మన గీతకు పనిలోనే ఆనందం

ABN , First Publish Date - 2021-12-04T05:30:00+05:30 IST

అంతర్జాతీయ యవనికపై భారతీయ ప్రతిభ మరోసారి రెపరెపలాడింది. ..

మన గీతకు పనిలోనే ఆనందం

అంతర్జాతీయ యవనికపై భారతీయ ప్రతిభ మరోసారి రెపరెపలాడింది.  భారతీయ సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎంపికైంది.   ఆ పదవికి ఎంపికైన తొలి మహిళగా గుర్తింపు పొందింది.


టర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ సంస్థకు గీతా గోపీనాథ్‌ ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసేది. ఇప్పుడామె డైరెక్టర్‌గా ఎన్నికయింది. వాస్తవానికి ఆమె వచ్చే జనవరిలో హార్వర్డ్‌ విశ్వ విద్యాలయానికి వెళ్లి పాఠాలు చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పుడామె ఐఎంఎఫ్‌ సంస్థకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ‘తొలి మహిళగా ఈ బాధ్యత దక్కడం గౌరవప్రదం. వచ్చే సవాళ్లను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. వాస్తవానికి కరోనా సమయంలో ఆమె ఇచ్చిన సలహాలు, ఆర్థికపరమైన విశ్లేషణలు, అభిప్రాయాలు, నిర్ణయాల వల్ల అంతర్జాతీయ ద్య్రవ్యనిధికి ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకే ఈ పోస్ట్‌కు గీతా గోపీనాథ్‌ అర్హురాలైంది. ‘గ్లోబల్‌ ఎకానమీతో పాటు ఫండ్‌కి మేధో నాయకత్వం అవసరం. అప్పుడే ఘోరమైన క్రైసిస్‌నుంచి బయటపడొచ్చు’ అని మాజీ డైరెక్టర్‌ క్రిస్టలీనా అన్నారు.


సాధారణ విద్యార్థి...

పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో 1971లో గీతా గోపీనాథ్‌ పుట్టారు. ఆ తర్వాత కర్ణాటకలోని మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో ఆమె విద్యాభ్యాసం సాగింది. వాస్తవానికి గీతా చదువుల్లో చురుకైనది కాదు. సాధారణ విద్యార్థి. ఏడో తరగతి వరకూ ఆమెకు కేవలం 45 శాతంలోపు మార్కులే వచ్చేవి. ఆ తర్వాతే చదువుల్లో రాణించారు. ‘గీత చిన్నవయసులోనే గిటార్‌ నేర్చుకున్నారు. ఆటలంటే ఇష్టం. ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. తరగతులు పెరిగే కొద్దీ చదువుపై శ్రద్ధ కనబరిచారు’ అని అంటారు గీత తండ్రి టీవీ గోపీనాథ్‌. పదో తరగతి వరకూ తెల్లారుజామునే నిద్రలేవటం.. రాత్రి ఏడున్నరకే నిద్రపోయేది గీత.

 

కలెక్టర్‌ కావాలనుకుంది... 

మైసూర్‌లోని మహాజనా పీయూ కాలేజీలో ఇంటర్‌లో సైన్స్‌ సబ్జెక్ట్‌గా తీసుకున్నారు. ఇంజనీరింగ్‌, మెడిసన్‌కి చదివేంత ప్రతిభ. అయినా సరే ఆమె ఆ తర్వాత బీఏ ఎకనామిక్స్‌ చేయాలనుకున్నారు. ‘ఎకనామిక్స్‌లో చేరటానికి కారణం సివిల్స్‌ లక్ష్యమే. అయితే ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో మూడేళ్ల డిగ్రీ చేశాక ఆమె లక్ష్యం మారిపోయింది. కాలేజీలో మంచి ర్యాంకు సాధించింది. ఎమ్‌బీఏ చేసి డబ్బులు సంపాదించాలనుకుంది. ఇలా లక్ష్యాలు మారాయి’ అంటారు టీవీ గోపీనాథ్‌. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఎ. ఎకనామిక్స్‌ చదివారు. ఉపకారవేతనంతో ప్రిన్‌స్టన్‌ విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత షికాగోలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసి 2010నుంచి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. 2018లో ఐఎమ్‌ఎఫ్‌లో ఆర్థికవేత్తగా పనిచేసే అవకాశం దక్కింది. కరోనా సమయంలో ఆమె తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రతిభ ఆధారంగానే ఆ సంస్థలోనే ఉన్నత పదవి వరించిందిలా.


పనే శక్తి...

ఢిల్లీ యూనివర్శిటీలో చదివే సమయంలోనే ఇక్బాల్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు. ‘‘నేను పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. వర్క్‌హాలిక్‌ పర్సన్‌ను. పనే నాకు శక్తినిస్తుంది. అయితే నా భర్త, నా కొడకు మాత్రం నీ పని పూర్తయ్యేది కాదు అంటూ ఆటపట్టిస్తార’ంటూ ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. ‘చిన్నప్పుడు మా అక్క, నేను వేసవి సెలవుల్లో ఇతర స్నేహితులతో బాగా ఆడుకునేవాళ్లం. మా నాన్న ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. ఇప్పటికీ గుర్తుంది. నువ్వు ఫెయిలయితే.. నేను ఫెయిలయినట్లు’ అని. కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇలా ఉన్నానని అంటారు గీతా గోపీనాథ్‌.


2016 నుంచి 2018 వరకూ కేరళ ముఖ్యమంత్రికి ఎకనమిక్‌ అడ్వైజర్‌గా పని చేశారు. టాప్‌ గ్లోబల్‌ థింకర్‌, ప్రపంచంలోనే ప్రతిభావంతమైన 25 మంది మహిళల్లో ఒకరిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. గతేడాది వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌పైన కనిపించిందీ ఎకనమిస్ట్‌. ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త, ఐఎంఎఫ్‌ డైరక్టర్‌ అయిన గీతా గోపీనాథ్‌కి జుంకాలంటే ఇష్టం. జుంకాలు ధరించే దగ్గరనుంచి లైఫ్‌గోల్స్‌ వరకూ ప్రతిదీ సీరియస్‌గా తీసుకుంటారు. పర్ఫెక్షన్‌ ఆమె బలం. ప్రతిభే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చింది.

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST