బర్త్‌డే గర్ల్‌.. సాధించేనా?

ABN , First Publish Date - 2020-03-07T10:49:27+05:30 IST

మరొక్క విజయం చాలు మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ కోసం అటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ...

బర్త్‌డే గర్ల్‌.. సాధించేనా?

మార్చి 8.. ఆదివారం. భారత క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.. ఎందుకంటే మహిళల టీ20 ప్రపంచక్‌పలో తొలి టైటిల్‌ కోసం ఆసీ్‌సతో అమీతుమీ తేల్చుకునేందుకు మన జట్టు సిద్ధమవుతోంది. అంతేకాదు.. అదే రోజు  కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 31వ పడిలోకి అడుగుపెట్టనుంది. దీంతో తమ క్రికెట్‌ చరిత్రలోనే అద్భుత విజయంతో ఆ రోజును చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటోంది. అయితే ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఈ కీలక మ్యాచ్‌లో తిరిగి బ్యాట్‌ ఝుళిపిస్తే విజయం కష్టం కాబోదు..


హర్మన్‌ప్రీత్‌ పుట్టిన రోజునే ప్రపంచకప్‌ ఫైనల్‌

టైటిల్‌తో  చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదల


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

మరొక్క విజయం చాలు మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ కోసం అటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా ఆసక్తిగానే కాదు.. కాస్త ఉద్వేగంగానూ ఎదురు చూస్తోంది. కారణం.. తన 31వ పుట్టిన రోజు నాడే కెరీర్‌లోనే పెద్ద మ్యాచ్‌ను ఆమె ఆడబోతోంది. అత్యంత అరుదుగా దక్కే ఇలాంటి క్షణాలను ఆస్వాదిస్తూనే.. గెలిచి కప్‌ కొడితే అంతకు మించిన కానుక కౌర్‌కు ఏముంటుంది. అటు ఆసీస్‌ మాత్రం ఈ ఏడాది అత్యధిక విజయాలతో పాటు  స్వదేశంలో అభిమానుల మధ్య తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాలనుకుంటోంది. కానీ ఒక్క ప్లేయర్‌కు వారి ఆశలను తలకిందులు చేసే శక్తి ఉంది. ఆమే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌. ఈ ఆదివారం తమ సారథి పూర్తి స్థాయిలో చెలరేగాలని జట్టు కోరుకుంటోంది.  కానీ టైటిల్‌ గెలిచినా లేకపోయినా ఈ మ్యాచ్‌ మాత్రం ఆమె జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో భారత జట్టు ఫైనల్‌ దాకా చేరింది. వాస్తవానికి ఇప్పటికే తను ఓ రికార్డు ముంగిట నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడిన భారత మహిళల జట్టు మొదటి కెప్టెన్‌గా కౌర్‌ నిలవనుంది. 

 

రికార్డు స్థాయిలో ప్రేక్షకులు..

మహిళల క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ అంతంత మాత్రమే. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియాలు నిండడమనేది దాదాపుగా జరగదు. ఈ టోర్నీలో భారత్‌-ఆసీ్‌స మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌ను తిలకించేందుకు రికార్డు స్థాయిలో 13వేల మంది వచ్చారు. ఆతర్వాత ఎప్పటిలాగే ప్రేక్షకులు తగ్గిపోయారు. కానీ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే తుది సమరం మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించబోతోంది. లక్ష ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం దాదాపుగా నిండిపోనుంది. ఇప్పటికే 70వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీంతో కనీవినీ ఎరుగని స్థాయిలో మహిళల క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణకు అంతా సిద్ధమైంది. స్వదేశంలో చివరిసారి 1988 వన్డే వరల్డ్‌క్‌పలో ఆసీస్‌ మహిళల జట్టు ఇంగ్లండ్‌తో తలపడింది. అప్పుడు కూడా ఫైనల్‌కు ఎంసీజీ ఆతిథ్యమివ్వగా అంత భారీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 3 వేల మంది మాత్రమే హాజరయ్యారు.


మహిళల క్రికెట్‌కు దిక్సూచి

2009లో జరిగిన తొలి టీ20 ప్రపంచక్‌పలోనే హర్మన్‌ప్రీత్‌ భారత్‌ తరఫున బరిలోకి దిగింది. ఆతర్వాత క్రమంగా ఆఫ్‌స్పిన్నర్‌గా, స్టార్‌ బ్యాటర్‌గా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచక్‌పలో జట్టు లీగ్‌ దశలోనే వెనుదిరిగి నిరాశపరిచిన వేళ 2016లో హర్మన్‌ పగ్గాలు చేపట్టింది. ఆతర్వాత జట్టు ఆటతీరే మారింది. 2017 వన్డే ప్రపంచకప్‌ సెమీ్‌సలో ఆసీ్‌సపై హర్మన్‌ అజేయంగా 171 పరుగులు సాధించడంతో మహిళల క్రికెట్‌పై అందరి దృష్టీ పడింది. ఆ ఇన్నింగ్స్‌ ధాటికి లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా 2016లోనే మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారత ప్లేయర్‌గా నిలిచింది. 113 టీ20 ఇన్నింగ్స్‌లో 2182 పరుగులు, 29 వికెట్లు తీసిన హర్మన్‌ ఈ కీలక టోర్నీలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతోంది. షఫాలీ వర్మ డాషింగ్‌ ఆటతీరుతో జట్టు ఇబ్బందిలేకుండా ఫైనల్‌కు చేరగలిగింది. హర్మన్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కసారే రెండంకెల స్కోరు సాధించింది. కానీ ఇలాంటి మెగా మ్యాచ్‌లో పుంజుకోవడమెలాగో తనకు బాగా తెలుసు. భారీ సిక్సర్లతో విరుచుకుపడే హర్మన్‌ మళ్లీ తన బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఆసీ్‌సపై ఊచకోతకు దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే మహిళల క్రికెట్‌ కప్‌తో స్వదేశానికి తిరిగిరావడం ఖాయం.


తల్లిదండ్రుల సమక్షంలో..

ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌కు మరో మధుర అనుభూతిని కూడా మిగల్చనుంది. తమ కూతురిని క్రికెట్‌ స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించేందుకు వారు ఇప్పటికే భారత్‌ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో వారికా అవకాశం దక్కలేదు. ఇక ఏకంగా ఫైనల్‌ మ్యాచ్‌ వారి కోరిక తీర్చనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే తల్లిదండ్రుల సమక్షంలో ఫైనల్‌ గెలిచి కప్‌ను అందుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బలంగా కోరుకుంటోంది.  

Updated Date - 2020-03-07T10:49:27+05:30 IST