పైసలిస్తేనే..వర్క ఆర్డర్‌

ABN , First Publish Date - 2020-08-12T11:13:31+05:30 IST

కార్పొరేషన్‌లో ఉండాల్సిన వర్క్‌ ఆర్డర్‌లు ఓ కీలక నేత కార్యాలయంలో ఉన్నాయి

పైసలిస్తేనే..వర్క ఆర్డర్‌

ఓ కీలక నేత అల్టిమేటం

కార్పొరేషన్‌లో ఉండాల్సిన వర్క్‌ ఆర్డర్లు ఓ నేత కార్యాలయంలో... 

ఇదీ కార్పొరేషన్‌లో 14వ ఆర్థిక సంఘం పనుల తీరు


(కడప-ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌లో ఉండాల్సిన వర్క ఆర్డర్‌లు ఓ కీలక నేత కార్యాలయంలో ఉన్నాయి. వర్క‌ ఆర్డర్లు కావాలంటే పైసలు చేతిలో పడితేనే ఇస్తామని ఆ నేత చెబుతున్న వ్యవహారం కడప అధికార పార్టీ నేతల్లోని మాజీ కార్పొరేటర్లు, నేతల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కడప కార్పొరేషన్‌కు 14వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ నిధులను తాగునీరు, మురుగు కాల్వలు, రహదారుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. రూ.32.46 కోట్ల వ్యయంతో 221 పనులు చేపట్టాలని కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం టెండర్లను ఆహ్వానించింది.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల ఆదా కోసం అంటూ రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెరపైకి తెచ్చింది. అయితే కడపలో మాత్రం రివర్స్‌ టెండర్లకు తూట్లు పొడిచారు. కాంట్రాక్టర్లను సిండికేట్‌ చేశారు. పనులు దక్కించుకునేందుకు పోటీపడి లెస్‌కు దాఖలు చేయకుండా అధికారులు సూచించిన దానికే కోట్‌ చేయాలంటూ ప్రముఖులు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయ్యారు. ఇందుకు గాను పనులు దక్కించుకునే కాంట్రాక్టర్లు 8 శాతం కొందరికి ఇచ్చేలా పనుల కేటాయింపుల్లో జరిగిన మీటింగ్‌ల్లో ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు వచ్చాయి.


అనుకున్నట్లుగానే.. 

కార్పొరేషన్‌లో టెండర్లు నిర్వహిస్తే ఒక్కో పని కోసం కాంట్రాక్టర్లు పోటీ పడేవారు. అయితే 221 పనులకు టెండర్లు నిర్వహిస్తే 215కు మాత్రమే దాఖలయ్యాయి. వీటిలో 201 పనులకు సింగిల్‌ టెండర్లే దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం సింగిల్‌ టెండరు వస్తే వాటిని రద్దు చేసి రీటెండరు నిర్వహించాల్సి ఉంది. అయితే పనుల పంపకం వల్ల జిల్లాకు చెందిన ప్రముఖుల హస్తం ఉండడంతో టెండరు నిబంధనలకు తూట్లు పొడిచి సింగిల్‌ టెండర్లకే ఓకే చెప్పినట్లు విమర్శలు వచ్చాయి.


పైసలిస్తేనే... 

టెండర్లకు కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టరు ఆమోదం తెలిపారు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వర్క్‌ ఆర్డరు ఇచ్చి పనులు మొదలుపెట్టేలా చూడాల్సి ఉంది. అయితే ముందస్తు జరిగిన ఒప్పందం ప్రకారం కొందరు కాంట్రాక్టర్లు డబ్బులు కట్టలేదని ప్రచారం ఉంది. దీంతో ఆగ్రహించిన ప్రముఖ నేత వర్క్‌ ఆర్డర్లను కార్పొరేషన్‌ నుంచి తెప్పించుకుని ఆమ్యామ్యాలు ఇచ్చిన వారికే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


అసలే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డాం.. సొంత డబ్బులు వెచ్చించాం. అధికారం వచ్చిందిలే కష్టాలు తీరుతాయనుకుంటే మేం పనులు చేసినా కూడా డబ్బులు ఇవ్వాలా అంటూ కొందరు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ కార్పొరేషన్‌ ఈఈ ధనలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా వర్క్‌ఆర్డర్లపై సంతకం చేశామన్నారు. కార్యాలయంలో ఉండాల్సిన ఆర్డర్సు బయటికెలా వెళ్లాయని ప్రశ్నించగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. 

Updated Date - 2020-08-12T11:13:31+05:30 IST