వలస భయం

ABN , First Publish Date - 2020-05-15T10:38:02+05:30 IST

కరీంనగర్‌కు మరోసారి కరోనా దడ పట్టుకున్నది. ఇండోనేషియన్లతో, మర్కజ్‌ లింక్‌తో కరోనా జిల్లాలో అడుగుపెట్టి 19 మందికి ఆ వ్యాధి

వలస భయం

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న కార్మికులు

ముంబై, పూణే, షోలాపూర్‌ నుంచి అత్యధికుల రాక 

గ్రామాల్లో మళ్లీ కలకలం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): కరీంనగర్‌కు మరోసారి కరోనా దడ పట్టుకున్నది. ఇండోనేషియన్లతో, మర్కజ్‌ లింక్‌తో కరోనా జిల్లాలో అడుగుపెట్టి 19 మందికి ఆ వ్యాధి సోకింది. వారంతా చికిత్స అనంతరం కోలుకున్నారు. నాలుగు రోజుల క్రితమే చివరి వ్యక్తి కూడా జిల్లాకు క్షేమంగా వచ్చారు. కరోనా భయం పూర్తిగా వీడకున్నా లాక్‌డౌన్‌ సడలింపుతో, ఆరెంజ్‌ జోన్‌ ప్రకటనతో కొంత ఊపిరి పీల్చుకున్న జిల్లావాసులకు మళ్లీ కరోనా భయం పట్టుకున్నది. మహారాష్ట్ర, గల్ఫ్‌, ఇతర దేశాల నుంచి ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో అలాంటి వారు జిల్లాకు చేరుకుంటున్నారు. ప్రధానంగా ముంబై, షోలాపూర్‌, పూణే నుంచి వలస కార్మికులు ఎక్కువగా జిల్లాకు వస్తున్నారు.


కొందరు వైద్య పరీక్షలు నిర్వహించుకొని అధికారుల అనుమతితో జిల్లాకు చేరుకుంటుండగా మరికొందరు అలాంటి అనుమతులకు ఆలస్యం కావడంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొవలసి రావడంతో దొడ్డిదారిన జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 435 మంది వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకున్నారని చెబుతుండగా వేయి మందికి పైగా వలస కార్మికులు తమతమ గ్రామాలకు వచ్చారని ఇంకా వందల సంఖ్యలో రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. 


పొరుగు జిల్లాల్లో పాజిటివ్‌లు

ముంబై నుంచి వస్తున్న వారిలో పలువురికి కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం గుళ్లకోటకు చెందిన ముంబయ్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అదే జిల్లాలోని రామక్కపల్లికి నలుగురు వ్యక్తులు రాగా వారిలో ఒకరికి గురువారం కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లాలో కూడా ముంబయ్‌ నుంచి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముంబై నుంచి వస్తున్న వారందరిని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే గ్రామాల్లో 14 రోజులపాటు ప్రభుత్వ ఆధీనంలోని క్వారంటైన్‌లో ఉంచాలని పలువురు కోరుతున్నారు. 


స్వగ్రామానికి వచ్చిన వారికి హోం క్వారంటైన్‌

 కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ డివిజన్లకు 170 మంది వివిధ రాష్ట్రాల నుంచి రాగా వారందరిని నగరపాలక సంస్థ అధికారులు గుర్తించి హోంక్వారంటైన్‌ చేశారు.  హుజూరాబాద్‌ మండలానికి చెందిన 37 మంది వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి ఇంటికి చేరుకున్నారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మంది, రామడుగులో 29, కరీంనగర్‌ రూరల్‌లో 35, చొప్పదండిలో 74, మానకొండూర్‌లో 25, జమ్మికుంటలో 39, కొత్తపల్లిలో 14, సైదాపూర్‌ మండలంలో 18, తిమ్మాపూర్‌లో 39 మంది వలస కార్మికులు స్వగ్రామానికి చేరుకున్నారు.


వీణవంక మండలంలో మహారాష్ట్ర నుంచి 32 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 51 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13 మంది, గన్నేరువరం మండలంలో 60 మంది, చిగురుమామిడి మండలంలో ఆరుగురు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు చేరుకున్నారు. వీరందరిని అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారి కుటుంబసభ్యులు బయట తిరిగే అవకాశముంటుందని, వారి ద్వారా వ్యాధివ్యాపించే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, మరోవైపు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా జిల్లాలోని వారివారి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.


హైదరాబాద్‌, ముంబై వంటి నగరాల్లో కరోనా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో అక్కడి నుంచి వచ్చే వారితో ఇక్కడ కూడా వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన చెందుతున్నారు.  బయట నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి నుంచి షాంపిల్స్‌ సేకరించి కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2020-05-15T10:38:02+05:30 IST