పని చేస్తే అభినందన..లేదంటే దండన

ABN , First Publish Date - 2020-07-05T11:39:44+05:30 IST

బాగా పని చేసే వారిని అభినందించి అన్ని విధాల సహకరిస్తామని, అలాగే పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ

పని చేస్తే అభినందన..లేదంటే దండన

15లోగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం పూర్తి చేయాలి

ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు చొరవ తీసుకోవాలి 

నెలాఖరులోగా రైతు వేదికలను నిర్మించాలి

పూర్తి చేయించాల్సిన బాధ్యత వ్యవసాయ, విస్తరణాధికారులదే

కరోనా బాధితులకు మనోధైర్యాన్ని కల్పిద్దాం 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సంగారెడ్డి టౌన్‌, జూలై 4 : బాగా పని చేసే వారిని అభినందించి అన్ని విధాల సహకరిస్తామని, అలాగే పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లతో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15లోగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, ఈ నెలాఖరులోగా రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని అసహనం వ్యక్తంచేశారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీవోలు, వాటి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ఛాలెంజ్‌తో గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.


లక్ష్యం పూర్తయ్యే వరకు ఎంపీడీవోలు, ఎంపీవోలు, అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జహీరాబాద్‌ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులైన డీపీవో, జడ్పీసీఈవో, సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేకాధికారి కలెక్టర్‌ హన్మంతరావు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రైతు వేదికల నిర్మాణాలను ఈ నెల 31లోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత వ్యవసాయ, విస్తరణాధికారులదేనన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్తాయిలో తిరగాలని, పూర్తి చేయించకుంటే ఏఈవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో కలెక్టర్‌ హన్మంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


కోవిడ్‌ బాధితులతో మంత్రి హరీశ్‌రావు సంభాషణ

కరోనా పేషెంట్లకు మనోధైర్యాన్ని ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని మంత్రి హరీశ్‌రావు డాక్టర్లకు సూచించారు. శనివారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలో కోవిడ్‌ కేసుల వివరాలు, పాజిటివ్‌ పేషెంట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా సోకి చికిత్స పొందుతున్న పలువురు బాధితులతో మంత్రి హరీశ్‌రావు సంభాషించారు. హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకుంటున్న మునిపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి, సదాశివపేటకు చెందిన మరో వ్యక్తికి మంత్రి స్వయంగా ఫోన్‌ చేసి వారి ఆరోగ్య పరిస్థితులు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 

  • మంత్రి : హలో నేను మంత్రి హరీశ్‌రావును మాట్లాడుతున్నా ?  ఏ ఊరు మీది ?
  • కొవిడ్‌ బాధితుడు : మాది మునిపల్లి మండలంలోని కంకోల్‌ సార్‌
  • మంత్రి : నీ ఆరోగ్యం ఎలా ఉంది ? ఇంట్లోనే ఉంటున్నావా ? సర్ది ఏమైనా ఉన్నదా ?
  • బాధితుడు : ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా సార్‌. వైద్యులు సూచనల మేరకు రోజూ మందులు వేసుకుంటున్నాను
  • మంత్రి : పండ్లు, గుడ్లు రెగ్యులర్‌గా తింటున్నావా ?
  • బాధితుడు : పండ్లు, గుడ్లు ప్రతిరోజూ తింటున్నాను
  • మంత్రి : వైద్యులు నీ ఆరోగ్యం గురించి ప్రతి రోజూ ఫోన్లు  చేస్తున్నారా ? లేదా ? 
  • బాధితుడు : ప్రతి రోజూ మూడుసార్లు ఫోన్లు చేస్తున్నారు సార్‌
  • మంత్రి : మందులు, పండ్లు, గుడ్లు బాగా తినాలి. ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యులతో దూరంగా ఉండాలి. బయట తిరగొద్దు. వైద్యులు మరోసారి పరీక్షలు చేస్తారు. ఏమైనా అవసరముంటే ఫోన్‌ చేయ్‌
  • బాధితుడు : సరే సార్‌అనంతరం సమీక్షలో అధికారులతో మాట్లాడుతూ ప్రతి రోజూ అడిషనల్‌ డీఎంహెచ్‌వో కరోనా బాధితులపై పర్యవేక్షించాలన్నారు. జిల్లా నుంచి టెస్టుల కోసం పంపిన శాంపిల్స్‌ పెండింగ్‌లో లేకుండా చూడాలని గాంధీ ఆసుపత్రి ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో మోజీరాంరాథోడ్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గ్రామస్థుల సహకారంతోనే అభివృద్ధి 

రాయికోడ్ : పల్లె ప్రగతి కార్యక్రమానికి గ్రామస్థుల సహకరిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, లేదంటే ఏది సాధ్యం కాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాయికోడ్‌ మండల పరిధిలోని సంగాపూర్‌  గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్‌ పార్కును, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికను ప్రారంభించారు. చిల్డ్రన్స్‌ పార్కులో చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షల నిధులు మంజూరు చేశామని ప్రకటించారు. మండలంలోని ఇతర గ్రామాలు కూడా సంగాపూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ హన్మంతరావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బిక్షపతి, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌ పాల్గొన్నారు. 


వ్యవసాయ పాలిటెక్నిక్‌ వసతి గృహం ప్రారంభం

జోగిపేట రూరల్‌ : మండలంలోని సంగుపేట గ్రామ శివారులో రూ.2.43 కోట్ల వ్యయంతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల బాలికల వసతి గృహ భవనాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. పదిహేను వందలకుపైగా ఏఈవో పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ధాన్యం ఆరబెట్టుకోడానికి కల్లాలను నిర్మిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ శేరీ జగన్మోహన్‌, ఆర్డీవో నగేష్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ సుకృతకుమార్‌, ఎంపీపీ బాలయ్య, సర్పంచ్‌ భాగ్యమ్మ, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జునగుప్తా, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


కంకోల్‌లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

మునిపల్లి : మునిపల్లి మండలంలోని కంకోల్‌లో రైతు వేదిక నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశంలో రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విశ్వనాథం, జడ్పీటీసీ మీనాక్షి, శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


పెట్టుబడి రాయితీ అందుతుందా

పుల్‌కల్ : వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి రాయితీ అందుతుందా.. అని రైతులను అడిగి మంత్రి హరీశ్‌రావు తెలుసుకున్నారు. అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్తున్న సందర్భంంలో పుల్కల్‌ మండలం చౌటకూర్‌ గ్రామ శివారులో పత్తి పంటకు ఎరువులు వేస్తున్న రైతులు, రైతు కూలీలను గమనించి తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి ఎరువులు, రైతుబంధు పథకం కింద అందజేస్తున్న పెట్టుబడి రాయితీ ఖాతాలో జమయ్యాయా అంటూ అడిగారు. సమయానికి చేతికందిందని రైతులు తెలపడంతో మంత్రి సంతృప్తి చెందారు. మంత్రి వెంట ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, కలెక్టర్‌ హన్మంతరావు తదితరులున్నారు.

Updated Date - 2020-07-05T11:39:44+05:30 IST