వర్క్‌ ఫ్రమ్‌ విలేజ్‌

ABN , First Publish Date - 2020-04-02T05:59:01+05:30 IST

ఓ పక్క కరోనా... ఇంకో పక్క సోషల్‌ మీడియా వణికించి పారేస్తున్నాయి. దీనికితోడు సోషల్‌ డిస్టెన్స్‌ అనే పదం వచ్చి చేరింది. చిన్నపుడు సోషల్‌ క్లాసులు ఎగ్గొట్టేవాడిని... కాస్త పెద్దయ్యాక సోషలిజం ఉపన్యాసాలకు

వర్క్‌ ఫ్రమ్‌ విలేజ్‌

‘కలలు కనండి... సాకారం చేసుకోండి’ అన్నారు అబ్దుల్‌ కలామ్‌ సార్‌. కానీ, ఇప్పుడు అంతా ‘మ’కారం మీద ధ్యాస... అమెరికా పయనం మీద ఆశే తప్ప ఇంకెక్కడి కలలు! ‘సోషల్‌’గా నాలుగు మాటలు రాద్దామనుకుంటే ఆ కలమూ లేదు... 

ఆ కలామూ లేరు. ఇప్పుడున్నదంతా కరోనా కాలమే! వింటేనే నా పెన్నులోంచి సారీ... 

నా వెన్నులోంచి వణుకు పుడుతోంది. 

ఓ పక్క కరోనా... ఇంకో పక్క సోషల్‌ మీడియా వణికించి పారేస్తున్నాయి. దీనికితోడు సోషల్‌ డిస్టెన్స్‌ అనే పదం వచ్చి చేరింది. చిన్నపుడు సోషల్‌ క్లాసులు ఎగ్గొట్టేవాడిని... కాస్త పెద్దయ్యాక సోషలిజం ఉపన్యాసాలకు ఆమడదూరంలో ఉండేవాడిని. అదేంటో ఈమధ్య సోషల్‌ మీడియాను వాటేసుకుని వదల్లేకపోతున్నా. నిజం చెప్పాలంటే, పట్నం వచ్చాక పల్లె వాసనలు నాలో పూర్తిగా పోయాయి. స్మార్ట్‌గా ఉంది కదా అని ఈ సొల్లు ఫోన్‌ కొనడం వల్లే కొంపకు తిప్పలు వచ్చిపడ్డాయి. కోడి కూతకే నిద్ర లేవాల్సి ఉన్నా... నా చేతిలోనే ఉన్న ట్విట్టర్‌ పిట్ట రాత్రి అంతా నిద్రపోనివ్వడం లేదు. వావ్‌ అనేలా వాట్సాప్‌ మెసేజ్‌ లొకటి. టీవీ కూడా స్మార్ట్‌గా మారేసరికి గొట్టంగాడు (యూట్యూబ్‌) దాపురించాడు. ఇంకేముంది జబ్బు బాగా ముదిరిపోయింది. వీరమాచనేని ఫుడ్డు నడుంనొప్పి పోగొట్టే బెడ్డు వాడేం ‘పీకే’ వీడేం గోకే... లాంటివన్నీ చూసేసరికి సమయమంతా చంకనాకి పోయింది. 


నేనుండేది అసలే నగరం... అదో పెద్ద నరకం. ఓ పక్క కరోనా తరుముతోంది... ఏం చేద్దాం అనుకుంటుంటే మనసు ‘పల్లెకు పోరా’ అంది. ‘మనసు గతి ఇంతే’ అని తిట్టుకోలేదు... పోనీ ‘పల్లెకుపోయి పారును చూద్దామా’ అంటే ఆమె ముసలిదైపోయి ఉండొచ్చు. మనలో ఒరిజినల్‌ అలానే ఉందిలెండి... టిప్‌ టాప్‌గా కాకపోయినా నా ల్యాప్‌టాప్‌తో ఊళ్లో అడుగుపెట్టాను. అక్కడ అడుగుపెట్టగానే గోడల మీద మనుషుల కన్నా కోతులే ఎక్కువగా కనిపించాయి. మా ఊళ్లో తిప్పి కొడితే వెయ్యి గడపలు కూడా ఉండవు. ఒకప్పుడు నాలుగు కిలో మీటర్లు నడిస్తేగాని ఊరు చేరేవాడిని కాదు... ఇప్పుడు ఆటో ఎక్కితే పది రూపాయలు... పది నిముషాలు చాలు. 


‘ఏరా కరోనా వస్తే గానీ ఊరు గుర్తురాలేదా?’ చిన్ననాటి స్నేహితుడు ఒకడు నిష్ఠూరంగా మాట్లాడాడు. ఏదో సంపాదిద్దామని పట్నం వెళ్ళి, ఉన్న రెండెకరాలూ అమ్మేశా. కానీ, ఊళ్లో ఉన్న నా స్నేహితుడి రెండెకరాలూ అలాగే ఉంది. ఎక్కడ తేడా కొట్టింది చెప్మా అనుకున్నా. ఊరు ఏమీ మారలేదు... జనాభా అలాగే ఉంది. పెదనాన్న కొడుకు రాంబాబు ఇంటికి వెళ్లా. ‘ఒరే రాంబాబూ! లోడెత్తరా... కరోనా వస్తోందంట’ అన్నాడు బాబాయి కొడుకు చినబాబు. వాడికి కాస్త వెటకారం ఎక్కువ. ‘ఊరేం పెరగలేదేంట్రా’ అన్నాను.


‘అందరూ పట్నాలు పోతుంటే ఊరేం పెరుగుతుందన్నా! ఈ మధ్య గవర్నమెంటు పింఛను ఇస్తోందని పోయినోళ్లంతా మళ్లీ ఇక్కడితే వస్తున్నారు. ఇప్పుడు కరోనా కూడా వచ్చింది కదా! ఊరు మళ్లీ కళకళ లాడుతుందిలే’ అన్నాడు. కూలీలు లోడెత్తుతుంటే నాకనిపించింది... ‘ఇలాంటి ధాన్యం బస్తాలు ఎత్తుతుంటే అంతకన్నా ఆరోగ్యం ఏముంటుంది’ అని! 


కరోనా గురించి గోడ మీద బాతాఖానీ... వాట్సప్‌లో వీడియోలు చూపించి, ‘చూడండి! కరోనా ఎంత దారుణంగా ఉందో’ అన్నా. నన్ను వెర్రివాణ్ణి చూసినట్లు చూశాడు మా పనిలోకి వచ్చే ఎంకన్న. ‘అవన్నీ ఫేక్‌ అండీ... పేపర్లో వచ్చేదే నమ్మండి’ అన్నాడు. ‘ఓర్నీ... నీకెన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయిరా’ అనుకున్నా. 


దేశమంతా లాక్‌డౌన్‌ అంటున్నా, ఆ ఎఫెక్ట్‌ ఇక్కడ పల్లెటూళ్ళో ఏమీ కనిపించలా! పొలం గట్టు నుంచి వెళుతుంటే మా పనుల్లో తిరిగే దాసు కనిపించాడు. ‘ఏంటండీ! ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే ఇంతవరకూ కన్‌ ఫర్మ్‌ చేయలేదూ’ అని నిష్ఠూరంగా మాట్లాడాడు. ‘నీ పేరెక్కడా కనపడలేదురా’ అన్నా. ‘చూడండి... దాసు రాక్‌’ అని ఉంటుంది అన్నాడు. ‘పక్కన ఆ రాక్‌ ఎందుకురా బాబూ’... నాకే చిరాకు వేసింది. పల్లెల్లోకి సోషల్‌ మీడియా ఎంతగా చొచ్చుకుపోయిందో నాకప్పుడు అర్థమైంది. 


నేను మా ఊరు ఎప్పుడొచ్చినా నా మనసంతా నాటుకోడి మీదే ఉంటుంది. ఎప్పుడూ నాకు కోడిని ఇచ్చే రామకృష్ణ ‘ఈసారి నీకు కోడి దొరకదు. అన్నీ జబ్బులొచ్చి చచ్చాయ్‌’ అనేశాడు. కరోనా పుణ్యమా అని సిటీలో బాయిలర్‌ కోడిని తినడమే మానేశా. ఈ నాటుకోళ్లను ఏ వైరస్‌ చంపేసిందో అనుకున్నా. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేద్దామనుకుని ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేశా. ఫోన్‌లో డేటా లేదు. ఒకప్పటి మా పాలేరు వాళ్ళబ్బాయి అక్కడే ఉన్నాడు. నా అవస్థ గమనించి, ‘నా ఫోన్‌లో హాట్‌స్పాట్‌ ఆన్‌ చేశా... డేటా వాడుకోండి’ అన్నాడు. మరోసారి ఖంగు తిని, నేను సరే అనగానే వాడు అందుకున్నాడు. ‘సార్‌! నేను ఊళ్లో ఉండే టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తున్నా. ఇన్‌ స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో నాకు మూడు వేల మంది ఫాలోయర్స్‌ ఉన్నారు’ అన్నాడు. ఈసారి నాకు నోట మాట రాలేదు. 


నేను హైదరాబాద్‌లో ఉండి సాధించింది ఏమిటి? అతను ఇక్కడ ఉండి సాధించనిది ఏమిటి? ఆ తేడా నాకే అర్థం కాలేదు. మొన్న ఎబోలా... ఈరోజు కరోనా... తరిమేస్తే నేను ఈరోజు ఇలా! మన జీవితం ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరుకున్నా.‘మా వాడు అమెరికా’ అని ఒకప్పుడు గర్వంగా చెప్పినవాడు ఇవాళ ‘మా వాడూ అమెరికాలో ఉన్నాడు’ అని ఆందోళనగా చెబుతున్నాడు. కాలమహిమ అంటే ఇదే మరి! పట్నవాసం కన్నా పల్లె జీవితమే మిన్న అనిపించింది.  


కరోనా దెబ్బకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాదు... ‘వర్క్‌ ఫ్రమ్‌ విలేజ్‌’ అనేదే నా నినాదం. స్టే ఎట్‌ హోమ్‌ సరిపోదు... స్టే ఎట్‌ విలేజ్‌ అనాలనిపించింది. చటుక్కున ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టేశా. ఎవరైనా లైక్‌ కొట్టి, షేర్‌ చేస్తారేమోనని చూశా. ఇంతలో ఉన్నట్టుండి, కాపీ కొట్టి పేస్ట్‌ కొట్టేశాడు మా బాబాయి కొడుకు చినబాబు. అదేమంటే ‘నాక్కూడా పేరు రావాలి గదన్నా’ అనేశాడు. ఈ వైరల్‌ చేయాలి, కావాలనుకొనే జాడ్యం కరోనా కన్నా పెద్ద వైరస్‌ అనిపించింది. 

పామర్తి హేమసుందర్‌

Updated Date - 2020-04-02T05:59:01+05:30 IST