ఇద్దరు మహిళల ప్రేమ కథ

ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST

ప్రేమకు కులమతాలు, అంతస్థులే కాదు, జెండర్లు కూడా అడ్డు కాదని నిరూపించిందో సేమ్‌ సెక్స్‌ జంట. రాష్ట్రాలు, నేపధ్యాలు వేరైనా వెనకడుగు వేయలేదు. ..

ఇద్దరు మహిళల ప్రేమ కథ

ప్రేమకు కులమతాలు, అంతస్థులే కాదు, జెండర్లు కూడా అడ్డు కాదని నిరూపించిందో సేమ్‌ సెక్స్‌ జంట. రాష్ట్రాలు, నేపధ్యాలు వేరైనా వెనకడుగు వేయలేదు. సమాజాన్నీ ఖాతరు చేయలేదు. సేమ్‌ సెక్స్‌ జంటలకు స్ఫూర్తిగా నిలిచేలా తమ ప్రేమ బంధాన్ని ఎంగేజ్‌మెంట్‌ సెరిమనీతో మరో అడుగు ముందుకు తీసుకెళ్లిందా అమ్మాయిల జంట. తమ ప్రేమ ప్రయాణం గురించి కోల్‌కతాకు చెందిన పరోమితా ముఖర్జీ, నాగ్‌పూర్‌కు చెందిన సురభి మిత్రాలు నవ్యతో పంచుకున్న ఆ విశేషాలు... 


సెక్సువల్లీ ఓరియెంటెడ్‌ స్పృహ 

పరోమిత: 16 ఏళ్ల వయసులో నేను మహిళలకే ఆకర్షితురాలిని అవుతున్నానని గ్రహించాను. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పాను. ఇదంతా సాధారణమేననీ, నెమ్మదిగా పరిస్థితి సర్దుకుంటుందనీ వాళ్లు చెప్పడంతో, అంతటితో ఆ విషయాన్ని వదిలేశాను. 


సురభి: ఎమ్‌బిబిఎస్‌  చదివే రోజుల్లో, 17 ఏళ్ల వయసులో నేను సెక్సువల్లీ ఓరియెంటెడ్‌ టు విమెన్‌ అనే విషయాన్ని గ్రహించాను. మెడికల్‌ కాలేజీ వాతావరణం, ఇలాంటి సెక్సువల్‌ ఓరియెంటేషన్‌ను స్వాగతించే విద్యార్థుల మధ్య పెరగడంతో నాకున్న ఈ ఓరియెంటేషన్‌ పట్ల వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతలనూ నేను ఎదుర్కోలేదు.


తల్లితండ్రుల రియాక్షన్‌

పరోమిత: నా విషయంలో నాన్న, చెల్లి సానుకూలంగా స్పందించారు. కానీ 2013 వరకూ అమ్మకు చెప్పకుండా దాచాను. ఆవిడకు చెప్పినప్పుడు, ‘నువ్వు నా కూతురివి కావు, నీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు’ అంది. ఆవిడ మాటలకు గుండె పగిలిపోయింది. తర్వాత కొన్ని నెలలకు ఆవిడ నన్ను అర్థం చేసుకుని, అంగీకరించింది. అయితే నా భవిష్యత్తు గురించి కంగారు పడుతూ ఉంటుంది. 

సురభి: నాకు స్నేహితులు, సన్నిహితుల మద్దతు ఉంది. డాక్టర్లైన నా తల్లితండ్రులకు చెప్పినప్పుడు అమ్మ షాక్‌కు గురైంది. సేమ్‌ సెక్స్‌ రిలేషన్స్‌ గురించి ఆవిడకు వ్యతిరేకత ఉంది. నేను అదే విషయాన్ని పదే పదే మాట్లాడుతూ ఉండడం, వాళ్లూ ఆ టాపిక్‌ గురించి రీసెర్చ్‌ చేసి, మానసిక నిపుణులతో మాట్లాడుతూ ఉండడంతో అంతిమంగా పరిస్థితి నాకు అనుకూలంగా మారింది. ఇద్దరూ నా సెక్సువల్‌ ఓరియెంటేషన్‌ను స్వాగతించారు. 


పెద్దలు అంగీకరించారిలా...

సురభి: నేను పరోమిత గురించి ఇంట్లో చెప్పినప్పుడు తనను నాగపూర్‌కు పిలిపించమన్నారు. పరోమిత వచ్చి, అందర్నీ కలిసింది. నా కుటుంబంతో పాటు స్నేహితులు, బంధువులూ అందరూ పరోమితను అంగీకరించారు. కలిసి పండగలు, వేడుకలు చేసుకున్నాం. 


పరోమిత: సురభి గురించి మా ఇంట్లో చెప్పినప్పుడు అంతగా వ్యతిరేకత రాలేదు. నా ఓరియెంటేషన్‌ గురించి తెలుసు కాబట్టి, ఏదో ఒకరోజు ఇలాంటి సందర్భం వస్తుందని వాళ్లు ఊహించి ఉండబట్టి మా అనుబంధానికి అడ్డు చెప్పలేదు. 


ప్రేమకు మనసులు కలవడం ముఖ్యం

పరోమితా ముఖర్జీ: మాది కచ్చితంగా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. అన్ని జంటల మధ్య ప్రారంభంలో ఉండే ఆకర్షణే మా మధ్యా ఉండేది. మా పరిచయం కూడా యాధృచ్చికమే! అమేజాన్‌లో కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నేను, సెక్సువల్‌ ఓరియెంటేషన్‌కు సంబంధించిన సభలు, సమావేశాలకు హాజరవుతూ ఉంటాను. అలా కోల్‌కతాలో జరిగే మెంటల్‌ హెల్త్‌ కాన్ఫెరెన్స్‌లో మొదటిసారి సురభిని చూశాను. ఆ ఈవెంట్‌లో సురభి ప్రసంగం నన్ను ఆకర్షించింది. ఈవెంట్‌ ముగిశాక తనను కలిసి, ఇన్‌స్టాగ్రామ్‌ ఐడి తీసుకున్నాను. తర్వాత నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అలా క్రమేపీ మా మధ్య అనుబంధం పెరిగింది.  నేను ప్రపోజ్‌ చేయడం సురభి ఒప్పుకోవడం జరిగిపోయింది. 

సురభి: పరోమితా ప్రపోజ్‌ చేయడం, నేను ఒప్పుకోవడం అంతా సవ్యంగానే జరిగిపోయింది. సమాజం సమ్మతితో మాకు పని లేదు. కానీ తల్లితండ్రులను వ్యతిరేకించి పెళ్లికి సిద్ధపడడం సరైన పని కాదు. అన్నిటికంటే పెద్ద సవాలు అదే!


కంటేనే పిల్లలా?

సేమ్‌ సెక్స్‌ కపుల్‌ పిల్లలను కనడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. మేమిద్దరం మహిళలమే కాబట్టి మాలో ఎవరైనా తల్లి కావచ్చు. మాలో ఎవరైనా కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయించవచ్చు. సర్రోగసీ ప్రత్యామ్నాయం కూడా ఉంది. అన్నిటికీ మించి పిల్లల కోసం దత్తతను ఆశ్రయించడం ఉన్నతమైన విధానం అని నా అభిప్రాయం. ఎంతో మంది అనాథ పిల్లలున్నారు. మాకేమీ మా రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్నే పెంచాలనే ఆలోచన లేదు. పెంపకం సక్రమంగా సాగితే, పెరిగే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారని నా నమ్మకం. కాబట్టి అనాథ పిల్లలను మేం దత్తత తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. 


ఆ ఆనందంలో సైతం...

శారీరకంగా ఒక స్త్రీని మరో స్త్రీ తృప్తిపరిచినంతగా పురుషుడు తృప్తి పరచలేడనే కథనాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత వాస్తవం లేకపోలేదు. మహిళను శారీరకంగా ఉద్రేకపరిచే ప్రదేశాలు ఎక్కడుంటాయో, మరో మహిళే కచ్చితంగా తెలుసుకోగలుగుతుంది. ఈ విషయంలో ఇతర జెండర్‌కు అవగాహన కొంత తక్కువే! అలాగే సాధారణంగా లైంగిక క్రీడలో ఎక్కువ శాతం వ్యక్తులు తమ లైంగిక తృప్తికే ప్రాధాన్యం ఇస్తారే తప్ప, అవతలి వ్యక్తి తృప్తిని అంతగా పరిగణలోకి తీసుకోరు. కానీ మహిళ పార్ట్‌నర్‌గా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉండదు. అలాగే సెక్స్‌లో మానసిక స్థితి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళల లైంగికత భావోద్వేగాలతోనే చైతన్యమవుతుంది. మహిళలు వినడం ద్వారా ఉద్రేకానికి లోనైతే, పురుషులు చూడడం ద్వారా ఉద్రేకానికి లోనవుతారు. ఇద్దరు మహిళల విషయంలో ఎలా భావోద్వేగాలను చైతన్యపరచాలో ఇద్దరికీ అవగాహన ఉంటుంది. కాబట్టి లైంగిక క్రీడలో పొందే ఆనందం, తృప్తీ పరిపూర్ణంగా ఉంటుంది.


అనుబంధానికి కొత్త పేర్లు

ఇప్పటికీ మాలాంటి వాళ్ల అనుబంధాలకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. న్యాయపరమైన సవాళ్లు ఎదురవకుండా ఉండడం కోసం మేం మా ఎంగేజ్‌మెంట్‌కు కమిట్‌మెంట్‌ సెరిమనీ అనే పేరు పెట్టుకున్నాం. పెళ్లికి కూడా మేం ‘సివిల్‌ యూనియన్‌’ అనే పేరు పెట్టుకున్నాం. 1977లో బ్రిటిష్‌ కాలంలో బ్రిటిషర్లు ఇలాంటి పెళ్లిళ్లను సివిల్‌ యూనియన్‌గా సంభోదించేవారు ఆ పేరునే మేమూ ఎంచుకున్నాం. మా పెళ్లి వచ్చే శీతాకాలం, సముద్రతీరంలో జరిగే అవకాశం ఉంది. 


రహస్యంగా ఎందుకుంచాలి?

సెక్సువల్‌ ఓరియెంటేషన్‌ బహిరంగపరచడం వల్ల సామాజిక అవగాహన ఏర్పరచడంతో పాటు, అదే స్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తులకు మానసిక స్థైర్యం కూడా అందించినట్టు అవుతుంది. ఇలాంటి వ్యక్తుల పట్ల జాతీయ మద్దతు పెరుగుతోంది. నిజానికి ఇలాంటి సెక్సువల్‌ ఓరియెంటేషన్‌ వ్యక్తులు మన దేశంలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ రహస్యంగా ఉండిపోవడం వల్ల వీరిని, మైనారిటీ వర్గంగానే సమాజం భావించే పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే, ఈ కోవకు చెందిన వ్యక్తులు ధైర్యంగా తమ ఐడెంటిటీని బహిర్గతం చేయాలి. అలాగే ఈ కోవకు చెందిన వ్యక్తులు వారి ఓరియెంటేషన్‌కు సరైన విలువ, అంగీకారం దక్కాలంటే, వారు విద్యార్హతలను పెంచుకోవడంతో పాటు, ఆర్థిక  స్వతంత్ర్యాన్ని సాధించాలి. మాలాంటి సేమ్‌ సెక్స్‌ కపుల్స్‌ అనుబంధానికి చట్టపరమైన గుర్తింపు దక్కేలా, ప్రభుత్వ మద్దతు దక్కేలా కృషి చేయడమే మా ప్రస్తుత కపుల్‌ గోల్‌. - సురభి మిత్రా

- గోగుమళ్ల కవిత

Updated Date - 2022-01-27T05:30:00+05:30 IST