Amaravathi లో మూడు రాజధానులకు అనుకూలంగా శిబిరం

ABN , First Publish Date - 2021-08-08T19:29:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ

Amaravathi లో మూడు రాజధానులకు అనుకూలంగా శిబిరం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత 599 రోజులుగా రైతులు, రైతు కూలీలు నిరసనలు, దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరిన సందర్భంగా ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ.. మూడు రాజధానులకు అనుకూలంగా శిబిరం ఏర్పాటయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి ఈ శిబిరానికి జనాలను ఆటోల్లో కొందరు వైసీపీ నేతలు దగ్గరుండి మరీ తరలిస్తున్నారు. మూడు చెక్ పోస్ట్‌లు దాటుకుని వెంకటపాలెం క్రాస్ రోడ్‌కు పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. స్థానికులు, మీడియావారిని ఎక్కడికెళ్తున్నారు..? వెళ్లడానికి వీళ్లేదు కదా.. ఆంక్షలు ఉన్నాయని చెప్పగా.. మూడు రాజధానుల శిబిరానికి వెళుతున్నట్లు మహిళలు సమాధానమిచ్చారు.


అంతా ఆ మీడియా పనేనా..!?

అయితే.. అధికార మీడియా ప్రతినిధులు దగ్గరుండి మహిళలున్న ఆటోలను పోలీసు చెక్ పోస్ట్ దాటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీడియా చిత్రీకరించడంతో వారిని పోలీసులు వెనక్కి పంపారు. ఆటోలను అనుమతించాలంటూ పోలీసులపై కొందరు వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు మీడియా.. అటు అధికార పార్టీ నేతల ఫోన్ కాల్స్‌తో పోలీసులకు ఏం చేయాలో దిక్కు తోచక మిన్నకుండిపోతున్నారు.


డీఎస్పీకే సమాచారం లేదు!

ఇదిలా ఉంటే.. ఎక్కడా ర్యాలీలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. అమరావతి ఉద్యమకారులను అడుగడుగునా ఖాకీలు అడ్డుకుంటున్నారు. తనిఖీల పేరుతో సామాన్య ప్రజలను కూడా నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిరసనకారులను ఏపీ37 విఎల్1794 పోలీస్ స్టిక్కర్ ఉన్న జీపులో ఖాకీలు తరలిస్తున్నారు. అయితే దీని గురించి డీఎస్పీ మీడియా అడగ్గా తరలింపుపై తనకు సమాచారం లేదని చెబుతున్నారు.

Updated Date - 2021-08-08T19:29:36+05:30 IST