసం ప్రయత్నించింది. అయితే ఆ షాట్‌ నేరుగా పోస్ట్‌ను తాకి వెనక్కి వచ్చింది. తొలి క్వార్టర్‌లో మరో చాన్స్‌ వచ్చినా భారత్‌ సద్వినియోగం చేసుకోలేదు. 20వ నిమిషంలో ఆసీ్‌సకు పెనాల్టీ చాన్స్‌ దక్కినా భారత డిఫెన్స్‌ వమ్ము చేసింది. మరో 2 నిమిషాలకే భారత్‌కు సువర్ణావకాశం దక్కింది. గుర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ఎత్తులో నేరుగా గోల్‌ సాధించడంతో భారత్‌ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. దీంతో షాక్‌కు లోనైన ఆసీస్‌ విజృంభించగా, ఎక్కువ ఆటంతా భారత్‌ ఇన్‌సైడ్‌ సర్కిల్‌లోనే సాగింది. ఈ దశలో ఆసీ్‌సకు వరుసగా 3 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయినా కీపర్‌ సవిత, డీప్‌ గ్రేస్‌ ఎక్కాతో కూడిన భారత్‌ డిఫెన్స్‌ గోల్‌ పోస్ట్‌ ముందు అడ్డుగోడలా నిలిచింది. చివరి 8 నిమిషాల్లో ఆసీస్‌ జట్టు భారత్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అయినా, ఎలాంటి తడబాటుకు లోనవని భారత్‌.. ఆసీస్‌ 4 పెనాల్టీ కార్నర్లను గోల్స్‌ కాకుండా నిలువరించింది. మొత్తంగా ఆసీస్‌ 14 గోల్‌ ప్రయత్నాల్లో తొమ్మిదింటిని కీపర్‌ సవిత అడ్డుకోవడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. 


లేటైనా ఫర్వాలేదు.. స్వర్ణంతో రండి

భారత మహిళల జట్టు సెమీస్‌లో ప్రవేశించడంతో కోచ్‌ జోర్డ్‌ మార్జిన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు ప్లేయర్స్‌ కూడా విజయం సాధించగానే కోచ్‌ను ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగంతో కనిపించారు. అయితే జట్టుపై అంచనాలు లేవు కాబట్టి నాకౌట్‌కు వెళ్లకుండానే వస్తారని అంతా భావించారు. ఆ నేపథ్యంలో కోచ్‌ మార్జిన్‌ ‘సారీ ఫ్యామిలీ.. కాస్త ఆలస్యంగా వస్తాం’ అని టీమ్‌ బస్‌లో దిగిన ఫొటోతో ట్వీట్‌ చేశాడు. దీనికి బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ స్పందించాడు. ‘సమస్యేమీ లేదు. కానీ వచ్చేటప్పుడు వంద కోట్ల భారతావని కోసం స్వర్ణం తీసుకురండి. ఫ్రం: మాజీ కోచ్‌ కబీర్‌ సింగ్‌’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి ప్రతిగా కచ్చితంగా అనుకున్నది తీసుకొస్తాం. ఫ్రం: రియల్‌ కోచ్‌’ అంటూ మార్జిన్‌ రీట్వీట్‌ చేశాడు. గతంలో చక్‌దే ఇండియా సినిమాలో షారుక్‌ మహిళల హాకీ జట్టు కోచ్‌ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆసీ్‌సను ఓడిస్తూ జట్టు వరల్డ్‌ చాంపియన్‌గా నిలుస్తుంది.

Updated Date - 2021-08-03T09:46:02+05:30 IST