సరిరారు మాకెవ్వరూ

ABN , First Publish Date - 2020-10-17T05:54:06+05:30 IST

కరోనా మహమ్మారి దేశంలో ఔత్సాహిక మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తల వ్యాపార దృక్పథంలో కనివిని ఎరుగని మార్పు తెచ్చింది.

సరిరారు మాకెవ్వరూ

కరోనా కష్టాలకు కొత్త వ్యూహాలతో చెక్‌

మహిళా వ్యాపారవేత్తల్లో తొణికిసలాడుతున్న విశ్వాసం


కరోనా మహమ్మారి దేశంలో ఔత్సాహిక మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తల వ్యాపార దృక్పథంలో కనివిని ఎరుగని మార్పు తెచ్చింది. కొవిడ్‌-19 కల్లోలం అనంతరం సైతం వ్యాపారాలు సజీవంగా ఉండేలా చేసుకోవడానికి వారు తమ వ్యాపార నమూనాలను త్వరితగతిన మార్చేసుకుంటున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. బియాన్‌ అండ్‌ కో, గూగుల్‌, ఏడబ్ల్యూఈ ఫౌండేషన్‌ ఈ సర్వే నిర్వహించాయి. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో 90 శాతం మంది ఈ సంక్షోభాన్ని అధిగమించి వ్యాపారాలు కాపాడుకోగలుగుతామన్న విశ్వాసం ప్రకటించారు.


కాగా 73 శాతం మంది ఆదాయ నష్టం అత్యంత అధికంగా ఉన్నట్టు చెప్పగా 20 శాతం మంది వ్యాపారాలు పూర్తిగా అంతరించిపోయినట్టు సర్వేలో తేలింది. ఈ గడ్డు స్థితి నుంచి గట్టెక్కేందుకు అనుసరించిన వ్యాపార వ్యూహాల్లో భాగంగా అధిక శాతం మంది కొత్త ఉత్పత్తులు, సేవలను ప్రారంభించారు. అలాగే ఉత్పత్తులు, సేవలను కస్టమర్లకు చేర్చే క్రమంలో డిజిటల్‌ టెక్నాలజీలను ఆశ్రయించారు. సరఫరా వ్యవస్థలు, అమ్మకం, మార్కెటింగ్‌ కార్యకలాపాలను సమూలంగా మార్చేశారు.


60 శాతం మంది కొత్త ఉత్పత్తులు, సేవలను జోడిస్తున్నట్టు చెప్పగా 46 శాతం మం ది కొత్త నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించామని, సిబ్బందికి నవీన ధోరణులపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సంక్షోభం తొలి నెలలతో పోల్చితే కాలం గడుస్తున్న కొద్ది మారిన వాతావరణానికి అనుగుణంగా స్పందించే ధోరణి త్వరితగతిన మారిందని సర్వే ప్రధాన అధ్యయనవేత్త, బియాన్‌ పార్టనర్‌ మేఘా చావ్లా అన్నారు. ప్రధానంగా తక్కువ పెట్టుబడి, పరిమాణం గల సేవల ఆధారిత వ్యాపారాలు ఈ మార్పునకు అనుగుణంగా అమిత వేగంగా స్పందించగలిగినట్టు ఆమె చెప్పారు. 

కాగా ప్రపంచవ్యాప్తంగా మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపింది. అన్ని రకాల సామాజిక సూచీల్లోనూ పురుషులకు, మహిళలకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉన్న భారతదేశంలో వారి పరిస్థితి మరింత సునిశితంగా ఉంది.


భారత్‌లో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు మొత్తం 1.6 కోట్ల వరకు ఉన్నాయి. వాటిలో 20 శాతం కన్నా తక్కువ వ్యాపారాలు మాత్రమే ఏకవ్యక్తి యాజమాన్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకుని నిలదొక్కుకుని వ్యాపారాలను కొనసాగించడం వారి లో అధిక శాతం మందికి అత్యంత కీలకమని సర్వే పేర్కొంది. 


  


  సర్వే వివరాలు


350 - సర్వే సందర్భంగా ప్రశ్నించిన మొత్తం ఔత్సాహిక మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలు 

54% - ఇప్పటికే వ్యాపార వ్యూహాలు మార్చేసుకుని 

కొత్త ఉత్పత్తులు, సేవలు ప్రారంభించాం

24% - డిసెంబరు నాటికి వ్యాపార 

వ్యూహాలు సమూలంగా మార్చబోతున్నాం 

90% - ఈ సంక్షోభాన్ని అధిగమించి 

వ్యాపారాలు కాపాడుకోగలుగుతాం

73% - ఆదాయ నష్టం చాలా తీవ్రంగా ఉంది.

20% - వ్యాపారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి


Updated Date - 2020-10-17T05:54:06+05:30 IST