వరినాట్లలో నేపాలీ నేస్తాలు!

ABN , First Publish Date - 2022-08-23T10:40:45+05:30 IST

సాగు పనుల్లో ఇతర రాష్ట్రాల కూలీలు పాలు పంచుకోవడం చూశాం! అయితే జగిత్యాల వెళితే అక్కడ మనకు నేపాల్‌కు చెందిన కూలీలూ కనిపిస్తారు. గుర్ఖాలుగానే కాదు, ఇప్పుడు వ్యవసాయ పనుల కోసమూ హిమాలయ

వరినాట్లలో నేపాలీ నేస్తాలు!

జగిత్యాల జిల్లాకు 50 మంది రాక..

రెండు బృందాలుగా ఏర్పడి పనులు

ఎకరా పొలం నాటుకు రూ.5వేలు..

రైతులు ఖుషీ.. కూలీ భారం తగ్గుదల


జగిత్యాల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సాగు పనుల్లో ఇతర రాష్ట్రాల కూలీలు పాలు పంచుకోవడం చూశాం! అయితే జగిత్యాల వెళితే అక్కడ మనకు నేపాల్‌కు చెందిన కూలీలూ కనిపిస్తారు. గుర్ఖాలుగానే కాదు, ఇప్పుడు వ్యవసాయ పనుల కోసమూ హిమాలయ దేశీయులు మన గడ్డ మీదకు వస్తున్నారు! ఇప్పుడంతా వరినాట్ల సీజన్‌ కదా.. నేపాలీ కూలీలు జోరుగా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. రెండేళ్ల క్రితం నుంచి బిహార్‌, యూపీ, ఒడిసా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరినాట్లకు కూలీలు వచ్చేవారు. కూలీల కొరత, కూలీ రేట్లు పెరగడంతో ఏజెంట్ల దృష్టి నేపాల్‌ వైపు మళ్లింది. వరినాట్ల కోసమే ప్రత్యేకంగా నేపాల్‌ నుంచి 50 మంది కూలీలను రప్పించారు. వీరిలో పది మంది మహిళలున్నారు.


రెండు బృందాలుగా ఏర్పడి కోరుట్ల మండలం పైడిమడుగు, జోగినిపల్లి, నాగులపేట, మాదాపూర్‌లో నాట్లు వేస్తున్నారు. 25 మంది కూలీలు ఎకరా నాటుకు రూ.5వేలు తీసుకుంటున్నారు. స్థానిక కూలీల్లో మహిళలకైతే రూ.800, పురుషులకు రూ.1,000 కూలీ ఉంది. ఆరుగురితో రోజులో ఎకరాలోనే నాటు వేయొచ్చు. అయితే 25 మంది నేపాలీలు ఎకరాకు రూ.5వేలు తీసుకొని రోజుకు 6-8 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. దీంతో కూలీ రేట్ల భారం తగ్గడంతోపాటు వేగంగా పనులు అవుతున్నాయని రైతులు అంటున్నారు. నేపాలీలకూ ఈ కూలీ గిట్టుబాటు అవుతోంది. మన రూపాయిని వారి దేశంలో మార్చుకుంటే రూ.1.60 వస్తాయి. ఇక్కడ రూ.5వేలు చెల్లిస్తే అక్కడి కరెన్సీలో రూ.8వేలు అన్నమాట. నేపాలీ కూలీలకు ఆయా గ్రామాల్లోని కమ్యూనిటీ హాళ్లు, సంఘ భవనాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కొందరు రైతులు ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు సరుకులిస్తున్నారు.  


ఉపాధి కోసం వలస వచ్చాం

ఉపాధి కోసం నాట్లు వేసేందుకు వలస వచ్చాం.  ఇక్కడి రైతులు ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నారు. నాట్ల పనులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోతాం.  

- దమయంతి ఠాకూర్‌, వలస కూలీ, నేపాల్‌

Updated Date - 2022-08-23T10:40:45+05:30 IST